విద్యుత్‌ ఉద్యోగులతో ఫలించిన చర్చలు.. పీఆర్సీపై అంగీకారం

మంత్రులు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, బొత్స బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ సమక్షంలో చర్చలు 

ఒప్పందంపై యాజమాన్యం, ఉద్యోగ సంఘాల సంతకాలు

సమ్మె నోటీసు ఉపసంహరించుకున్న ఏపీఎస్‌పీఈజేఏసీ

స‌చివాల‌యం: విద్యుత్‌ ఉద్యోగులతో ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. దీంతో విద్యుత్‌ ఉద్యోగులు తలపెట్టిన ఆందోళన కార్యక్రమాన్ని విరమించారు. పేరివిజన్‌ కమిషన్‌ (పీఆర్సీ) లో భాగంగా  డిమాండ్ల సాధన కోసం ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ఈనెల 10వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ పవర్‌ ఎంప్లాయిస్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (ఏపీఎస్‌పీఈజేఏసీ) నోటీసు ఇచ్చిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఏపీఎస్‌పీఈజేఏసీ ప్రతినిధులతో ప్రభుత్వం బుధవారం సచివాలయంలో చర్చలు జరిపింది. ఇది ఉద్యోగుల అనుకూల ప్రభుత్వమని, అందరికీ మేలుచేయాలని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్ రెడ్డి మంచి నిర్ణయాలు తీసుకున్నారని రాష్ట్ర ఇంధన, అటవీ పర్యావరణం, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. 

విద్యుత్‌ సంస్థలను కాపాడుకునేందుకు అటు యాజమాన్యం, ఇటు ఉద్యోగులు ఎంతోకొంత త్యాగం చేయాల్సిన అవసరం ఉందని సమావేశంలో మంత్రులు, అధికారులు ఉద్బోధించారు.యాజమాన్యం ప్రతిపాదనలను ఆమోదిస్తున్నట్లు జేఏసీ ప్రతినిధులు ప్రకటించారు. ఈమేరకు పీఆర్సీ ప్రతిపాదనలను ఆమోదిస్తూ ఏపీ ట్రాన్స్‌కో, ఏపీజెన్‌కో, ఏపీసీపీడీసీఎల్, ఈపీడీసీఎల్, స్పీడీసీఎల్‌ అధికారులు, జేఏసీ ప్రతినిధులు సంతకాలు చేశారు. 

సింగిల్‌ మాస్టర్‌ స్కేల్‌ పీపీతో కలిపి రూ.2.60 లక్షలు, 8 శాతం ఫిట్‌మెంట్, ఒక డీఏ విడుదల, 12 వాయిదాల్లో బకాయిలు, వైద్య పరిమితి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు, మాస్టర్‌ స్కేల్‌ రూ.2.60 లక్షలు దాటిన వారికి తప్పనిసరిగా పర్సనల్‌ పే, అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందికి 2018 స్కేల్‌ ప్రకారం జీతాలతో పాటు అదనంగా 2 శాతం పెంపునకు యాజమాన్యాలు, ఉద్యోగ సంఘాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. యాజమాన్యం ప్రతిపాదనలను ఆమోదిస్తున్నట్లు జేఏసీ ప్రతినిధులు ప్రకటించారు.

ఈ మేరకు పీఆర్సీ ప్రతిపాదనలను ఆమోదిస్తూ ఏపీ ట్రాన్స్‌కో, ఏపీజెన్‌కో, ఏపీఈపీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్‌ అధికారులు, జేఏసీ ప్రతినిధుల మధ్య శుక్రవారం ఒప్పందం జరుగుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. ఈ చర్చల్లో సీఎస్‌ జవహర్‌రెడ్డి, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి షంషేర్‌ సింగ్‌ రావత్, ఏపీజెన్‌కో ఎండీ చక్రధర్‌బాబు, ఏపీసీపీడీసీఎల్‌ సీఎండీ పద్మాజనార్దన్‌ రెడ్డి, ట్రాన్స్‌కో జేఎండీ మల్లారెడ్డి, జేఏసీ నేతలు చంద్రశేఖర్, ప్రతాప్‌రెడ్డి, సాయికష్ణ, శేషారెడ్డి, శ్రీనివాస్‌ కుమార్‌ పాల్గొన్నారు. 

Back to Top