కూటమి ప్రభుత్వం చేతుల్లో రైతన్న దగా

కరువు మండలాల ప్రకటనలో జిల్లాకు తీవ్ర అన్యాయం

జూన్, జూలై, సెప్టెంబర్‌లో వర్షం జాడే లేని పరిస్థితి

అధికారులు ఇచ్చిన నివేదికలే ఇందుకు సాక్ష్యం

ఆగస్టులో అధిక వర్షపాతం నమోదైతే ఖరీఫ్‌ సీజన్‌కు కలిపేస్తారా?

అధికారుల తీరుతో పెద్ద ఎత్తున నష్టపోనున్న రైతులు

జిల్లాలో ఏ పంటా దిగుబడి లేని పరిస్థితి  

తక్షణం పునఃసమీక్ష చేసి ప్రభుత్వానికి నివేదిక పంపండి

రైతుల కష్టాలు ప్రజాప్రతినిధులకు కన్పించడం లేదా? 

రబీ సీజన్‌ ప్రారంభమై నెల దాటినా పప్పుశనగ పంపిణీ చేయరా?

మంత్రి పయ్యావుల నియోజకవర్గంలోనే అధికంగా పప్పుశనగ సాగు

చంద్రబాబు గారూ.. తుఫానే కాదు ఇక్కడి కరువునూ గుర్తించండి

మీడియా సమావేశంలో వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి

అనంతపురం :  కూటమి ప్రభుత్వం చేతుల్లో జిల్లా రైతాంగం మరోసారి దగాకు గురైందని వైయ‌స్‌ఆర్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. కరువు మండలాల ప్రకటనలో అనంతపురం జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు. మంగళవారం అనంతపురంలోని వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లలో కూడా పెద్ద ఎత్తున రైతులు నష్టపోయారని, అయినా ప్రజాప్రతినిధులు ఏనాడూ మాట్లాడిన పాపానపోలేదన్నారు. కేవలం మాటలకే పరిమితం అయ్యారని ధ్వజమెత్తారు. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో అయినా ఆదుకుంటారని అనుకుంటే మొండిచేయి చూపారన్నారు. ఈ ఖరీఫ్‌లో జిల్లా రైతాంగంతో ప్రకృతి దోబూచులాడిన విషయాన్ని గుర్తు చేశారు. జూన్‌ నెల ప్రారంభంతో పెద్ద ఎత్తున వర్షాలు కురిస్తే రైతుల్లో ఆశలు చిగురించి సాగుకు సన్నద్ధం అయ్యారని తెలిపారు. అనంతపురం జిల్లాలో అన్ని పంటలు కలిపి సాధారణ సాగు విస్తీర్ణం 8.50 లక్షల ఎకరాలు ఉంటే ఖరీఫ్‌లో 7.50 లక్షల ఎకరాల్లో సాగు చేశారని తెలిపారు. వేరుశనగ పంట సాధారణ సాగు 4.70 లక్షల ఎకరాలుంటే 2.25 లక్షల ఎకరాల్లో సాగైందన్నారు. జూన్‌ 5వ తేదీ తర్వాత నుంచి ఆగస్టు తొలి వారం వరకు సుమారు 55 నుంచి 58 రోజుల పాటు జిల్లాలో ఎక్కడా వర్షాలు కురవలేదని తెలిపారు. ఫలితంగా సాగు చేసిన పంటలు ఎండిపోయిన పరిస్థితి వచ్చిందన్నారు. పత్తి పంట తుడిచిపెట్టుకు పోయిందని, కంది పంట రానీరానట్లు తయారైందన్నారు. 

వేరుశనగ మొండిపైరు కాబట్టి ఎదుగుదల లేకుండా అలాగే ఉండిపోయిందని చెప్పారు. ఆగస్టు 3వ తేదీన వర్షపాతానికి సంబంధించి అధికారులు విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారమే జిల్లాలో 7 మండలాల్లో తీవ్ర వర్షాభావం, 17 మండలాల్లో వర్షాభావం, 7 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైందని తెలియజేశారు. ఆగస్టు నెలలో అధిక వర్షపాతం నమోదైతే సెప్టెంబర్‌లో మళ్లీ వర్షం జాడే లేకుండాపోయిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే పంటలకు తెగుళ్లు కూడా వ్యాపించినట్లు చెప్పారు. ఏ పంట కూడా దిగుబడి వచ్చే పరిస్థితి లేదన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే ఖరీఫ్‌ సీజన్‌లోని నాలుగు నెలలను పరిగణలోకి తీసుకుని సాధారణ వర్షపాతంగా ప్రభుత్వానికి నివేదిక పంపి జిల్లా రైతాంగాన్ని నట్టేట ముంచారని మండిపడ్డారు. 

అక్టోబర్‌ 31వ తేదీన రాష్ట్రంలోని ప్రకాశం, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాల్లో కరువు మండలాలు ప్రకటిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో 25 మండలాలను కరువు మండలాలు ప్రకటిస్తే.. పక్కనే ఉన్న అనంతపురం జిల్లాలో ఒక్క మండలాన్ని కూడా ప్రకటించలేదని అన్నారు. ఒకసారి కరువు మండలాలు ప్రకటిస్తే కేంద్ర బృందం పర్యటించి రైతాంగాన్ని ఆదుకునే పరిస్థితి ఉంటుందని గుర్తు చేశారు. అదేవిధంగా ఇన్‌పుట్‌ సబ్సిడీ అందుతుందని, ఉపాధి పనులు కూడా ఆయా మండలాల్లో అధికంగా కల్పిస్తారని తెలిపారు. జిల్లాలో వాస్తవ పరిస్థితులు పట్టించుకోకుండా ఖరీఫ్‌లో కేవలం ఒక నెలలో (ఆగస్టు) అధిక వర్షం వచ్చిందన్న కారణంతో సీజన్‌ మొత్తాన్ని సాధారణ వర్షపాతంగా చూపి కరువు మండలాలు ప్రకటించరా? అని ప్రశ్నించారు. జిల్లాలో కేవలం వేరుశనగ పంట మాత్రమే 2.25 లక్షల ఎకరాల్లో సాగు చేశారని, రైతులు ఈ ఒక్క పంట మీదే సుమారు రూ.450 కోట్ల నుంచి రూ.480 కోట్ల వరకు పెట్టుబడి పెట్టారని తెలిపారు. ఇప్పుడు పంట పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడంతో రైతాంగం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని తెలిపారు. జిల్లా రైతాంగానికి ఇంత అన్యాయం చేసేలా కలెక్టర్, జిల్లా అధికారులు నివేదికలు ఇస్తారా? అని ప్రశ్నించారు. కనీసం ఒక్క సమీక్ష చేశారా? అని అన్నారు.  జిల్లాలో ప్రజాప్రతినిధులు అందరూ అధికార పార్టీకి చెందిన వాళ్లేనని.. మంత్రి, మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉన్న వాళ్లూ ఉన్నారన్నారు. వాళ్లంతా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లేనని, అలాంటి వాళ్లు కూడా రైతుల గురించి పట్టించుకోకపోతే ఎలా అని ప్రశ్నించారు. 

అక్టోబర్‌ 31వ తేదీ కరువు మండలాల జీవో వచ్చినా ఇప్పటికీ ఒక్కరు కూడా స్పందించలేదన్నారు. పత్రికల్లో కథనాలు వచ్చినా ఎమ్మెల్యేల్లో చలనం లేదన్నారు. జిల్లాలో ప్రజాప్రతినిధులు సొంత ఆదాయ వనరులు పెంచుకోవడమే పనిగా పెట్టుకున్నారని, రైతుల కష్టాలు పట్టడం లేదని మండిపడ్డారు. రబీ సీజన్‌కు సంబంధించి సబ్సిడీతో పప్పుశనగ విత్తనం పంపిణీలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో 40 శాతం సబ్సిడీతో విత్తనం అందిస్తే నేడు 25 శాతానికి కుదించారని తెలిపారు. జిల్లాలో ఇప్పటికే సుమారు 40 వేల హెక్టార్లలో పప్పుశనగ సాగైందని,.. కానీ, ప్రభుత్వం సబ్సిడీ విత్తనం పంపిణీ చేయకపోవడం ఏంటని ప్రశ్నించారు. గతంలో యూరియాను బ్లాక్‌ మార్కెట్‌కు తరలించినట్లు ఇప్పుడు రైతులు పంట సాగు చేసేశాక సబ్సిడీ విత్తనాన్ని అమ్ముకుంటారా? అని నిలదీశారు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలోనే అత్యధికంగా పప్పుశనగ సాగు చేస్తారని, అక్కడ అన్యాయం జరిగినా నోరు రాదా? మనసు లేదా? అని తెలిపారు. వ్యవసాయం విషయంలో ఇంత ఘోర తప్పిదాలు జరుగుతున్నా అడిగేవాళ్లు లేరన్నారు. తాము ప్రశ్నిస్తే రాజకీయంగా దాడి, విమర్శలు చేసి వాళ్లు చేసే ఆకృత్యాలను దాచిపెట్టుకోవడానికి ప్రయత్నిస్తారని తెలిపారు. అసలే అనంతపురం జిల్లా దేశంలోనే అత్యంత తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లా అని.. ఇక్కడ వలసలు, ఆత్మహత్యలు కూడా అధికమని తెలిపారు. 

‘‘గతంలో బెంగళూరు, హైదరాబాద్, ముంబయి ప్రాంతాలకు వలసలు వెళ్లిన పరిస్థితులు మనమంతా చూశాం. చావులు చూశాం. ఆత్మహత్యలు చూశాం. ఇప్పుడిప్పుడే కుదుటపడుతుంటే మళ్లీ గత పరిస్థితులు తెస్తారా?’’ అని అనంత ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోనే ఉపాధి హామీ పథకం అనంతపురం జిల్లాలో ప్రారంభమైందంటే ఇక్కడి పరిస్థితులే అందుకు కారణమని తెలిపారు. తాజాగా కరువు మండలాలు ప్రకటించకపోవడంతో రైతులకు జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారని ప్రశ్నించారు. ఇటీవల సీఎం చంద్రబాబు శ్రీసత్యసాయి జిల్లాకు వచ్చారని, జిల్లా ప్రజాప్రతినిధులు ఎందుకు అడగలేకపోయారన్నారు. ఇప్పటికైనా కళ్లు తెరవాలని, పునఃసమీక్ష చేసి కరువు మండలాలు ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. జిల్లా కలెక్టర్‌ తక్షణం అధికారులతో సమీక్ష చేసి నివేదిక పంపాలని కోరారు. కలెక్టర్, ఎస్పీలు ఉన్నది ప్రజాప్రతినిధులకు గంగిరెద్దుల్లా తలూపడానికి కాదని.. మీకంటూ ఓ చట్టం, అధికారం ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. గతంలో తాము అధికారంలో ఉన్నా సమీక్షల్లో ఎప్పటికప్పుడు ప్రజలు, రైతుల సమస్యలను లేవనెత్తామని, కానీ ఇప్పుడు ఒక్కరు కూడా నోరు విప్పడం లేదన్నారు. తుఫాను మాత్రమే కాదు.. అనంతపురం జిల్లాలో కరువు పరిస్థితులను కూడా సీఎం చంద్రబాబు గుర్తించాలని కోరారు.

Back to Top