ప్రివిలేజ్‌ కమిటీని క్షమాపణ కోరిన అచ్చెన్నాయుడు

ముగిసిన ప్రివిలేజ్‌ కమిటీ సమావేశం

అమరావతి: అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు నేడు ప్రివిలేజ్‌ కమిటీ విచారణకు హాజరయ్యారు. తాను చేసిన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసినవి కావని, ప్రెస్‌నోట్‌ పొరపాటున బయటకు వెళ్లిందని, అయినప్పటికీ తన వ్యాఖ్యలను ఉపసంహరించుఉంటున్నానని, జరిగిన సంఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నానని అచ్చెన్నాయుడు తన వివరణ ఇచ్చినట్టు ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీ చైర్మన్‌ కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. ప్రివిలేజ్‌ కమిటీ సమావేశం అనంతరం చైర్మన్‌ కాకాణి మీడియాతో మాట్లాడారు. అచ్చెన్నాయుడు∙ఇచ్చిన వివరణ బ్రీఫ్‌ నోట్‌ కమిటీ సభ్యులందరికీ పంపిస్తామని, సభ్యుల అభిప్రాయం మేరకు తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామన్నారు.  

టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ గతంలో విచారణకు హాజరుకాలేదని, మరుసటి రోజు నేరుగా ఫోన్‌ చేసి అందుబాటులో లేనందు వల్ల నోటీస్‌ అందుకోలేకపోయానని చెప్పారని, రవికుమార్‌ విచారణకు రాకపోవడానికి కారణాలను విశ్లేషిస్తున్నామని చైర్మన్‌ కాకాణి చెప్పారు. మరో అవకాశం ఇస్తే వస్తానని కూన రవికుమార్‌ చెప్పారన్నారు. వచ్చిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్, రామానాయుడుకు ఇప్పటికే నోటీసులు జారీ చేశామని చెప్పారు. ఈనెల 21వ తేదీన మరోసారి సమావేశం ఏర్పాటు చేసి పెండింగ్‌లో ఉన్న అంశాలను క్లియర్‌ చేస్తామన్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యేనాటికి వాటి మీద స్పష్టత ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నామని ప్రివిలేజ్‌ కమిటీ చైర్మన్‌ కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు.

తాజా వీడియోలు

Back to Top