నెల్లూరు జిల్లా: టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అక్రమ వసూళ్లను ప్రశ్నించడం తప్పా అని మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు నగరంలోని అపోలో ఆసుపత్రిలో గత రాత్రి టిడిపి నాయకుల విచక్షణారహిత దాడిలో గాయపడి, ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ జాయింట్ సెక్రెటరీ బదనాపురి గోపాల్‌ను ఆయన పరామర్శించారు. గోపాల్ ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకొని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం కాకాణి మీడియాతో మాట్లాడుతూ..` గోపాల్ లాంటి యువకుడిపై దాడి చేయడం దుర్మార్గం. గోపాల్ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. పార్టీ పక్షాన, తన గొంతును బలంగా వినిపించడాన్ని స్థానిక తెలుగుదేశం నాయకులు తట్టుకోలేకపోయారు. నిన్న అర్ధరాత్రి సమయంలో వెంకటాచలం మండలంలోని ఎస్టీ కులానికి చెందిన బదనాపురి గోపాల్పై దాడి చేసి, హతమార్చే ప్రయత్నం చేశారు. దాడి జరిగిన వెంటనే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వెంకట శేషయ్య స్పందించడంతో గోపాల్ ను హుటాహుటిన నెల్లూరు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి, వైద్యం అందించడంతో ప్రాణాపాయం కలగకుండా కాపాడుకోగలిగాం. గోపాల్ కళ్ల ముందే, ఆయన భార్యను మహిళా అని కూడా చూడకుండా, గొంతు పట్టుకొని బీభత్సవం చేశారు. రాష్ట్రంలో అర్ధరాత్రి నిద్రిస్తున్న వాళ్ళ ఇళ్లపై వెళ్లి, నిర్భయంగా దాడులకు పాల్పడుతున్నారంటేనే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఊహించుకోవచ్చు. సోమిరెడ్డి ముఠా ధర్మల్ విద్యుత్ కేంద్రాల నుండి బూడిద తరలిస్తున్న బంకర్ల నుండి 300 రూపాయలు చొప్పున అక్రమంగా వసూలు చేస్తున్నారని చెప్పాం. సోమిరెడ్డి పామాయిల్ ట్యాంకర్ల నుండి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న మాట వాస్తవమా!, కాదా! సోమిరెడ్డి ముఠా అక్రమ వసూళ్ల గురించి చంద్రబాబు స్థానిక అధికారుల విచారించినా, వాస్తవం తెలుస్తుంది. అక్రమ వసూళ్ల గురించి మాట్లాడితే, సోమిరెడ్డి, తెలుగుదేశం నాయకుల చేత విమర్శలు చేయించాడు. గోపాల్ తెలుగుదేశం నాయకుల్లో విమర్శలకు ప్రతిస్పందనగా, స్థాయికి మించి విమర్శలు చేయవద్దని చెప్పడం తప్పా! వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఎవరైనా విమర్శలు చేస్తే, పార్టీ నాయకులు సమయమనంతో ఉండాలని సూచించాం. చంద్రబాబు పరిపాలనలో ఏ వర్గానికి రక్షణ లేకుండా పోయింది` అని కాకాణి పేర్కొన్నారు.