రెడ్‌బుక్‌ పేరుతో అరాచకాలు

  హిందూపురం వైయస్ఆర్‌ సీపీ కార్యాలయంపై దాడిని ఖండించిన అనంత 

అనంతపురం : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెడ్‌బుక్‌ పేరుతో అరాచకాలు సృష్టిస్తున్నారని వైయస్ఆర్‌ సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే శనివారం హిందూపురంలో వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంపై టీడీపీ గూండాల దాడి జరిగిందన్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. వైయస్ఆర్‌ సీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి బాధ్యులు ఎవరో సీసీ కెమెరాల్లో రికార్డయి ఉందని, తక్షణం వారిని అరెస్ట్‌ చేసి శిక్షించాలని పోలీసుశాఖను కోరారు. ప్రజలకు మంచి చేయడం చేతగాక ప్రశ్నిస్తే ఇలా పార్టీ కార్యాలయంపై దాడి చేసి ఫర్నీచర్‌ ధ్వంసం చేయడం, సిబ్బందిని విచక్షణా రహితంగా కొట్టడం హేయనీయమని పేర్కొన్నారు. ఈ రోజు అధికారం ఉందన్న అహంతో రెచ్చిపోతున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలకు భవిష్యత్‌లో తప్పకుండా గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయన్నారు. రెడ్‌బుక్‌ రాజ్యాంగం పేరుతో నారా లోకేష్‌ అరాచకశక్తులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. పోలీసులు అధికార పార్టీ నేతలకు జీహుజూర్‌ అంటుండడం వల్లే శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. కాలం అన్నింటికీ తప్పకుండా సమాధానం చెబుతుందని, ఈ రోజు మీరు నాటే విత్తనమే భవిష్యత్‌లో మహా వృక్షమవుతుందన్న సంగతి మరచిపోవద్దని హితవు పలికారు.

Back to Top