క‌ష్ట‌కాలంలో `రైతు భ‌రోసా`.. నేడే విడుద‌ల‌

52.38 ల‌క్ష‌ల మంది రైతుల‌కు రూ.3,928.88 కోట్ల సాయం

గతేడాది కంటే 79,472 మందికి అదనంగా ప్రయోజనం

గతేడాదితో పోల్చితే అదనంగా 32,083 మంది కౌలుదారులకు లబ్ధి

రైతుల బ్యాంక్ ఖాతాల్లో నేడు నగదు జమ చేయనున్న సీఎం వైయ‌స్‌ జగన్‌

తాడేప‌ల్లి: అన్న‌దాత‌కు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా భరోసాగా నిలుస్తోంది. కరోనా కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులను సైతం లెక్క చేయకుండా వైయ‌స్ఆర్ రైతు భ‌రోసా ప‌థ‌కం కింద రైత‌న్న‌కు వైయ‌స్ జ‌గ‌న్ స‌ర్కార్ సాయం అందిస్తోంది. ఇచ్చిన మాటకు కట్టుబడి గత రెండేళ్ల మాదిరిగానే ఈ ఏడాది కూడా సీజన్‌ ప్రారంభం కావడానికి ముందే రైతన్న చేతిలో పెట్టుబడి సాయం పెడుతోంది. వైయ‌స్ఆర్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ కింద నేడు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తొలి విడత సాయం అందించనున్నారు. 

వైయ‌స్ఆర్‌ రైతు భరోసాకు ఈ ఏడాది 52,38,517 రైతు కుటుంబాలు అర్హత పొందగా, వీరిలో 1,86,254 మంది భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అటవీ సాగు దారులున్నారు. వీరందరికీ పీఎం కిసాన్‌ కింద రూ.1,010.45 కోట్లు, రైతు భరోసా కింద రూ.2,918.43 కోట్లు కలిపి.. తొలి విడతగా రూ.3,928.88 కోట్లు జమ చేయనున్నారు. 

ఈ ఏడాది 79,472 కుటుంబాలు అదనం 
ఈ ఏడాది అర్హత పొందిన వారిలో భూ యజమానులు 50,52,263 మంది ఉండగా (యానాం రైతులతో కలిపి), భూమి లేని 1,86,254 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అటవీ సాగుదారులతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంకు చెందిన 865 రైతు కుటుంబాలు లబ్ధి పొందనున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 79,472 రైతు కుటుంబాలు అదనంగా లబ్ధి పొందనున్నాయి. ఈ ఏడాది 32,083 మంది కౌలుదారులు కొత్తగా లబ్ధి పొందనున్నారు. 50,52,263 మంది భూ యజమానులకు పీఎం కిసాన్‌ కింద తొలి విడతగా రూ.2 వేల చొప్పున కేంద్రం రూ.1010.45 కోట్లు సర్దుబాటు చేస్తుండగా, రైతు భరోసా కింద రూ.5,500 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం రూ.2,778.74 కోట్లు సాయమందిస్తోంది.

ఇక భూమి లేని 1,86,254 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అటవీ సాగుదారుల కుటుంబాలకు రూ.7,500 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కింద తొలి విడతగా రూ.139.69 కోట్లు సర్దుబాటు చేస్తోంది. ఈ విధంగా ఈ ఏడాది కౌలుదారులతో సహా అర్హత పొందిన 52,38,517 రైతు కుటుంబాలకు పీఎం కిసాన్‌ కింద రూ.1010.45 కోట్లు, రైతు భరోసా కింద రూ.2,918.43 కోట్లు కలిపి వైయ‌స్ఆర్ రైతు భరోసా–పీఎం కిసాన్‌ కింద తొలివిడతగా రూ.3928.88 కోట్లు నేడు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. గత రెండేళ్లలో రూ.13,101 కోట్లు సాయం అందించిన ప్రభుత్వం ఈ ఏడాది రూ.7,071.80 కోట్లు అందించనుంది. మొత్తంగా మూడేళ్లలో అన్నదాతలకు రూ.20,172.8 కోట్ల లబ్ధి చేకూరుతోంది. 

మూడు విడతల్లో సాయం
వైయ‌స్ఆర్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ కింద ప్రభుత్వం ప్రతి ఏటా మూడు విడతల్లో రూ.13,500 పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది. ఈ మొత్తంలో రూ.7,500 మే నెలలో, రూ.4 వేలు అక్టోబర్‌లో, మిగిలిన రూ.2 వేలు జనవరిలో జమ చేస్తున్నారు. భూ యజమానులకు మాత్రమే పీఎం కిసాన్‌ కింద కేంద్రం మూడు విడతల్లో రూ.6 వేల చొప్పున జమ చేస్తోంది. ఎలాంటి భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులతో పాటు దేవదాయ, అటవీ, వక్ఫ్‌ తదితర ప్రభుత్వ భూములను సాగు చేస్తున్న కౌలుదారులకు రూ.13,500 చొప్పున వైయ‌స్ఆర్‌ రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top