ప్రజాస్వామ్య విలువలు, రాష్ట్ర శ్రేయస్సే ముఖ్యం

గత ప్రభుత్వం రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఉల్లంఘించింది

చంద్రబాబు వ్యవస్థలన్నింటనీ భ్రష్టుపట్టించాడు

వ్యవస్థలను పునరుద్దరిస్తాం.. విలువలు కాపాడుతాం

అవినీతి రహిత సమాజ నిర్మాణమే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ లక్ష్యం

ట్రైనింగ్‌ క్లాసులకు టీడీపీ ఎమ్మెల్యేలు రాకపోవడం దురదృష్టకరం

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే, చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి​

అమరావతి: ప్రజాస్వామ్య విలువలు, రాష్ట్ర శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే, చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. శాసనసభ్యులు అనుసరించాల్సిన విధానాలపై పెద్దలు, మేధావులు సుదీర్ఘంగా వివరించారన్నారు. శాసనసభ్యుల శిక్షణ కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. శిక్షణ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు ఆహ్వానం పంపించినా హాజరుకాకపోవడం దురదృష్టకరమన్నారు. గతంలో చంద్రబాబు గ్రాండ్‌ కాకతీయ హోటల్‌లో ట్రైనింగ్‌ క్లాసులు పెట్టి రూ. 2.5 కోట్లు ఖర్చు చేశారన్నారు. హోటల్‌లో పెట్టలేదని టీడీపీ నేతలు రాలేదో.. లేక ఫిరాయింపుల గురించి చర్చ వస్తుందని రాలేదో అర్థం కావడం లేదన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ వారు నిర్వహించిన సమావేశాలకు వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అసెంబ్లీలోని కమిటీ హాల్‌ను వినియోగించుకొని రెండ్రోజుల శిక్షణ కార్యక్రమం అహ్లాదకర వాతావరణంలో నిర్వహించుకున్నామన్నారు. శిక్షణ కార్యక్రమాల్లో పెద్దలు ఐవైఆర్‌ కృష్ణారావు, ధర్మాన ప్రసాదరావు లాంటి వారు సభలో అనుసరించాల్సిన విధానాలపై సుదీర్ఘంగా వివరించారన్నారు. 

రాజ్యాంగ ఉల్లంఘనలు జరగవు. గతంలో జరిగిన సంఘటనలు పునరావృతం కావని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ స్పష్టంగా చెప్పారని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. కోడెల్‌ శివప్రసాదరావు స్పీకర్‌గా ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు. పవిత్రమైన శాసనసభలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరిగాయన్నారు. ప్రజాస్వామ్య విలువలు కాపాడుకుంటూ.. రాష్ట్ర శ్రేయస్సు కోసం 151 మంది వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యేలు కట్టుబడి ఉన్నారన్నారు. అవినీతి రహిత పాలన అందించేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అడుగులు వేస్తున్నారని వివరించారు. ట్రైనింగ్‌ క్లాస్‌లో ఐవైఆర్‌ కృష్ణారావు అనేక సంఘటనల గురించి వివరించారని చెప్పారు.

చంద్రబాబు లాంటి వ్యక్తి వ్యవస్థలను సర్వనాశనం చేశారని గడికోట ధ్వజమెత్తారు. రాజకీయాల్లో విలువలను దిగజార్చారు. ఎంత సేపు వ్యవస్థలను మేనేజ్‌ చేయడం.. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను లాక్కోవడం, క్యాంపు రాజకీయాలు, డబ్బులతో సభ్యులను కొనడం వంటి కార్యక్రమాలు చేసి వ్యవస్థలను భ్రష్టుపట్టించారు. వ్యవస్థలను పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సభ్యులందరికీ సూచించడం జరిగిందన్నారు. విలువలను కాపాడేందుకు ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు, రాష్ట్ర శ్రేయస్సు కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

 

Back to Top