ఫిబ్రవరి 1 నుంచి ఫించన్ల డోర్‌ డెలివరీ

ఉగాది నాటికి ఇళ్ల పట్టాలను పంపిణీ 

ఫిబ్రవరి 28న జగనన్న విద్యా, వసతి దీవెన పథకాలు ప్రారంభం

ఫిబ్రవరి 28న 3300 రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించాలి

సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశాలు

తాడేపల్లి: ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఫించన్లు డోర్‌ డెలివరీ చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌ స్పందన కార్యక్రమంపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్లకు పలు ఆదేశాలు సీఎం జారీ చేశారు. కొత్త ఫించన్లు ఫిబ్రవరిలో మంజూరు చేయాలని సూచించారు. ఫిబ్రవరి 15 నుంచి 21 వరకు కొత్త ఫించన్లు, బియ్యం కార్డులు పంపిణీ చేయాలన్నారు. బియ్యం కార్డులను ఐదు రోజుల్లోగా మంజూరు చేయాలని సూచించారు. గ్రామ సచివాలయాల్లో దరఖాస్తులు తీసుకునేలా చేయాలి. ఉగాది నాటికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని ఆదేశించారు. ఫిబ్రవరి 15 కల్లా ఇళ్ల పట్టాల లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలి. నేను గ్రామాలకు వెళ్లినప్పుడు అర్హుల జాబితా తనిఖీ చేస్తా. ఎవరైనా పేదవారు స్థలం రాలేదంటే ఊరుకోను. మార్చి 1 కల్లా ఇళ్ల స్థలాల కోసం భూములు సేకరించాలి. మార్చి 15 కల్లా లాటరీలు పూర్తి చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ కలెక్టర్లను ఆదేశించారు. ఫిబ్రవరి 28న జగనన్న విద్యా, వసతి దీవెన పథకాలు ప్రారంభం. 11 లక్షల మందికి విద్యా, వసతి దీవెన. ఏప్రిల్‌ నెలాఖరు నాటికి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఫిబ్రవరి 28న 3300 రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించాలి. రైతు భరోసా లబ్ధిదారుల జాబితాను పర్మినెంట్‌గా గ్రామ సచివాలయాల్లో ఉంచాలి. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 541 సేవలు అందిస్తున్నాం. 336 సేవలు 72 గంటల్లో పూర్తి చేయాలని కలెక్టర్లకు సూచించారు.

Back to Top