హైదరాబాద్: ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు కాలరాస్తున్నాడని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విజయచందర్ ధ్వజమెత్తారు. సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మను అడ్డుకొని ఎయిర్‌పోర్టు నుంచి బయటకు పంపించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. రాంగోపాల్‌వర్మ ప్రెస్‌మీట్ పెడితే మీకు అభ్యంతరం ఏంటీ..? ప్రెస్‌మీట్ పెట్టేందుకు కూడా పర్మిషన్ తీసుకోవాలా..? అని నిలదీశారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో విజయచందర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని ఏ మారుమూల ప్రాంతానికైనా వెళ్లే హక్కు భారత రాజ్యాంగం దేశ పౌరులకు కల్పించిందని, కానీ చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని కాలరాసే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆర్టికల్ 19లో ప్రతి ఒక్కరూ తమ భావాలను వ్యక్త పరచవచ్చని ఉందని, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబుకు ఇది కూడా తెలియదా అని నిలదీశారు. చంద్రబాబు వ్యవహార శైలి చూస్తుంటే ఆయన మానసిక స్థితిపై అనుమానంగా ఉందని విజయచందర్ అన్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి రాంగోపాల్‌వర్మను ఎందుకు వెనక్కు పంపించారో చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన మహానాయకుడు, కథానాయకుడు సినిమాలకు గొప్పగా పబ్లిసిటీ ఇప్పించిన చంద్రబాబు.. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా అంటే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా చూస్తే వాస్తవాలన్నీ బయటపడతాయని భయపడుతున్నారా అని నిలదీశారు. ఇంకో 20 రోజులు మాత్రమే చంద్రబాబు ప్రభుత్వం ఉంటుందని, ఆ తరువాత వచ్చేది వైయస్ఆర్ సీపీ ప్రభుత్వమన్నారు. కులాల మధ్య గొడవలు పెట్టి పైశాచిక ఆనందం పొందడం చంద్రబాబు అలవాటు అన్నారు.