తాడేపల్లి: ‘‘వైయస్‌ఆర్ కల్యాణమస్తు, షాదీ తోఫా ఈ రెండు కార్యక్రమాలు చదువులను మరింత ప్రోత్సహిస్తూ, మరీ ముఖ్యంగా ఆడపిల్లలు గొప్పగా చదివేలా వారి చదువులను ప్రోత్సహిస్తూ.. ఆ కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచే మంచి కార్యక్రమం. పేదరికంలోని నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా దివ్యాంగులు, నా భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లల కోసం వారి తల్లిదండ్రులకు తోడుగా నిలబడుతూ ఈ పథకాలు తెచ్చాం’’ అని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఈఏడాది ఏప్రిల్ నుంచి జూన్ త్రైమాసికానికి సంబంధించి వివాహం చేసుకున్న అర్హులైన 18,883 జంటలకు రూ.141.60 కోట్లను సీఎం వైయస్ జగన్ విడుదల చేశారు. వధువుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో వైయస్‌ఆర్ కల్యాణమస్తు, షాదీ తోఫా సాయం జమ చేశారు. అంతకుముందు పిల్లలను, వారి తల్లిదండ్రులను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. సీఎం వైయస్ జగన్ పూర్తి ప్రసంగం.. పేద తల్లిదండ్రులందరూ తమ పిల్లలను గొప్పగా చదివించి, వారి పెళ్లి కూడా గౌరవప్రదంగా, అప్పులపాలయ్యే పరిస్థితి రాకుండా చేయాలని ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు, ఆశిస్తారు. నిజంగా పేదరికంలో ఉన్న అటువంటివారందరికీ కూడా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా దివ్యాంగులు, నా భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లల కోసం ఈ పథకం తెచ్చాం. వారి జీవితాల్లో వెలుగులు నింపాలని, అప్పులపాలయ్యే పరిస్థితి లేకుండా, రాకుండా పెళ్లీళ్లు జరిగే పరిస్థితి రావాలని, ఆ పిల్లలు బాగా చదవాలని, ప్రతి ఒక్కరూ డిగ్రీ వరకు వెళ్లే పరిస్థితికి రావాలనే తలంపుతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ త్రైమాసికంలో పెళ్లీళ్లు చేసుకున్న అర్హులకు, 2023 జనవరి నుంచి మార్చి వరకు వివాహాలై వారిలో కూడా ఏ కారణం చేతైనా పథకం అందనివారు ఎవరైనా ఉంటే వారిని కూడా దీంట్లో కలిపి వీరందరికీ ఈరోజు సాయం చేస్తున్నాం. ఇలా మొత్తంగా 18,883 జంటలకు సంబంధించి రూ.141 కోట్ల ఆర్థిక సాయం నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమం జరుగుతుంది. ఈ పథకం ద్వారా గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు రెండు విడతల్లో ఇప్పటికే ఈ పథకాన్ని అమలు చేశాం. ఈరోజు మూడో విడత సాయం అందిస్తున్నాం. నేటితో కలుపుకుంటే అక్షరాల రూ.267 కోట్లు ఆడపిల్లల చదువులను ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని అమలు చేసినట్టు. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 35,551 మంది జంటలకు మేలు జరుగుతుంది. ప్రతి ఏడాది నాలుగు విడతల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం అమలవుతుంది. ఒక నెలపాటు వెరిఫికేషన్ పూర్తిచేసి వెంటనే ఆ త్రైమాసికానికి సంబంధించిన ఆర్థికసాయం అందజేయడం జరుగుతుంది. ఈ రోజు ఇచ్చే 18,883 మంది పిల్లలకు సంబంధించిన విషయాలను గమనిస్తే మనసుకు సంతోషాన్ని కలిగించే కొన్ని విషయాలు అర్థం అవుతాయి. ఇందులో 18 నుంచి 21 సంవత్సరాల్లోపు డిగ్రీ చదివే 8524 మంది నా చెల్లెళ్లు ఉన్నారు. ఇందులో అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన వీటన్నింటి ద్వారా లబ్ధిచెంది డిగ్రీ కూడా చదివిన, చదువుతున్న వారు వీరిలో అక్షరాల 7344 మంది ఉన్నారు. 86 శాతం మంది పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో అమ్మ ఒడి, డిగ్రీలో విద్యా దీవెన, వసతి దీవెనల ద్వారా లబ్ధిపొంది పెళ్లీళ్ల ఆలోచనను పక్కనబెట్టి చదువుల మీద ధ్యాసపెట్టి డిగ్రీ పూర్తిచేసుకొని పెళ్లీళ్లు చేసుకున్నవారు 86 శాతం మంది. మనం అనుకున్న లక్ష్యం నెరవేరుతోందని ఈలెక్కలు చూసినప్పుడు సంతోషంగా ఉంది. ప్రతి చెల్లెమ్మ డిగ్రీ వరకు చదవాలి. ఇళ్లాలు డిగ్రీ వరకు చదివిన పరిస్థితి ఉంటే ఆ తరువాత జనరేషన్‌లో తమ పిల్లలను వారు ఇంకా పైచదువులు చదివించే గొప్ప అడుగు పడుతుంది. మనం తీసుకువచ్చిన నిబంధన వల్ల ప్రతి ఒక్కరూ డిగ్రీ వరకు చదివే పరిస్థితి రావాలి, పేదరికం నుంచి బయటపడాలంటే కచ్చితంగా చదువు అనే బ్రహ్మాస్త్రం ప్రతి ఒక్కరూ చేతిలో ఉండాలని ప్రభుత్వం పడుతున్న ఆరాటానికి ఇదొక నిదర్శనం. ఈ పథకం గత ప్రభుత్వంలో ఎలా జరిగేది.. మన ప్రభుత్వం ఏరకమైన తేడా తీసుకువచ్చిందని ఆలోచన చేస్తే.. గత ప్రభుత్వ హయాంలో ప్రతీది చేశామంటే చేశామనే పరిస్థితి తప్ప.. చిత్తశుద్ధితో చేయాలని, పేదలకు మంచి జరగాలనే ఆలోచన ఏరోజూ జరగలేదు. 2018లోనే 17,709 మందికి అక్షరాల దాదాపు రూ.68.68 కోట్లు ఇవ్వకుండా ఎగ్గొట్టిన పరిస్థితులు చూశాం. ఆరోజుల్లో కేవలం ఎన్నికల స్టంట్‌గా డబ్బులు ఇచ్చామంటే ఇచ్చాం.. ఓ పథకం తెచ్చామంటే తెచ్చామనేలా జరిగిన పరిస్థితి చూశాం. మన ప్రభుత్వంలో ప్రతి కుటుంబానికి పదో తరగతి ఉత్తీర్ణత సాధించాలనే నిబంధన తీసుకువచ్చాం. పదో తరగతి పాస్ అయ్యేలా తల్లిదండ్రులను ప్రోత్సహించేలా అడుగులు వేస్తున్నాం. నా చెల్లెమ్మలకు 18 సంవత్సరాలు కచ్చితంగా ఉండాలని, నా తమ్ముళ్లకు కనీసం 21 సంవత్సరాలు ఉండాలనే నిబంధన కూడా తీసుకువచ్చాం. దీని వల్ల కచ్చితంగా పదో తరగతి వరకు చదువులు పూర్తయితాయి. ఆ తరువాత 18 సంవత్సరాల వరకు ఆగాలి కాబట్టి ఎలాగూ అమ్మ ఒడి పథకం అందుబాటులో ఉంది కాబట్టి చదువులను కంటిన్యూ చేస్తూ ఇంటర్మీడియట్ చదువుతారు.. అమ్మ ఒడి సాయం రెండేళ్లు పొందుతారు. దాని తరువాత విద్యా దీవెన, వసతి దీవెన అనే రెండు పథకాలతో పిల్లల చదువులు కొనసాగుతాయి. డిగ్రీ, ఇంజినీరింగ్, డాక్టర్ పెద్ద పెద్ద చదువులు రూపాయి డబ్బు ఖర్చు లేకుండా పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్ ఇస్తూ ప్రభుత్వం తోడుగా నిలబడుతుంది. అంతేకాకుండా పిల్లల చదువును ప్రోత్సహిస్తూ ప్రతి పాప, ప్రతి పిల్లాడు డిగ్రీ చదువుతుండగా వసతి దీవెన పథకం ద్వారా వారి భోజనం, బోర్డింగ్, లాడ్జింగ్ ఖర్చుల కోసం సంవత్సరానికి రూ.20 వేల వరకు నేరుగా రెండు దఫాల్లో ఆ పిల్లల తల్లుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. దాదాపుగా మూడేళ్ల కోర్సు అయితే రూ.60 వేలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం. ఆ తరువాత ఎలాగూ ఆడపిల్లలకు 18 సంవత్సరాల వయసు దాటుతుంది, మగపిల్లలకు 21 సంవత్సరాలు పూర్తయితాయి. ఆ తరువాత పెళ్లీళ్లు జరిగితే మైనార్టీలకు ఇంతకు ముందు రూ.50 వేలు ఉంటే మన ప్రభుత్వంలో షాదీ తోఫా కింద ఏకంగా రూ. 1లక్ష ఆ కుటుంబానికి ఇచ్చి పెళ్లికి తోడుగా నిలబడుతున్నాం. అదే విధంగా వికలాంగులకు గత ప్రభుత్వంలో రూ.1లక్ష ఇస్తామని ప్రకటించి ఎగ్గొట్టిన పరిస్థితి చూశాం. మన ప్రభుత్వంలో ఏకంగా రూ.1.5 లక్షలు ఇస్తూ వారిని ప్రోత్సహిస్తున్నాం. భవన నిర్మాణ కార్మికులకు గత ప్రభుత్వంలో రూ.20 వేలు ప్రకటించి ఎగ్గొడితే.. మన ప్రభుత్వంలో రూ.40 వేలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం. ఎస్సీలకు గత ప్రభుత్వంలో రూ.40 వేలు ఇస్తామని ప్రకటించి ఎగ్గొట్టిన పరిస్థితి. మనందరి ప్రభుత్వంలో రూ.1లక్ష ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం. అదే మాదిరిగా ఎస్టీలకు గత ప్రభుత్వంలో రూ.50 వేలు ఇస్తామని చెప్పి ఎగ్గొట్టారు. మనందరి ప్రభుత్వం ఏకంగా ఎస్టీలకు రూ.1లక్ష ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం. బీసీలకు గతంలో రూ.30 వేలు అని చెప్పి ఎగ్గొట్టారు. మనందరి ప్రభుత్వంలో ఏకంగా రూ.50 వేలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం. ఈరకంగా కులాంతర వివాహాలకు ఇంకా ఎక్కువగా ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం. ఇవన్నీ మనసుపెట్టి ప్రతి పాప, పిల్లాడు కూడా పేదరికం నుంచి బయటపడాలంటే కచ్చితంగా చదువే మార్గమని, ఆ చదువు కోసం ఏ పేదవాడు అప్పులపాలు కాకూడదని, ప్రతి ఒక్కరినీ చదివించేందుకు ప్రతి అడుగులోనూ తోడుగా నిలబడుతున్నాం. ఇందులో భాగంగానే అర్హత ఉండి సాయం అందనివారు ఏ ఒక్కరూ మిగిలిపోకూడదని ముందుకు కదులుతున్నాం. పొరపాటున ఎవరైనా మిగిలిపోయి ఉంటే వారికి కచ్చితంగా మరో త్రైమాసికంలో జతచేసి సాయం అందించే కార్యక్రమం చేస్తున్నాం. ఇందులో భాగంగానే మనం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పుడు దూదేకుల, నూర్‌బాషాలకు సంబంధించిన మైనార్టీ సోదరులు కూడా రూ.1లక్ష సాయం రావడం లేదు రూ.50 వేలు వస్తుందని చెప్పారు. దాన్ని కూడా సానుకూలంగా పరిగణనలోకి తీసుకుని వారికి కూడా రూ.1లక్ష సాయం అందించాలని నిర్ణయించాం. గతంలో అందని 227 జంటలకు ఈరోజు సాయం అందిస్తున్నాం. ప్రతి అడుగులోనూ మానవత్వమే ప్రదర్శించాం. ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా ఎవరూ మిస్ కాకూడదు, నష్టం జరిగే పరిస్థితి ఏ ఒక్కరికీ ఉండకూడదని తపన, తాపత్రయం మన ప్రభుత్వ ప్రతి అడుగులోనూ కనిపిస్తోంది. మరోసారి చెబుతున్నా.. మన రాష్ట్రంలోని పిల్లలందరూ గొప్పగా చదవాలి, పేదరికం నుంచి బయటకు రావాలి. జగనన్న ప్రభుత్వం మీ తరఫున దేవుడ్ని కోరుకుంటుంది. ఈ పథకం ద్వారా మంచి జరగాలని మనసారా ఆకాంక్షిస్తూ, దేవుడు ఇంకా మంచి చేసే అవకాశం కూడా ఇవ్వాలని మనసారా కోరుకుంటూ వైయస్‌ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా ద్వారా లబ్ధిపొందుతున్న ప్రతి చెల్లెమ్మకు, ప్రతి తమ్ముడికి, వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను` అని సీఎం తన ప్రసంగాన్ని ముగించారు.