ప్రకాశం జిల్లా: చంద్రబాబు కూటమి ప్రభుత్వం తీసుకున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రద్దు చేస్తారని వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దొడ్డా అంజిరెడ్డి స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలో సోషల్ మీడియా ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు అధ్యక్షతన ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో అంజిరెడ్డి మాట్లాడుతూ..మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ చేపడుతున్నట్లు చెప్పారు. సోషల్ మీడియా నేతృత్వంలో కూడా సంతకాలు సేకరిస్తున్నట్ల తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీల అభివృద్ధి నిలిచిపోయిందని, కొత్తగా ఒక్క ఇటుక కూడా వేయని పరిస్థితి నెలకొన్నదని అన్నారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకువస్తే, వాటిలో 5 పూర్తై ప్రజల సేవలోకి వచ్చాయని ఆయన గుర్తు చేశారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఈ సీట్లు కూడా వద్దని నేషనల్ మెడికల్ కౌన్సిల్ కు లేఖ రాసిందని, దీని వెనుక చంద్రబాబు నాయుడు కుట్ర ఉందని ఆరోపించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వైయస్ఆర్‌సీపీ అడ్డుకుంటుందని హెచ్చరించారు.