మరుగుదొడ్ల బిల్లులు కూడా తిన్నారు

రేషన్, పెన్షన్, ఇల్లు కావాలన్నా జన్మభూమి కమిటీలకు లంచాలు

శాంతిభద్రతల గురించి టీడీపీ సభ్యులు మాట్లాడడం హాస్యాస్పదం

ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

అమరావతి: చంద్రబాబు నాయకత్వంలో జన్మభూమి కమిటీలు మరుగుదొడ్ల బిల్లులు కూడా తిన్నారని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో మా కార్యకర్తలు ముఖ్యం, వారి పనికి అడ్డురావద్దు అని చెప్పడంతో గత ఐదేళ్లు రాష్ట్రంలో శాంతిభద్రతలు భ్రష్టుపట్టిపోయాయన్నారు. చంద్రబాబు అండతో జన్మభూమి కమిటీ విపరీతమైన అవినీతికి పాల్పడ్డారని, ఇల్లు, రేషన్, పెన్షన్, మరుగుదొడ్లు ఏది కావాలన్నా లంచాలు తీసుకొని చేశారని, చివరకు పోలీస్‌స్టేషన్, ఎమ్మార్వో కార్యాలయాల ఎదుట కన్సల్టెన్సీ ఆఫీసులు పెట్టుకునే స్థితికి చేరారని మంత్రి బుగ్గన గుర్తు చేశారు. అసెంబ్లీలో టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి బుగ్గన సమాధానాలు చెప్పారు. శాంతిభద్రతల విషయంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కలెక్టర్లు, ఎస్పీలకు స్వేచ్ఛను ఇచ్చారన్నారు. అధికార పార్టీ, ప్రతిపక్షం అనే తేడా లేకుండా తప్పు ఎవరు చేసినా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, ఎస్పీలకు సూచించారన్నారు. 

గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పుణ్యాన పోలవరం ప్రాజెక్టు ఆలస్యమైందని మంత్రి బుగ్గన అన్నారు. 2014లో ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటే 2016 సెప్టెంబర్‌ వరకు స్పెషల్‌ మిడ్‌నైట్‌ ప్యాకేజీ మాట్లాడుకునే వరకు రెండున్నర సంవత్సరాలు ఎందుకు పోలవరం పట్టించుకోలేదని ప్రశ్నించారు. ప్రస్తుతం ప్రాజెక్టును సత్వరం పూర్తి చేసేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామని, అది కాకుండా గోదావరి జలాలు కృష్ణా ఆయకట్టు, రాయలసీమ ప్రాంతానికి తీసుకువచ్చే మార్గాలు ఉన్నాయని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ విచారిస్తున్నారన్నారు. 

ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొని వారి బిడ్డలను బాగా చదివించుకోవాలని, వారి జీవితాలను కొత్తగా నిర్మించాలనే సంకల్పం ఉన్న తల్లులకు ఈ రాష్ట్రంలో కొదవలేదు. ఆ తల్లుల ప్రేరణే ఈ ప్రభుత్వానికి బలం, తమ పిల్లలను చదువుల బాటపట్టించి వారి రాతను తిరిగిరాయాలనుకునే ప్రతి తల్లికి ఈ ప్రభుత్వం నిండు మనస్సుతో నమస్కరిస్తుంది. వారి సంకల్పబలానికి అవసరమైన వనరులు, తోడ్పాటును అందించడం బాధ్యత అని ప్రభుత్వం చాటుతుందన్నారు. అమ్మ ఒడి పథకం ఎంతో ఆలోచనతో వైయస్‌ జగన్‌ ప్రవేశపెట్టారని, ఆయన వద్దన్నా.. ఒత్తిడి తీసుకువచ్చి అమ్మ ఒడి పథకం పేరు జగనన్న అమ్మ ఒడిగా మార్చామని వివరించారు. 

Back to Top