రెండో ఏడాది వైయస్‌ఆర్‌ లైఫ్‌ టైమ్‌ ఎచీవ్‌మెంట్, ఎచీవ్‌మెంట్‌ అవార్డుల ప్రకటన

ఈ ఏడాది 8 రంగాల్లో మొత్తంగా 30 అవార్డులు 

న‌వంబ‌ర్ 1వ తేదీ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వం రోజున అవార్డుల ప్ర‌దానం

స‌చివాల‌యం: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వ్యక్తులకు రెండో ఏడాది వైయ‌స్ఆర్ లైఫ్ టైమ్ ఎచీవ్‌మెంట్, వైయ‌స్ఆర్ ఎచీవ్‌మెంట్ అవార్డుల‌ను ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర కమ్యూనికేషన్స్‌ అడ్వ‌యిజ‌ర్ జీవీడీ కృష్ణమోహన్ అవార్డులను ప్రకటించారు. వ్యవసాయం, కళలు, సంస్కృతి, సాహిత్యం మొదలైన కేటగిరీలకు అవార్డుల్లో ప్రభుత్వం పెద్దపీట వేసింద‌ని చెప్పారు. అసామాన్య ప్రతిభ కనబర్చిన సామాన్యలను అవార్డుల హైపవర్ స్క్రీనింగ్ కమిటీ ఎంపిక చేసింది. 2022 నవంబరు 1న, రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా.. ఈ అవార్డుల‌ను ప్ర‌దానం చేయ‌నున్నారు. వైయ‌స్ఆర్ లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డు క్రింద రూ.10 లక్షల నగదు, వైయ‌స్ఆర్ ప్రతిమ, మెడల్ (జ్ఞాపిక), శాలువ బహుకరిస్తారు. వైయ‌స్ఆర్‌ ఎచీవ్ మెంట్ అవార్డు క్రింద రూ. 5 లక్షల నగదు, వైయ‌స్ఆర్ ప్రతిమ, మెడల్ (జ్ఞాపిక), శాలువ బహుకరిస్తారు.

రాష్ట్ర కమ్యూనికేషన్స్‌ సలహాదారు జీవీడీ కృష్ణమోహన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత పురస్కారాలుగా ఈ అవార్డుల్ని ప్రదానం చేస్తుంద‌న్నారు. వివిధ రంగాల్లో సామాన్యులుగా ఉన్న అసామాన్యులను క‌మిటీ ఎంపిక చేసింద‌న్నారు. గ‌తేడాది న‌వంబ‌ర్ 1వ తేదీన 62 సంస్థలకు, వ్యక్తులకు తొలి అవార్డుల్ని అందజేశామ‌ని గుర్తుచేశారు. ప్రధానంగా మన గ్రామం, మన వ్యవసాయం, మన కళలు, సాహిత్యం, సంస్కృతి–సంప్రదాయాలు, సమాజ సంక్షేమం–అభివృద్ధి.. ఇలాంటి రంగాల్లో వారి జీవితాలను అర్పించిన మహనీయులకు.. ఈ అవార్డులు ప్రదానం చేయటం జ‌రుగుతుంద‌న్నారు.  

ఈ ఏడాది 8 రంగాల్లో మొత్తంగా 30 అవార్డులు ప్రకటిస్తున్నామ‌న్నారు. కమిటీ సిఫార్సులు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆమోదం పొందిన అనంత‌రం ఈ పురస్కారాల ప్రకటిస్తున్న‌ట్టు వివ‌రించారు. ఇందులో 20 జీవిత సాఫల్య పురస్కారాలు (లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్‌ అవార్డులు), 10 సాఫల్య పురస్కారాలు (ఎచీవ్‌మెంట్‌ అవార్డులు) అందించ‌నున్న‌ట్టు తెలిపారు. 

వ్యవసాయం
1) ఆదివాసీ కేష్యూనట్‌ ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ
(సోడెం ముక్కయ్య – బుట్టాయగూడెం, ఏలూరు జిల్లా)
2) కుశలవ కోకోనట్‌ ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్స్‌ కంపెనీ 
(ఎ.గోపాలకృష్ణ; బి.ఆర్‌. అంబేద్కర్‌ కోనసీమ జిల్లా)
3) అన్నమయ్య మ్యూచువల్లీ ఎయిడెడ్‌ కోఆపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌
(జయబ్బనాయుడు,  తలుపల గ్రామం, పీలేరు మండలం, అన్నమయ్య జిల్లా)
4) అమృత ఫల ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ, 
(కె.ఎల్‌.ఎన్‌. మౌక్తిక, సబ్బవరం, అనకాపల్లి జిల్లా)
5) కట్టమంచి బాలకృష్ణారెడ్డి, 
(కట్టమంచి గ్రామం, చిత్తూరు జిల్లా)
- వీరందరికీ వైయస్‌ఆర్ ఎచీవ్‌మెంట్ అవార్డులు ప్రకటిస్తున్నాం. 

కళలు–సంస్కృతి విభాగంలో..
1) కళాతపస్వి, నిండు తెలుగుదనం ఉట్టిపడే తెలుగువారు కె.విశ్వనాథ్‌కి వైయస్‌ఆర్‌ లైఫ్ టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డును ప్రకటిస్తున్నాం.
2) బడుగు బలహీన వర్గాల కోసం, గ్రామం కోసం, పేదల కోసం.. నిరంతరం తపించి జీవితాన్ని అర్పించిన ఆర్‌. నారాయణమూర్తికి వైయస్‌ఆర్‌ లైఫ్ టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డును ప్రకటిస్తున్నాం.
3) సుప్రసిద్ధ రంగస్థల కళాకారుడు నాయుడు గోపీకి వైయస్‌ఆర్‌ ఎచీవ్‌మెంట్ అవార్డును ప్రకటిస్తున్నాం.
4) మన కలంకారీకి మరోసారి గౌరవం ఇస్తూ పెడన నేతన్న పిచుక శ్రీనివాస్‌కు వైయస్‌ఆర్‌ ఎచీవ్‌మెంట్ అవార్డును ప్రకటిస్తున్నాం.
5)  దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన ఉదయగిరి ఉడెన్‌ కట్లరీ. వంటింట్లో వాడే చెక్క వస్తువుల తయారీలో శ్రీమతి షేక్‌ గౌసియా బేగంకి వైయస్‌ఆర్ ఎచీవ్‌మెంట్ అవార్డులను ప్రకటిస్తున్నాం. 

సాహిత్య సేవలో.. 
1) విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌
2) ఎమెస్కో ప‌బ్లిషింగ్ హౌస్ (విజ‌య్‌కుమార్‌)
3) రాయ‌ల‌సీమ‌కు చెందిన ప్ర‌సిద్ధ‌ రచయిత డాక్టర్‌ శాంతి నారాయణ 
- వారి సేవలకు వైయస్‌ఆర్‌ లైఫ్ టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డులను ప్రకటిస్తున్నాం. 

మహిళా సాధికారత–రక్షణ విభాగంలో...
1) ప్రజ్వలా ఫౌండేషన్‌– సునీతా కృష్ణన్ వైయస్‌ఆర్‌ లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్ అవార్డు ప్రకటిస్తున్నాం. 
2) ఉయ్యూరుకు చెందిన శిరీషా రిహేబిలిటేషన్‌ సెంటర్‌కి వైయస్‌ఆర్‌ లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్ అవార్డు ప్రకటిస్తున్నాం. 
3) ఇక మూడో అవార్డును దిశ–పోలీసింగ్‌కు ప్రకటిస్తున్నాం. నేరం జరగక ముందు, జరుగుతోందనే సమాచారం ఉన్నప్పుడు.. ఒక బాలిక లేదా మహిళ ఆపదలో ఉన్నప్పుడు.. వెంటనే  వారిని ఆదుకునే వ్యవస్థగా.. మన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చొరవతో, ఆయన మానస పుత్రికగా దిశ యాప్‌ రూపొందింది. 
దిశ యాప్‌ద్వారా వచ్చిన ఎస్‌వోఎస్‌ను అందుకున్న వెంటనే నిమిషాల్లోనే సంఘటన స్థలానికి చేరుకొని కాపాడిన అయిదుగురు పోలీసులకు.. ఈ ఏడాది వైయస్‌ఆర్‌ ఎచీవ్‌మెంట్ అవార్డును ఉమ్మడిగా ప్రకటించటం జరుగుతోంది. 
రవాడ జయంతి; ఎస్‌వీవీ లక్ష్మీనారాయణ; రాయుడు సుబ్రహ్మణ్యం, హజ్రతయ్య; పి.శ్రీనివాసులు.. వీరికి సంయుక్తంగా వైయస్‌ఆర్‌ ఎచీవ్‌మెంట్ అవార్డుకు ఎంపిక చేయటం జరుగుతోంది. 

విద్యా రంగం నుంచి..
1) మదనపల్లి – రిషీ వేలీ విద్యా సంస్థకు వైయస్‌ఆర్‌ లైఫ్‌టైమ్‌ ఎచీవ్‌మెంట్ అవార్డు ప్రకటిస్తున్నాం. 
2) కావలి– జవహర్‌ భారతి విద్యా సంస్థకు వైయస్‌ఆర్‌ లైఫ్‌టైమ్‌ ఎచీవ్‌మెంట్ అవార్డు ప్రకటిస్తున్నాం. 
3) వ్యక్తిత్వ వికాసం.. ఆలోచన విధానం.. మనస్తత్వ శాస్త్రాల నిపుణుడు బి.వి.పట్టాభిరామ్‌కి.. లైఫ్‌టైమ్‌ ఎచీవ్‌మెంట్ అవార్డును ప్రకటిస్తున్నాం. 
4) బ్యాంకింగ్‌ రంగంలో వేల మంది ప్రవేశానికి దారి చూపిన దార్శనికుడు, మంచి మాస్టారు.. నంద్యాలకు చెందిన దస్తగిరి రెడ్డికి వైయస్‌ఆర్‌ ఎచీవ్‌మెంట్ అవార్డును ప్రకటిస్తున్నాం. 

మీడియా అవార్డులు..
సీనియర్‌ పాత్రికేయులు
1) బండారు శ్రీనివాసరావు
2) సతీశ్‌ చందర్‌
3) మంగు రాజగోపాల్‌
4) ఎంఈవీ ప్రసాదరెడ్డి
- ఈ నలుగురికీ వైయస్‌ఆర్‌ లైఫ్‌టైమ్‌ ఎచీవ్‌మెంట్ అవార్డులు ప్రకటిస్తున్నాం. 

వైద్య రంగంలో.. 
1) డాక్టర్‌ బి. నాగేశ్వరరెడ్డి, ఏఐజీకి.. ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ
2) డాక్టర్‌ వరప్రసాదరెడ్డి, శాంతా బయోటెక్‌కి.. (హెపటైటిస్‌–బి వ్యాక్సిన్‌) 
3) భారత్‌ బయోటెక్‌ డాక్టర్‌ కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లా (కోవాక్సిన్‌)
4) అపోలో హాస్పిటల్స్‌ వ్యవస్థాపకుడు, ఛైర్మన్‌ ప్రతాప్‌ సి రెడ్డి 
5) ఎల్‌.వి.ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌ తరఫున శ్రీ గుళ్ళపల్లి నాగేశ్వరరావు 
- ఈ అయిదు సంస్థలు/వ్యక్తులకు వైయస్‌ఆర్‌ లైఫ్‌టైమ్‌ ఎచీవ్‌మెంట్ అవార్డులు ప్రకటిస్తున్నాం. 

పారిశ్రామిక రంగంలో..
అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన గ్రంధి మల్లికార్జునరావుకి వైయస్‌ఆర్‌ లైఫ్ టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డు ప్రకటిస్తున్నాం.  

ఇందులో రంగాల వారీగా చూస్తే..  వ్యవసాయానికి 5; సంస్కృతి–సంప్రదాయాలకు 5; మహిళా సాధికారత, రక్షణకు 3; తెలుగు భాషకు 3; విద్యా రంగానికి 4; మీడియా నుంచి 4; వైద్య రంగానికి 5; పరిశ్రమకు 1 అవార్డుల్ని ఇవ్వటం జరిగింది. 

ఈ అవార్డుల‌న్నింటినీ ప్ర‌తీ సంవ‌త్స‌రం న‌వంబ‌ర్ 1వ తేదీన రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వం నాడు ముఖ్య‌మంత్రి చేతుల మీదుగా ప్ర‌దానం చేయాల‌ని క‌మిటీ నిర్ణ‌యించింది. ఈ కార్య‌క్ర‌మానికి గ‌వ‌ర్న‌ర్‌ను కూడా ఆహ్వానిస్తున్నాం. వారి చేతుల మీదుగా కూడా అవార్డుల ప్ర‌దానం జ‌రుగుతుంది` అని కమ్యూనికేషన్స్‌ సలహాదారు జీవీడీ కృష్ణమోహన్ తెలిపారు. ఈ విలేక‌రుల‌ సమావేశంలో సమాచార శాఖ కమిషనర్ విజయకుమార్ రెడ్డి, అవార్డుల కమిటీ మెంబర్- కన్వీనర్ బాలసుబ్రమణ్యం రెడ్డి పాల్గొన్నారు.

Back to Top