‘పెగాసస్‌’ దోషులను ప్రజల ఎదుట నిలబెడతాం

పూర్తి సమాచారం వెలికితీసి చంద్రబాబు నిర్వాకాన్ని బయటపెడతాం

హౌస్‌ కమిటీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి

అమరావతి: అడ్డదారుల్లో పెగాసస్‌ స్పైవేర్‌ కొనుగోలు చేసి వ్యక్తుల, పార్టీల సమాచారాన్ని దొంగిలించే ప్రయత్నం గత టీడీపీ ప్రభుత్వం చేసిందని, దోషులను ప్రజల ముందు నిలబెడతామని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే, హౌస్‌ కమిటీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు హయాంలో పెగాసస్‌ స్పైవేర్‌ ద్వారా మానవ హక్కులను చోరీచేసిందన్న ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు నియమించిన ఏపీ శాసనసభా సంఘం (హౌస్‌ కమిటీ) సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది.  

హౌస్‌ కమిటీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి అధ్యక్షతన సభ్యులు కరణం ధర్మశ్రీ, భాగ్య‌ల‌క్ష్మి, మొండితోక జగన్‌మోహన్‌రావు, మద్దాళి గిరిధర్, హోంశాఖ, ఐటీ అధికారులు హాజరయ్యారు. ఫోన్‌ ట్యాపింగ్, నిబంధనలకు విరుద్ధంగా రహస్య పరికరాల కొనుగోలుకు సంబంధించి ఉన్నతాధికారులను కమిటీ విచారించింది. 

సమావేశం అనంతరం హౌస్‌ కమిటీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. గత చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేట్‌ వ్యక్తుల ఫోన్లు ట్యాప్‌ చేసిందన్నారు. దోషులను ప్రజల ముందు నిలబెడతామన్నారు. ఇవాళ్టి సమావేశంలో ప్రాథమికంగా చర్చించాం. వచ్చే సమావేశంలో పెగాసస్‌తో పాటు ఇతర అంశాలపైనా విచారిస్తామన్నారు. విచారణకు అప్పటి అధికారులను కూడా పిలుస్తామన్నారు. జూలై 5, 6 తేదీల్లో మరోసారి భేటీ అవ్వాలని నిర్ణయించామని వివరించారు. వచ్చే సమావేశంలో పూర్తి సమాచారం వెలికితీస్తామని, చంద్రబాబు చేసిన నిర్వాకాన్ని బయటపెడతామని భూమన కరుణాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. 

 

Back to Top