పులివెందుల వైద్య కళాశాలపై కూటమి కక్ష్యం

ఎంపీ వైయ‌స్ అవినాష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం

వైయ‌స్ఆర్ జిల్లా :  కూట‌మి ప్ర‌భుత్వం పులివెందుల వైద్య క‌ళాశాల‌పై క‌క్ష‌గ‌ట్టింద‌ని ఎంపీ వైయ‌స్ అవినాష్‌రెడ్డి మండిప‌డ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో నెల రోజులుగా జరుగుతున్న వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం రోజురోజుకూ ఉధృతమవుతోంద‌ని చెప్పారు . ప్రజలు పెద్ద ఎత్తున ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా వీధులపైకి వస్తున్నార‌ని, ర‌చ్చ‌బండ‌-కోటి సంత‌కాల కార్య‌క్ర‌మంలో స్వ‌చ్ఛందంగా పాల్గొంటున్నార‌ని చెప్పారు.  బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..“  మెడిక‌ల్ కాలేజీల‌పై ప్రజల వ్యతిరేకతను లెక్కచేయకుండా, పులివెందుల మెడికల్ కాలేజీలో ఉన్న అత్యాధునిక పరికరాలను రహస్యంగా ఇతర చోట్లకు తరలిస్తున్నారు. వైయ‌స్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కాలేజీకి అత్యాధునిక వైద్య పరికరాలు సమకూర్చారు. కానీ ఇప్పుడు వాటిని సైతం తరలించి, కాలేజీని బలహీనపరచే ప్రయత్నం జరుగుతోంది” అని ఆరోపించారు.

“సీట్లు రాకుండా చేసి, పరికరాలు కూడా తీసేస్తారా?”
వైద్య విద్యను అందరికీ అందుబాటులో ఉంచాలన్న వైయ‌స్ జగన్ లక్ష్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం పులివెందుల మెడిక‌ల్ కాలేజీకి సీట్లు రాకుండా చేశార‌ని ఎంపీ అవినాష్‌రెడ్డి ధ్వజమెత్తారు. “మొదట మెడికల్ సీట్లు రాకుండా అడ్డుపడ్డారు... ఇప్పుడు పరికరాలు కూడా తరలిస్తున్నారు. ఇది ప్రజల ఆరోగ్య హక్కులపై దాడి” అని ఆయన అన్నారు. “ఈ ప్రాంతం వైయ‌స్ కుటుంబానికి చెందినదనే కారణంగా పులివెందులపై కూటమి ప్రభుత్వం కక్ష్యతో వ్యవహరిస్తోందా? ఈ ప్రాంత ప్రజలు రాష్ట్ర అభివృద్ధికి ఇచ్చిన కృషిని మరచిపోయారా?” అని ప్రశ్నించారు. “పులివెందుల ప్రజలు దీనిపై సమాధానం కోరుతున్నారు. ఈ ప్రాంత టీడీపీ నేతలు ప్రజలకు ఏమి వివరణ ఇస్తారు?” అని అవినాష్ రెడ్డి నిలదీశారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. పులివెందుల మెడికల్ కాలేజ్‌ పరికరాల తరలింపును నిలిపి వేయాల‌ని వైయ‌స్ అవినాష్ రెడ్డి హెచ్చరించారు.

Back to Top