రైతుల సమస్యల పరిష్కారంపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు

మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఫైర్‌

తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి, పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ .

వ్యవసాయం దండగ అనే ఆలోచనలోనే చంద్రబాబు  

నాలుగోసారి ముఖ్యమంత్రి అయినా మారలేదు

ప్రజా సమస్యలపై ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరించడం లేదు  

మొంథా తుపాన్‌తో రైతులు అల్లాడుతుంటే చంద్రబాబు విదేశీ పర్యటనలు  

క్రికెట్‌ మ్యాచ్‌లు చూస్తూ మంత్రి నారా లోకేష్‌ వినోదం

షూటింగ్‌ మాదిరిగా హడావిడితో పవన్‌ మొక్కుబడి పరామర్శ

ప్రెస్‌మీట్‌లో గుర్తు చేసిన మాజీ మంత్రి చెల్లుబోయిన

తాడేపల్లి: నాలుగోసారి ముఖ్యమంత్రి అయినా ఇప్పటికీ వ్యవసాయం దండగ అనే ఆలోచనలోనే చంద్రబాబు ఉన్నారని ఆయన పాలన చూస్తే ఎవరికైనా అదే అర్థం అవుతుందని వైయ‌స్ఆర్‌సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్పష్టం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 60 శాతానికి పైగా ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నా, రైతు సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదన్నారు. మొంథా తుపాన్‌తో రైతులు తీవ్రంగా నష్టపోయి కన్నీళ్లు పెట్టుకుంటే చంద్రబాబు విదేశీ పర్యటనకు, నారా లోకేష్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు చూడటానికి దేశ విదేశాల్లో తిరుగుతూ ఎంజాయ్‌ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రెస్‌మీట్‌లో చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఏం మాట్లాడారంటే..:

● బాధ్యత మరిచిన ప్రభుత్వం:

    బాధ్యత వహించాల్సిన వ్యవస్థలు బాధ్యతా రాహిత్యంగా పనిచేస్తే ప్రజలు తమ కష్టాలు తీరక మౌనంగా రోదిస్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న పరిపాలన తీరిదే. మొంథా తుపాన్‌తో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఆదుకునే వారికోసం కన్నీరు పెడుతుంటే వారిని పట్టించుకోవడం మానేసి సీఎం చంద్రబాబు వ్యక్తిగత పర్యటన అంటూ లండన్‌కు వెళ్తే, కొడుకు నారా లోకేష్‌ దేశ విదేశాల్లో క్రికెట్‌ మ్యాచ్‌లు చూస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలు తుపాన్‌ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయారు. ఆయన కూడా తూతూమంత్రంగా వచ్చిపోయారే తప్ప బాధితులకు న్యాయం చేసే ఆలోచన చేయలేదు. వీటన్నింటి నుంచి డైవర్షన్‌ కోసం ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని జగన్‌గారి మీద, వైయ‌స్ఆర్‌సీపీపైనా బురద జల్లడం టీడీపీకి పరిపాటిగా మారింది.

● రైతు వ్యతిరేకిగానే చంద్రబాబు:

    చంద్రబాబు మరోసారి రైతు వ్యతిరేకి అని నిరూపించుకున్నాడు
వ్యవసాయం రంగం మీద చంద్రబాబుకి ఎలాంటి అభిప్రాయం ఉందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. వ్యవసాయం దండగ అని పుస్తకం మనసులో మాట ద్వారా ఆయన చెప్పిన మాటలు తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. ఆనాడు దివంగత వైయస్సార్‌ వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ ఇస్తామని అసెంబ్లీలో చెప్పినప్పుడు, అలా చేస్తే తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని చెప్పిన వ్యక్తి చంద్రబాబు. బీడు బారిన నేలల్లో జల సిరులు పారించాలని నాడు వైయస్సార్‌ జలయజ్ఞం కార్యక్రమానికి శ్రీకారం చుడితే దాన్ని ధనయజ్జం అని చంద్రబాబు ప్రచారం చేశాడు. నాలుగుసార్లు సీఎం చేసినా పోలవరం పూర్తి చేయకుండా రైతుల జీవితాలతో ఆడుకుంటున్నాడు. మూడు పంటలు పండే భూమిని రాజధాని ప్రాంతం కోసం ఎంపిక చేసిన విధానం చూసినా ఆయన రైతు వ్యతిరేకి అని చెప్పక తప్పదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీకి వ్యవసాయమే ప్రధాన వనరుగా మారినా చంద్రబాబు మాత్రం వ్యవసాయం, రైతు సమస్యల విషయంలో ఇప్పటికీ అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

● గత ప్రభుత్వంలో వ్యవసాయం పండగ:

    గత వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో నాటి సీఎం వైయస్‌ జగన్‌ రైతుకు అడుగడుగునా అండగా నిలిచారు. ఆర్బీకేల ద్వారా విత్తనం నుంచి విక్రయం వరకు రైతుల చేయిపట్టి నడిపించారు. రైతులు పండించిన అన్ని పంటలకు మద్ధతు ధరలు కల్పించడమే కాకుండా రైతు భరోసా ద్వారా ఏడాదికి రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం ఇచ్చి ఆదుకున్నారు. ఇది కాకుండా ఐదేళ్లలో పంట నష్టం పరిహారంగా రూ.7802 కోట్లు అందజేసి రైతు పక్షపాతిగా నిలిచారు.
    కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఉచిత పంటల బీమా పూర్తిగా ఎత్తేశారు. ఈ–క్రాపింగ్‌ తూతూ మంత్రంగా చేస్తున్నారు. టీడీపీ వారికి ఏకంగా ఉన్న భూమి కన్నా, ఎక్కువ పంట వేశారని చూపుతున్నారు. ఇతరులకైతే పూర్తిగా ఆపేసి వేధిస్తున్నారు. ఇది అత్యంత హేయం. 

● చంద్రబాబుకి డైవర్షన్‌ తప్ప డైరెక్షన్‌ రావడం లేదు:

    ఆలయాల్లో ప్రమాదాలు జరిగినప్పుడు కారకులపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం అందులోనూ రాజకీయాలు చేసి మరణించిన వారి కుటుంబాలకు తీరని క్షోభను కలిగిస్తున్నారు. కాశీబుగ్గ ఆలయంలో ప్రమాదం జరిగినప్పుడు ప్రైవేటు ఆలయం అని చెప్పి 95 ఏళ్ల వయసున్న ఆలయ నిర్వాహకుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు, తిరుపతి, సింహాచలం ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో భక్తులు మరణిస్తే సంబంధిత అధికారులు, ఆలయ నిర్వాహకులపై చర్యలు తీసుకోకుండా వదిలేశాడు. ఇదంతా చూస్తుంటే సీఎం చంద్రబాబుకి డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేయడం తప్ప పాలనలో డైరక్షన్‌ చేతకావడం లేదని స్పష్టంగా అర్థమవుతోంది. 
    అవసరాల కోసం చట్టాలను చుట్టాలుగా మార్చుకుంటూపోతే ప్రజలకు వ్యవస్థలపై నమ్మకం సన్నగిల్లదా అని ఆలోచించుకోవాలి. పాలించమని ప్రజలు చంద్రబాబుకి అవకాశం ఇస్తే తన గురించి మాత్రమే ఆలోచించి ప్రజలను గాలికొదిలేస్తున్నాడు. తన స్వలాభాల కోసం ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టాడు. ధనదాహంతో, స్వీయ తప్పిదాలతో దశాబ్దాల కలగా ఉన్న పోలవరం ప్రాజెక్టును ప్రశ్నార్థకంగా మార్చేశాడు. చేతిలో మీడియా ఉంది కదా, అబద్ధాలతో దేన్నయినా మేనేజ్‌ చేయొచ్చన్న భ్రమల్లో బతుకుతున్నారు.
    ఇవే అబద్ధాలు చంద్రబాబును, కూటమి ప్రభుత్వాన్ని దహించి వేయడం తథ్యం. రైతును మానసిక క్షోభకు గురి చేస్తున్న ఈ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో వారే ఖచ్చితంగా గుణపాఠం చెబుతారని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తేల్చి చెప్పారు.

Back to Top