అంజనాద్రిలో అభివృద్ధి పనులకి భూమిపూజ చెయ్యడం గొప్ప కార్యక్రమం

టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి

 తిరుమలలో హనుమాన్‌ జన్మస్థల అభివృద్ధికి భూమిపూజ

తిరుమల: అంజనాద్రిలో అభివృద్ధి పనులకి భూమిపూజ చెయ్యడం గొప్ప కార్యక్రమమ‌ని టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.  ఆకాశగంగ సమీపంలోని హనుమాన్‌ జన్మస్థలంలో అభివృద్ధి పనులకు బుధవారం భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతిస్వామి, శ్రీతులసీ పీర్‌ సేవాన్యాస్, చిత్రకూటం పద్మభూషణ్‌ శ్రీ రామభద్రాచార్య మహరాజ్, ఆయోధ్య, రామజన్మభూమి తీర్థ ట్రస్ట్‌ కోశాధికారి స్వామి గోవిందదేవ్‌గిరీజీ మహారాజ్, వీహెచ్‌పీ అంతర్జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి కప్పగంతుల కోటేశ్వరశర్మ పాల్గొన్నారు.

అనంతరం విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతిస్వామి మాట్లాడుతూ.. 'తిరుమల వేంకటేశ్వరస్వామి పాదాల చెంత హనుమాన్ జన్మ స్థలానికి భూమిపూజ జరిగింది. వేదాలకు పుట్టినిళ్లు ఆంధ్రప్రదేశ్. తిరుమల శ్రీవారి ఆలయం ఆంధ్రప్రదేశ్ ఆస్థి. వేంకటేశ్వరస్వామి అనుగ్రహం అనుమతి లేనిదే ఏదీ జరగదు. అన్నమయ్య, పురందరదాసు, తరిగొండ వెంగమాంబ వేంకటేశ్వరస్వామిని సాక్షాత్కరించారు. అంజనాద్రే హనుమాన్ జన్మస్థలం అనేది సామాన్యమైన విషయం కాదు. అనేకమంది వేదపండితులు, శాస్త్ర పండితులు పరిశోధించి నిర్థారించారు' అని స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి అన్నారు. 

 
టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. అంజనాద్రిలో అభివృద్ధి పనులకి భూమిపూజ చెయ్యడం గొప్ప కార్యక్రమం. ఆకాశగంగ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. కోర్టులో దీనిపై స్టే వచ్చిందని అడిగారు. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము. ఆలయంలో ఎలాంటి మార్పులు చెయ్యడం లేదు. భక్తులకి సౌకర్యమైన వసతులు ఏర్పాటు చేస్తాము. వివాదాల జోలికి మేము వెళ్లడం లేదు. సీఎం జగన్ హిందూ ధర్మ ప్రచారం పెద్దఎత్తున చెయ్యాలని ఆదేశించాడు. అందుకే రెండు తెలుగు రాష్ట్రాలలో 502 ఆలయాలు నిర్మిస్తున్నాము. వెనుకబడిన, బలహీన వర్గాలున్న ప్రాంతాలలో ఆలయాలు నిర్మాణం చేస్తున్నాము. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు వేంకటేశ్వరస్వామి ఆలయాలు నిర్మిస్తున్నాము. స్వామి ఆశీస్సులు, ఆజ్ఞతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాము' అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

Back to Top