నేడు మహిళా సాధికార విజయోత్సవ స‌భ‌

 విజ‌య‌వాడ‌లో మహిళా దినోత్సవసభ ..ముఖ్య అతిథిగా సీఎం వైయ‌స్ జగన్‌

రాష్ట్రం నలుమూలల నుంచి తరలిరానున్న తరుణీమణులు 

 అమరావతి: రాష్ట్రంలో మహిళా సాధికార విజయోత్సవంగా  విజ‌య‌వాడ‌లోని మున్సిప‌ల్ స్టేడియంలో సభను నిర్వహిస్తున్నట్టు మంత్రి తానేటి వనిత, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ  ప్రకటించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవసభకు విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియం ముస్తాబైంది. మంగళవారం జరగనున్న ఈ సభకు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు 15 వేలమందికిపైగా తరుణీమణులు తరలిరానున్నారు. ఆంధ్రప్రదేశ్‌ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖ, రాష్ట్ర మహిళా కమిషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

 రాష్ట్రంలో మహిళా సాధికారత కోసం ప్రభుత్వం చేపట్టిన అనేక అంశాలను ప్రస్తావించనున్నారు. సభలో రాష్ట్ర మంత్రుల నుంచి గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు, సాధారణ మహిళలు పెద్దసంఖ్యలో భాగస్వాములు కానున్నారు. ఇందుకు సంబంధించి వారంతా సభకు తరలిరావాలని ఇప్పటికే ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. సభికుల కోసం పలు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. 

విజయవంతం చేయండి: మంత్రి పెద్దిరెడ్డి
అంతర్జాతీయ మహిళా దినోత్సవసభను విజయవంతం చేయాలని కృష్ణాజిల్లా ఇన్‌చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియంలో సభ ఏర్పాట్లను సోమవారం పరిశీలించిన ఆయన మంత్రులు, అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల సాధికారత కోసం శక్తివంచన లేకుండా కృషిచేసిన ప్రభుత్వం తమదేనని గర్వంగా చెప్పగలుగుతున్నామన్నారు. సీఎం జగన్‌ నాయకత్వంలో రాష్ట్రంలోని మహిళల సంక్షేమం, అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు చేపట్టినట్టు వివరించారు.

ఈ నేపథ్యంలో నిర్వహిస్తున్న మహిళా దినోత్సవ సభను మహిళా లోకం విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రులు పాముల పుష్పశ్రీవాణి, కె.నారాయణస్వామి, మంత్రి తానేటి వనిత, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, నందిగం సురేష్, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, కలెక్టర్‌ జె.నివాస్, పోలీస్‌ కమిషనర్‌ కాంతిరాణా టాటా పాల్గొన్నారు.

Back to Top