విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన పీడ మరో 20 రోజుల్లో వదిలిపోతుందని, హైటెక్ దోపిడీ ముఖ్యమంత్రికి ప్రజలంతా ఓటు హక్కుతో గుణపాఠం చెప్పారని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్‌బాబు అన్నారు. డేటా చోరీ కేసుపై ప్రతిపక్షం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తన తాబేదారులతో ఇష్టానుసారంతి తిట్టించి చంద్రబాబు రాక్షస ఆనందం పొందుతున్నాడని మండిపడ్డారు. వైయస్‌ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను సుధాకర్‌బాబు తీవ్రంగా ఖండించారు. విజయవాడ వైయస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. డేటా చోరీ విషయం సమాధానం చెప్పాల్సిన తెలుగుదేశం పార్టీ నాయకులు సిగ్గులేకుండా చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టు చదువుతూ పూటకో మాట మాట్లాడుతున్నారని సుధాకర్‌బాబు ధ్వజమెత్తారు. 23వ తేదీ వెలువడే ఎన్నికల ఫలితాలు ముందుగానే పసిగట్టి సిగ్గులేకుండా మాట్లాడుతున్నారన్నారు. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని చేతగాని దద్దమ్మలు విజయసాయిరెడ్డిపై అవాకులు పేలుతున్నారని, డేటా చోరీ చేసి ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని చంద్రబాబు, లోకేష్ రోడ్డున పడేశారన్నారు. డేటా చోరీ జరిగిన మాట వాస్తవమా.. కాదా..? డేటా చోరీకి పాల్పడిన దొంగ అశోక్, ఐటీ మంత్రి లోకేష్‌కు ఉన్న సంబంధం ఏంటీని ప్రశ్నించారు. సేవా మిత్ర తెలుగుదేశం యాప్ నుంచి ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారం చేరవేయలేదా..? డేటా చోరీ అశామాషీ వ్యవహారం కాదని, దీనిపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఐటీ గ్రిడ్స్ సంస్థ ద్వారా ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని తెలుగుదేశం పార్టీ దొంగిలించిందని ప్రతిపక్షంగా ప్రశ్నిస్తుంన్నామని, ఆధార్ సమాచారంతో ఓట్లను తారుమారు చేయాలని ప్రయత్నం చేశారు. వైయస్‌ఆర్ సీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగించే కార్యక్రమం జరిగిందని, చంద్రబాబు కుటిల ప్రయత్నాన్ని సమర్థవంతంగా ఎదుర్కున్నామన్నారు. ఐటీ గ్రిడ్స్ అశోక్, లోకేష్‌కు ఉన్న సంబంధం ఏంటని సుధాకర్‌బాబు ప్రశ్నించారు. ఈ రోజు వరకు లోకేష్ మీడియా ముందుకు వచ్చి డేటా చోరీపై ఎందుకు సమాధానం చెప్పలేదని నిలదీశారు. డేటా చోరీ ఎన్నికల్లో గెలవడం కోసమా..? లేక ఆస్తులను దోచుకునే కార్యక్రమం చేస్తున్నారా..? అని ప్రశ్నించారు. ఐటీ గ్రిడ్స్ సంస్థ యజమాని అశోక్‌ను దాచిపెట్టింది ఎవరు..? డేటా చోరీ చేయకపోతే.. ఎందుకు అశోక్‌ను అరెస్టు చేయించడం లేదని ప్రశ్నించారు. డేటా చోరీపై వేసిన సిట్ ఏం సాధించింది. డేటా చోరీ జరిగిందని చెప్పిందా.. లేదని చెప్పిందా.. సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ పాపంలో చంద్రబాబు, లోకేష్ భాగస్వామ్యం లేకపోతే సీబీఐ ఎంక్వైరీ ఎందుకు వేయించలేదని నిలదీశారు. లోకేష్ కోసం యామిని, యనమల కోసం కుటుంబరావు మీడియా ముందుకు వస్తున్నారని, మరి చంద్రబాబు కోసం ఎవరు వస్తారని సుధాకర్‌బాబు ఎద్దేవా చేశారు. అసలు లోకేష్‌కు, యామినికి మధ్య ఉన్న సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ఎందుకు యామిని పెట్రేగిపోతూ.. అర్థం లేకుండా మాట్లాడుతుందన్నారు. రాజకీయమంటే తప్పును నిజాయితీగా ఒప్పుకోవడం, ప్రజల ముందుకు వచ్చి క్షమాపణలు చెప్పుకోవడమని తెలుసుకోవాలన్నారు. చంద్రబాబు లాంటి దుర్మార్గపు ముఖ్యమంత్రిని ఇప్పటి వరకు చూడలేదని, మరో 20 రోజుల్లో దాష్టికాలకు, దుర్మార్గాల అంతం జరగబోతుందన్నారు. వైయస్‌ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిపై నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని టీడీపీ నేతలకు సూచించారు.