మంగళవారం విశాఖలో పర్యటించనున్న వైయస్.జగన్

గల్లంతైన మత్స్య కారు కుటుంబాలను ఓదార్చనున్న వైయస్.జగన్

శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ

విశాఖపట్నం వైయస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ. 

గల్లంతైన మత్స్యకార్ల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం

కనీస మానవత్వం లేని ప్రభుత్వనిది

చంద్రబాబు సర్కార్ పై శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఫైర్

 విశాఖపట్నం: విశాఖ సముద్రంలో వేటకు వెళ్లి ప్రమాదంలో గల్లంతైన మత్స్యకార సోదరుల కుటుంబాలను పరామర్శించి, వారిలో ధైర్యాన్ని నింపేందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ రేపు (మంగళవారం) విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన  ఈ పర్యటన వివరాలను వెల్లడిస్తూ... రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న బాధ్యతారాహిత్య విధానాలపై శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విశాఖపట్నంలోని వైయస్సార్సీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కుమార్, మల్లా విజయప్రసాద్ తదితర నేతలతో కలిసి ఆయన మాట్లాడారు. ప్రమాదానికి గురైన మత్స్యకార్లను ఆదుకోవడంలో అధికారులు, ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించాయని మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి కనీస మానవత్వం లేదని ఆక్షేపించారు.  ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే...

బాధిత కుటుంబాలకు ఆత్మస్థైర్యం కల్పించడమే వైఎస్ జగన్ లక్ష్యం..

రేపు ఉదయం 10 గంటలకు విజయవాడలో బయలుదేరి 11 గంటలకు వైఎస్ జగన్ గారు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా జబ్బర్ తోట ప్రాంతానికి చేరుకుని బాధిత మత్స్యకార కుటుంబాలను పరామర్శిస్తారు. వేటకు వెళ్లి దురదృష్టవశాత్తు ఆరుగురు మత్స్యకారులు గల్లంతవడం అత్యంత విచారకరం. భగవంతుడి దయ వల్ల ఒకరు సజీవంగా బయటపడ్డారు. ఆయన కుటుంబాన్ని కూడా పరామర్శిస్తారు. ప్రమాదం జరిగిన నాటి నుంచి నేటి వరకూ మా పార్టీ పెద్దలు, స్థానిక నేతలు ఆ కుటుంబాలకు అండగా నిలబడ్డారు. ఇప్పుడు మా అధ్యక్షుడు స్వయంగా వచ్చి వారికి ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని కల్పించనున్నారు. పరామర్శ అనంతరం ఆయన తిరిగి విజయవాడ బయలుదేరుతారు.

ప్రభుత్వ వ్యవహార శైలి బాధ్యతారాహిత్యం – శాశ్వత పరిష్కారం కావాలి.

ముఖ్యంగా సంఘటన జరిగిన నేపథ్యంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఒక బాధ్యత గల ప్రభుత్వం లా లేదు. ఇది చాలా విచారకరం. ప్రమాదం జరిగిన వెంటనే కోస్ట్ గార్డ్స్, ఇతర అధికారులు వేగంగా స్పందించి ఉంటే, ఎంతో కొంతమంది ప్రాణాలతో బయటపడేవారని బాధిత కుటుంబాలు కూడా చెబుతున్నాయి. గల్లంతైన వారే ఆయా కుటుంబాలకి ఏకైక జీవనాధారం. మత్స్యకారులను పరామర్శిస్తామంటే ఈ ప్రభుత్వం దాన్ని కూడా రాజకీయం అనడం దురదృష్టకరం. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు… ఈ ప్రభుత్వానికి ప్రతిదీ రాజకీయంగానే కనిపిస్తోంది. ఇలాంటి ఘటనలు జరిగిన తర్వాత కంటే, ముందే ఒక నిర్దిష్టమైన విధానాన్ని రూపొందించి, రాబోయే రోజుల్లో ఒక శాశ్వత పరిష్కారం చూపాలన్నదే మా పార్టీ అభిమతం.

సాయం చేయాలన్న మనసు, మానవత్వం ఈ ప్రభుత్వానికి లేదు..

ప్రభుత్వం ప్రకటించిన పరిహారంపై బాధిత కుటుంబాలు ఏ విధంగా మంత్రులను, అధికారులను నిలదీశారో అందరం చూశాం. ప్రభుత్వం మరింత ఉదారంగా, పెద్ద మనసుతో వ్యవహరించి ఉంటే బాగుండేది. కానీ 'నేను పట్టిన కుందేటికి మూడే కాళ్లు' అన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. మా హయాంలో కేవలం బోటు కాలిపోతేనే రూ. 35 లక్షలు ఇచ్చాం. అలా అని మేం ఇచ్చాం కాబట్టి మీరు ఇవ్వాలని డిమాండ్ చేయడం లేదు, కానీ ప్రమాద తీవ్రతను అంచనా వేసి ఆదుకోవాలి. మత్స్యకారులు కోట్లు అడగలేదు, కనీస జీవనోపాధి సాయం అడిగారు. ఏదైనా మంచి చేయాలంటే మనసు, మానవత్వం, ఒక తపన ఉండాలి. ఈ ప్రభుత్వానికి ఆ ఆలోచనే లేదు. ఈ రాష్ట్రానికి అలాంటి కర్మ వచ్చింది. 

చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్న కూటమి ప్రభుత్వం..

ప్రస్తుత రాష్ట్రంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం చాలా ఈజీ అయింది. రాజ్యాంగం పట్ల, వ్యక్తుల పట్ల గౌరవం లేదు. డిప్యూటీ సీఎం గతంలో 'చెప్పుతో కొడతా' అన్నారు. ఆయన అన్న మాటలనే ఇప్పుడు ఎవరైనా తిరిగి ప్రస్తావిస్తే తీసుకెళ్లి జైల్లో పెడుతున్నారు. రావణ్ విషయంలో జరిగింది అదే. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున కూటమి నేతలు వైఎస్ జగన్ పై 'సైకో' అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసినా ప్రజాస్వామ్యబద్ధంగా సంయమనం పాటించాం. ఈరోజు ఎవరైనా  మాట అంటే అది దేశద్రోహమా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  అధికారిక ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా రాజకీయ ఉపన్యాసాలు చేయడం ఎంతవరకు సమంజసం? ఇదెక్కడి సంప్రదాయం?"

న్యాయ సహాయం అందిస్తే తప్పేంటి?

రావణ్ కి వైఎస్ఆర్సీపీ న్యాయ సహాయం ఇచ్చిందా లేదా అన్నది పక్కనపెడితే.... అసలు న్యాయ సహాయం ఇస్తే తప్పేంటి? అని బొత్స సత్యనారాయణ సూటిగా ప్రశ్నించారు. దేశద్రోహ చట్టాలను పెడుతూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్నప్పుడు చట్టబద్ధంగా పోరాడటం తప్పు కాదన్నారు. ఒకప్పుడు రావణ్ మా పార్టీని తిట్టినప్పుడు టీడీపీ నేతలు చంకలు గుద్దుకున్నారని, ఇప్పుడు రావణ్ మా మనిషి అంటున్నారని మండిపడ్డారు. ఈర రోజు మేం డబ్బులిచ్చాం అని చెబుతున్నారు. అంటే  ఆ రోజు మీరు డబ్బులిచ్చే వైయస్సార్సీపీని తిట్టించారా? అని నిలదీశారు.  జోసఫ్ చౌదరి మాట్లాడిన మాటలు, రఘురామకృష్ణంరాజు మాట్లాడిన మాటలు రెండూ ఒకేసారి ప్లే చేస్తే ఎవరిది తప్పో, ఎవరిది ఒప్పో ప్రజలకే తెలుస్తుందన్నారు.  భారత పౌరుడిగా చట్టబద్ధంగా చేసే ఏ కార్యక్రమాన్నైనా సమర్థిస్తాం, కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే మాత్రం సహించేది లేదనిఆయన తేల్చి చెప్పారు.

Back to Top