శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

తిరుమ‌ల‌: తిరుమలలో  శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభ‌వంగా జ‌రుగుతున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం త‌ర‌ఫున సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు  సమర్పించారు. ముందుగా తాతయ్య గుంట గంగమ్మ ఆలయాన్ని దర్శించుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌..తిరుమలకు చేరుకున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవేంకటేశ్వరస్వామికి ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీ‌బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద సీఎం వైయస్ జగన్‌కు తిరుమల తిరుపతి దేవస్ధానం అర్చకులు పట్టువస్త్రంలో పరివట్టం కట్టారు. శ్రీవేంకటేశ్వరస్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన అనంత‌రం స్వామివారిని దర్శనం చేసుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో సీఎంకు తిరుమల తిరుపతి దేవస్ధానం వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. శ్రీవారి తీర్ధప్రసాదాలు, స్వామివారి చిత్రపటం సీఎంకు అందజేశారు. రంగనాయకుల మండపంలో 2024 తిరుమల తిరుపతి దేవస్ధానం డైరీ, క్యాలెండర్‌ను ముఖ్య‌మంత్రి ఆవిష్క‌రించారు.  

అంత‌కుముందు తిరుమలలో భక్తుల కోసం దాతల సహకారంలో నిర్మించిన రెండు విశ్రాంతి గృహాలు.. వకుళమాత నిలయం, రచన విశ్రాంతి గృహాలను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్రారంభించారు. తిరుమ‌ల శ్రీ‌వారి దర్శనార్థం వచ్చే భ‌క్తుల కోసం దాత‌ల స‌హ‌కారంతో టీటీడీ నిర్మించిన రెండు విశ్రాంతి గృహాల‌ను సోమవారం ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌ ప్రారంభించారు. తిరుమలలోని పద్మావతి ఏరియాలో వ‌కుళామాత నిల‌యం విశ్రాంతి గృహాన్ని దాత శ్రీ రాజేష్ శర్మ, శ్రీ ర‌చ‌న విశ్రాంతి గృహాన్ని దాత శ్రీ నరేంద్ర చౌదరి సహకారంతో నిర్మించారు. ఈ రెండు విశ్రాంతి గృహాల్లో క‌లిపి 24 గ‌దులు భ‌క్తుల‌కు అందుబాటులోకి రానున్నాయి. కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, దాతలు రాజేష్ శర్మ, నరేంద్ర చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Back to Top