తాడేపల్లి: సాలూరులో 10వ తరగతి విద్యార్థి అరుణ్ తేజ్ పాఠశాల ప్రహరీ కూలి మృతి చెందడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని, ఈ ఘటనతో మంత్రి నారా లోకేష్ చేతకానితనం మరోసారి బహిర్గతమైందని ఆరె శ్యామల ఆరోపించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ చదువుకోవడానికి పాఠశాలకు వచ్చిన విద్యార్థి మృతదేహంగా ఇంటికి వెళ్లాల్సిన దుస్థితి రావడం అత్యంత బాధాకరమని, ఇందుకు బాధ్యులెవరో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక విద్యారంగంలో పేపర్ లీకులు, ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలు చదువుకునే పాఠశాలల్లో కనీస భద్రతా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యతను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విస్మరించారని మండిపడ్డారు. ఇకనైనా పాఠశాలల్లో భద్రతా ప్రమాణాలు మెరుగుపరచి, మరో విద్యార్థి ప్రాణం పోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆరె శ్యామల డిమాండ్ చేశారు. నారా లోకేష్ ఫెయిల్డ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అని, విద్యాశాఖ మంత్రిగా కొనసాగడానికి లోకేష్ పనికిరాడని ఆమె తీవ్రంగా విమర్శించారు. విద్యాశాఖను పట్టించుకోకుండా.. వైయస్ఆర్‌సీపీ హయాంలో నాడు-నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చామని ఆరె శ్యామల తెలిపారు. విద్యార్థులకు రాగిజావ, గుడ్డు, పల్లీ చిక్కీ వంటి పోషకాహారం అందించడంతో పాటు ట్యాబ్‌లు, డిజిటల్ ఎడ్యుకేషన్ వంటి కార్యక్రమాలను అమలు చేశామని పేర్కొన్నారు. వైయస్ జగన్ గారి హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులు రికమెండేషన్లు అడిగే స్థాయికి పాఠశాలలను అభివృద్ధి చేశామని ఆమె అన్నారు. మంత్రి నారా లోకేష్ అసమర్థత కారణంగా రెండేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు తగ్గుతుంటే, దాన్ని కప్పి పుచ్చుకునేందుకు జననాలు తగ్గడం వల్ల అడ్మిషన్లు తగ్గాయని ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. లోకేష్ విద్యాశాఖా మంత్రి చేపట్టాల్సిన బాధ్యతలను పక్కనపెట్టి ఇతర శాఖల గురించి పట్టించుకోవడం ఎక్కువైందని.. రెండేళ్లయినా తన శాఖ మీద తనకే సరైన అవగాహన లేదని ఆరోపించారు. విద్యాశాఖకు సంబంధించిన ప్రశ్నలకు ఇతర శాఖల మంత్రులు సమాధానాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో నారా లోకేష్ స్పష్టం చేయాలని అన్నారు.