రాయలసీమ ద్రోహి.. చంద్రబాబు

అధికారంలో ఉండగా ప్రాజెక్టులను పట్టించుకోని బాబు

పోలవరంను ఏటీఎంగా మార్చుకున్నారని ప్రధాని మోదీ అనలేదా?

హంద్రీనీవాను తాగునీటి ప్రాజెక్టుకే పరిమితం చేసిందెవ్వరు?

అనంతకు కృష్ణా జలాలు తెచ్చిన ఘనత వైయ‌స్‌ఆర్‌ది

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేసిందే వైయ‌స్‌ఆర్‌

సాగునీటి ప్రాజెక్టుల విషయంలో మాకు చిత్తశుద్ధి ఉంది

అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి స్పష్టీకరణ 

అనంతపురం :  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయం దండగ అంటూ సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. గురువారం నగరంలోని 11వ డివిజన్‌లో ‘జగనన్న సురక్ష’ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ సేవలకు సంబంధించి లబ్ధిదారులకు ఉచితంగా సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే అనంత మీడియాతో మాట్లాడారు. 

తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ప్రాజెక్టులు గుర్తుకు వస్తాయని అన్నారు. అధికారంలో ఉండి ఏమీ చేయని చంద్రబాబు..ఈ రోజు సాగునీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనేక సాగునీటి ప్రాజెక్టులకు వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి రూపకల్పన చేశారని అన్నారు. వెనుకబడిన రాయలసీమకు ద్రోహం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు మాత్రమేనని తెలిపారు. ప్రధానంగా కరువుకు నిలయమైన అనంతపురం జిల్లాకు కృష్ణా జలాల కోసం ఎంతో మంది పోరాటం చేశారని గుర్తు చేశారు. ఎన్టీఆర్‌ను గద్దె దింపిన తర్వాత ఉరవకొండ వద్ద 40 టీఎంసీల సామర్థ్యంతో హంద్రీనీవాకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు.. దాన్ని శిలాఫలకానికే పరిమితం చేశారని తెలిపారు. ఆ తర్వాత సాగునీటి పథకాన్ని 5 టీఎంసీలకు కుదించి తాగునీటి పథకంగా మార్చి ఆత్మకూరు వద్ద మరోసారి శిలాఫలకం వేయలేదా? అని ప్రశ్నించారు. 

2004లో వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉరవకొండ వద్ద పునాది రాయి వేసి హంద్రీనీవా పనులను పరుగుపెట్టించారని అన్నారు. 2012 నుంచి హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలు జీడిపల్లికి వస్తున్నాయంటే అది వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి చలవేనని స్పష్టం చేశారు. ఆనాడు తనతో పాటు అప్పటి మంత్రి రఘువీరారెడ్డి హంద్రీనీవా వెంట నీటితో పాటు పాదయాత్రగా వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. 

ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు రూపశిల్పి కూడా వైయ‌స్‌ రాజశేఖరరెడ్డేనని అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం గుర్తిస్తే తన స్వార్థం కోసం ప్రాజెక్టు పనులు తానే చేస్తానని చంద్రబాబు బాధ్యత తీసుకున్నారన్నారు. చివరకు స్పిల్‌ వేలను కూడా సరిగా నిర్మించలేదని దుయ్యబట్టారు. పోలవరంను చంద్రబాబు ఓ ఏటీఎంలా వాడుకున్నారని సాక్షాత్తూ ప్రధాని మోడీ అనలేదా? అని ప్రశ్నించారు.

 ఐదేళ్ల టీడీపీ పాలనలో పోలవరంను నాశనం చేశారని, జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాకే అక్కడ పనులు సక్రమంగా జరుగుతున్నాయని అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. అధికారం లేనప్పుడు మాత్రమే టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు ప్రాజెక్టులు గుర్తుకొస్తాయని చురకలంటించారు. విభజన హామీలతో పాటు ప్రాజెక్టులకు నిధులు తీసుకొచ్చి పనులు చేసే విషయంలో కేంద్రంపై ఎప్పటికప్పుడు ఒత్తిడి తెస్తున్నామని, ప్రాజెక్టుల విషయంలో తమకు చిత్తశుద్ధి ఉందని అన్నారు.

ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ప్రతిపక్ష పార్టీలకు బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు.  కార్యక్రమంలో మేయర్‌ మహమ్మద్‌ వసీం, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్‌రెడ్డి, మాజీ మేయర్‌ రాగే పరశురాం, మార్కెట్‌ యార్డు చైర్మన్‌ ఫయాజ్, జేసీఎస్‌ కన్వీనర్‌ లక్ష్మన్న, కార్పొరేటర్లు రామాంజినమ్మ, దేవి, బాబా ఫకృద్దీన్, కమల్‌ భూషణ్, కో ఆప్షన్‌ సభ్యుడు షంషుద్దీన్, వైయ‌స్ఆర్‌ సీపీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు సైఫుల్లా బేగ్, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, గృహసారథులు,  నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Back to Top