తాడేపల్లి: అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ (Gita Gopinath)కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఏపీ నుంచి వెళ్లిన విద్యార్థులు ఐఎంఎఫ్ కార్యాలయంలో సందడి చేశారు. వాళ్లను ఆహ్వానించి ముచ్చటించినందుకుగానూ సీఎం వైయస్ జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘మా పిల్లలను కలుసుకున్నందుకు, సాదరంగా వాళ్లను ఆహ్వానించినందుకు గీతాగోపినాథ్ గారికి థ్యాంక్స్. వాళ్ల చిరునవ్వులే ఆ విషయాన్ని చెబుతున్నాయ్’’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. ‘‘చదువు అనేది వ్యక్తిగత జీవితాలను మార్చడమే కాకుండా మొత్తం సమాజాన్ని మార్చడంలో అతిపెద్ద ఉత్ప్రేరకం అని నేను నిజంగా నమ్ముతున్నాను. మా పిల్లలే ఇందుకు నిదర్శనం. అంతర్జాతీయ వేదికపై మన రాష్ట్రాన్ని ఎంతో గర్వంగా, ఆత్మవిశ్వాసంతో ప్రాతినిధ్యం వహిస్తున్న పిల్లలను చూసినప్పుడు నేను గర్వంతో నిండిపోయాను!’’ అని పోస్ట్ చేశారాయన. అంతకు ముందు గీతా గోపినాథ్ సైతం పిల్లలతో ఉన్న ఫొటోను తన ఎక్స్‌లో ట్వీట్ చేశారు. అమెరికా, ఐరాస పర్యటనలో భాగంగా.. వాళ్లను ఐఎంఎఫ్ ప్రధాన కార్యాలయం వద్ద కలుసుకున్నట్లు ఆమె పోస్ట్ చేశారు. వాళ్లను కలుసుకున్నందుకు సంతోషంగా ఉందని ఆమె ట్వీట్‌లో తెలియజేశారు.