తాడేపల్లి: మహిళా సంక్షేమం కోసం దేశంలో ఏ ప్రభుత్వమూ చేయనంత కృషి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్నారని వైయస్ఆర్‌సీపీ అనుబంధ విభాగాల ఇన్‌చార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని ఫార్చ్యూన్ గ్రాండ్ లో వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాల్గొని 2024 సార్వత్రిక ఎన్నికలలో పార్టీ విజయం సాధించి జగనన్న ను రెండోసారి ముఖ్యమంత్రి చేసుకునేందుకు మహిళా విభాగం క్రియాశీలకంగా పని చేయాలని దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు మానవాళిలో సగభాగమే కాకుండా, అభివృద్ధిలో అంతకు మించిన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. ‘మహిళల అభ్యున్నతే సమాజం ప్రగతికి కొలమానమన్నారు. 2019లో వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మన ప్రభుత్వం మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య, ఉద్యోగ సాధికారతలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టిందన్నారు. దేశంలో మరే రాష్ట్రమూ ఈ విషయాలకు ఏపీ ఇచ్చినంత ప్రాధాన్యత ఇవ్వలేదని తెలిపారు. జగనన్న అమ్మఒడి, వైయస్‌ఆర్ ఆసరా, వైయస్‌ఆర్ చేయూత, జగనన్న విద్యా దీవెన్, జగనన్న వసతి దీవెన, వైయస్ఆర్ సంపూర్ణ పోషణ తదితర సంక్షేమ పథకాలతో కడుపులోని శిశువు నుంచి పండు ముదుసలి వరకు అందరికీ అండగా నిలుస్తున్న ప్రభుత్వం ఏపీలో మాత్రమే ఉందని ఆయన చెప్పారు. మహిళల రక్షణ, భద్రత కోసం దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. సమావేశంలో వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పోతుల సునీత , వర్కింగ్ ప్రెసిడెంట్ వరుదు కళ్యాణి , 8 మంది మహిళా జోనల్ ఇన్చార్జులు, 26 జిల్లాల మహిళా అధ్యక్షురాళ్లు, నవరత్నాలు వైస్ చైర్మన్ నారాయణ మూర్తి, బెందాళం పద్మావతి తదితరులు పాల్గొన్నారు.