ధ‌ర్మారెడ్డి కుటుంబ స‌భ్యుల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌

నంద్యాల‌: తిరు­మల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) ఈవో ఎ.వి.ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళిరెడ్డి అలియాస్‌ శివ (28) ఆక‌స్మిక మ‌రణం పొంద‌డంతో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించారు. నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండ‌లం పారుమంచాల గ్రామానికి చేరుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చంద్ర‌మ‌ళిరెడ్డి చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. అనంత‌రం ధ‌ర్మారెడ్డి, ఆయ‌న స‌తీమ‌ణి, కుటుంబ స‌భ్యులు, బంధువుల‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పరామ‌ర్శించారు. ఓదార్చి ధైర్యం చెప్పారు.

చెన్నైలో బీటెక్‌ పూర్తిచేసి ముంబైలో ఫైనాన్స్‌ కన్సల్టెంటుగా ఉద్యోగం చేస్తున్న చంద్రమౌళి ఈనెల 18వ తేదీన చెన్నైలో తన స్నేహితుడితో కలిసి కారులో వెళ్తున్న సమయంలో గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయన్ని ఆళ్వార్‌పేటలోని కావేరి ఆస్పత్రికి తరలించారు. కార్డియాక్‌ అరెస్ట్‌తో ఆస్పత్రిలో చేరిన చంద్రమౌళికి ఎక్మో చికిత్స అందించిన ఫ‌లితం ద‌క్క‌లేదు. చంద్రమౌళి భౌతికకాయాన్ని ధర్మారెడ్డి స్వగ్రామం నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పారుమంచాలకు ప్రత్యేక అంబులెన్స్‌లో నిన్న‌ మధ్యాహ్నం 12 గంటల సమయంలో చెన్నై నుంచి తరలించారు. ఇవాళ ఉద‌యం చంద్రమౌళి పార్ధివ దేహానికి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు.

Back to Top