ఎంపీగారు.. ఐ యామ్ సారీ

 నందిగం సురేష్‌కు బాబూరావు క్షమాపణ
 

 తాడికొండ: కొందరు వ్యక్తులు తనను ఆర్థికంగా ఆదుకుంటానని ప్రలోభపెట్టి ఎంపీ నందిగం సురేష్‌పై ఆరోపణలు చేయించారని బత్తుల బాబూరావు కన్నీటి పర్యంతమయ్యారు. అనారోగ్య కారణాల దృష్ట్యా పోలీసు ఉద్యోగానికి దూరమైన బత్తుల బాబూరావు సిఫార్సు నిమిత్తం ఎంపీ నందిగం సురేష్‌ను కలవగా దాడి చేశారనే కథనాలు వెలువడిన నేపథ్యంలో ఆయన ఎంపీని కలిసి క్షమాపణ చెప్పారు. ఆదివారం రాత్రి తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో ఎంపీ నందిగం సురేష్‌ నివాసానికి వెళ్లిన బాబూరావు తీరని అన్యాయం చేశానని ఎంపీ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.

 
కొందరు వ్యక్తులు తనను ప్రలోభాలకు గురిచేసి ఆదుకుంటానని చెప్పినందున అలా మాట్లాడానే తప్ప ఈ వ్యవహారం రాష్ట్రంలో ఇంత రాద్ధాంతం అవుతుందని తాను ఊహించలేదన్నారు. జరిగిన ఘటనలో ఎంపీ ప్రమేయం ఏమీ లేదని స్పష్టం చేశారు. కొన్ని చానళ్లలో వస్తున్న కథనాలు ఉద్దేశపూర్వకంగా, తనను తప్పుదారి పట్టించి మాట్లాడించిన మాటలే తప్ప వాటిలో నిజం లేదన్నారు.

Back to Top