హై అల‌ర్ట్‌గా ఉండాలి.. ప్రజలకు ఎలాంటి ముప్పు రాకూడ‌దు

తుపాన్ ప్ర‌భావిత జిల్లాల క‌లెక్ట‌ర్ల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశం

తీర ప్రాంతాల్లో మ‌రింత అప్ర‌మ‌త్త‌త అవ‌స‌రం

తుపాన్ బాధితుల ప‌ట్ల మాన‌వ‌తా దృక్ప‌థంతో వ్య‌వ‌హ‌రించాలి

పరిహారం ఇచ్చే విషయంలో ఎలాంటి సంకోచాలు పెట్టుకోవద్దు

ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు త‌ర‌లించాలి

సహాయక‌ శిబిరాలకు తరలించిన వ్యక్తికి రూ.వెయ్యి, కుటుంబానికి రూ.2వేల చొప్పున ఆర్థిక సాయం 

హెల్ప్‌లైన్ నంబ‌ర్ల‌ను విస్తృతంగా ప్ర‌చారం చేయాలి

తుపాన్ నేప‌థ్యంలో అధికారుల‌తో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ అత్య‌వ‌స‌ర వీడియో కాన్ఫ‌రెన్స్‌

తాడేప‌ల్లి: `అస‌ని` తుపాన్ నేప‌థ్యంలో అధికార యంత్రాంగ‌మంతా హై అల‌ర్ట్‌గా ఉండాల‌ని, తీర ప్రాంతాల్లో మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్లు, ఉన్న‌తాధికారుల‌ను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశించారు. తుపాన్ బాధితుల ప‌ట్ల మాన‌వ‌తా దృక్ప‌థంతో వ్య‌వ‌హ‌రించాల‌ని, ఎవ‌రికి  ఎలాంటి క‌ష్టం వ‌చ్చినా వెంట‌నే ఆదుకోవాల‌ని సూచించారు. ముంపు ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ ఆదేశించారు. 

తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. సహాయక చర్యలపై అధికారుల‌తో స‌మీక్షించారు. ఇప్పటికే తొమ్మిది ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను జిల్లాల‌కు పంపించామ‌ని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని, అధికారులంతా అల‌ర్ట్‌గా ఉండాల‌ని ఆదేశించారు. తుపాను బలహీనపడటం ఊరటనిచ్చే అంశ‌మే అయినా ఎక్కడా నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని సూచించారు. ప్రజలకు ఎలాంటి ముప్పు రాకుండా చూడాల‌ని, ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు త‌ర‌లించాల‌ని ఆదేశించారు. అవ‌స‌రమైన చోట సహాయక‌ పునరావాస శిబిరాలను తెరవాల‌న్నారు. సహాయక‌ శిబిరాలకు తరలించిన ఒక వ్యక్తికి రూ.వెయ్యి, కుటుంబానికి రూ.2వేల చొప్పున ఆర్థిక సాయం అందించాల‌ని సూచించారు. అదే విధంగా సహాయ శిబిరాల్లో మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు.  జనరేటర్లు, జేసీబీలు.. అన్నీసిద్ధం చేయాల‌ని, కమ్యూనికేషన్‌ వ్యవస్థకు అంతరాయం ఏర్పడితే వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

తుపాను బాధితుల పట్ల అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాల‌ని, వారికి ఎలాంటి కష్టం వచ్చినా వెంటనే ఆదుకోవాల‌ని ఆదేశించారు. ఇప్ప‌టికే తుపాన్ ప్ర‌భావిత ప్రాంతాల‌కు నిధులు కేటాయించామ‌ని, పరిహారం ఇచ్చే విషయంలో ఎలాంటి సంకోచాలు పెట్టుకోవద్దన్నారు. సెంట్రల్‌ హెల్ప్‌ లైన్‌తో పాటు, జిల్లాల వారీగా హెల్ప్‌లైన్‌ నంబర్లు సమర్థవంతంగా పనిచేసేలా చూసుకోవాల‌న్నారు. హెల్ప్‌లైన్ల‌కు వచ్చే కాల్స్‌ పట్ల వెంటనే స్పందించాల‌ని సూచించారు. కాల్‌సెంట‌ర్ నంబర్లను విస్తృతంగా ప్ర‌చారం చేయాల‌న్నారు. 

కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు
కాకినాడ కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌: 18004253077
కాకినాడ ఆర్డీవో ఆఫీస్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌: 0884-2368100
శ్రీకాకుళం: 08942-240557
తూర్పు గోదావరి: 8885425365
ఏలూరు కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌: 18002331077
విజయనగరం: 08922-236947
పార్వతీపురం మన్యం: 7286881293
మచిలీపట్నం కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌: 08672 252572
మచిలీపట్నంం ఆర్డీవో ఆఫీస్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌: 08672 252486
బాపట్ల కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌: 8712655878, 8712655881
ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌: 90103 13920
విశాఖ: 0891-2590100,102
అనకాపల్లి: 7730939383

Back to Top