విశాఖపట్నం: రాష్ట్రంలో ఇప్పటికే విద్య, వైద్యం, వ్యవసాయం వంటి ప్రధాన రంగాల్లో ప్రైవేటీకరణ మంత్రం జపిస్తున్న చంద్రబాబు.. ఇప్పుడు పారిశ్రామీకరణకు మూల కేంద్రమైన ఏపీఐఐసీలోనూ అదే పంథాకు తెర లేపారని వైయస్ఆర్‌సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఆక్షేపించారు. రాష్ట్రంలో 22 ఎంఎస్‌ఎంఈ పార్కుల అభివృద్ధికి ఏపీఐఐసీని కాదని పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు పనులు అప్పగించడమే ఇందుకు నిదర్శమని ఆయన వెల్లడించారు. ఇలా అన్నీ ప్రైవేటుకు అప్పగిస్తే ఇక సీఎంగా చంద్రబాబు ఎందుకు? మంత్రివర్గం ఎందుకు? అని ప్రశ్నించారు. జగన్‌గారి హయాంలో అన్ని రంగాల్లో పురోగతి సాధించినా, విధ్వంసం అంటూ అదే పనిగా దుష్ప్రచారం చేస్తున్నారని, కూటమి ప్రభుత్వంలో ఏమీ లేకపోయినా, కొనసాగుతున్నది కేవలం చంద్రబాబు పబ్లిసిటీ మాత్రమే అని విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన గుడివాడ అమర్‌నాథ్ చురకలంటించారు. ప్రెస్‌మీట్‌లో గుడివాడ అమర్‌నాథ్ ఇంకా ఏం మాట్లాడారంటే..: అంతా ప్రైవేటుపరం! మరి ఎందుకీ ప్రభుత్వం?: చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలు చూస్తుంటే అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అన్న సందేహం కలుగుతోంది. అసలు చంద్రబాబు ప్రజల చేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రా? లేక కార్పోరేట్ శక్తుల చేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రా? అన్నదీ అర్ధం కావడం లేదు. రాష్ట్రంలో ప్రధాన రంగాలన్నింటినీ పూర్తిగా ప్రైవేటు పరం చేసే ప్రక్రియ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కొనసాగుతోంది. రైతులు మద్దతు ధరల్లేక, యూరియా లేక, ఇన్‌పుట్ సబ్సిడీలు లేక రోడ్డెక్కడమే ఇందుకు నిదర్శనం. ప్రైవేటు వాళ్లకు వత్తాసు పలుకుతూ ప్రభుత్వ విద్యాసంస్దల్ని నిర్వీర్యం చేశారు. వైద్యంలో ఆరోగ్యశ్రీని నీరుగార్చేసి మేం పెట్టిన మెడికల్ కాలేజీల్ని సైతం ప్రైవేటుపరం చేస్తున్నారు. ప్రజలకు కనీసం ఇవ్వాల్సిన వైద్యం, వైద్య విద్య కూడా ప్రైవేటు పరం చేస్తున్నారు. ఏపీఐఐసీని కాదని ప్రైవేటుకు ఎంస్‌ఎంఈ పార్కులు!: రాష్ట్రంలో అత్యంత బలమైన, ధనిక కార్పొరేషన్లలో ఒకటి రాష్ట్ర పారిశ్రామిక మౌలికసదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ). ఉమ్మడి ఏపీలో, రాష్ట్ర విభజన తర్వాత కూడా ఎన్నో పారిశ్రామిక పార్కుల్ని అభివృద్ధి చేసి, వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తుల్ని తీసుకొచ్చి, వారి ద్వారా ఉద్యోగావకాశాలు కల్పించి తద్వారా ఆదాయాన్ని సమకూరుస్తోంది ఆ సంస్థ. రాష్ట్రంలో 550కి పైగా పారిశ్రామిక పార్కుల్ని అభివృద్ది చేసిన ఘనత ఏపీఐఐసీకి ఉంది. ఆ మేరకు సంస్థ భూములు సేకరించి, అభివృద్ధి చేసింది. కాగా, మొదటిసారిగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా కాకుండా, పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తుల ద్వారా రాష్ట్రంలో 22 చోట్ల ఎంఎస్‌ఎంఈ పార్కుల్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇలా గతంలో ఎప్పుడూ జరగలేదు. భూమి కొనుగోలు చేసే ప్రక్రియలో ఇబ్బందులు ఉంటే పరిష్కరించుకోవచ్చు. భూముల సేకరణకు నిధులు లేకపోతే, ఏ విధానంలో అయినా సేకరించొచ్చు. కావాలంటే, రెవెన్యూ భూములను కూడా ఆ సంస్థకు బదలాయించవచ్చు. ఇలా ఇన్ని అవకాశాలు ఉన్నప్పటికీ, పారిశ్రామిక పార్కుల అభివృద్ధిని ప్రైవేటుకు అప్పగించాలన్న నీచమైన ఆలోచన ఎందుకు వచ్చింది?. దళితులు, వెనుకబడిన వర్గాల భూముల అప్పగింత: పీపీపీ కింద ఇస్తామని చెబుతున్న 22 ఎంఎస్‌ఎంఈ ఇండస్ట్రియల్ పార్కుల్లో అసైన్డ్ భూములు ఉన్నాయి. గతంలో అనేకమంది దళితులు, వెనుకబడిన వర్గాలకు ఇచ్చిన భూములు అవి. సహజంగా ఏపీఐఐసీ కేటాయించిన భూములు, వారు అభివృద్ధి చేసే ఇండస్ట్రియల్ పార్కుల్లో 22 శాతం ప్లాట్లు ఎస్సీ, ఎస్టీలకు కేటాయించాలనే నిబంధన ఉంది. ఇప్పుడు పీపీపీ కింద ఇస్తామంటున్న విధానంలో అవేవీ లేవు. అంటే ఆ విధంగా కూడా దళితులకు అన్యాయం చేస్తున్నారు. భూములు ప్రైవేటు వారి చేతుల్లో పెడతాం. అందులో వాళ్లు సినిమా హాళ్లు కట్టుకోవచ్చు. రెసిడెన్షియల్ హౌసింగ్ కట్టుకోవచ్చు. లేఅవుట్లు వేసుకోవచ్చు. షాపింగ్ మాల్స్ కట్టుకోవచ్చు అంటున్నారు. ఇది ఒక పెద్ద స్కామ్: ఏపీఐఐసీ అనేది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు అక్కడి వనరుల్ని వాడుకుని అభివృద్ది చెందాలనుకునేందుకు ఏర్పాటు చేసిన సంస్థ. కానీ ఇప్పుడు ఎంఎస్‌ఎంఈ పార్కుల అభివృద్ది పేరుతో పీపీపీ విధానంలో భూములు కేవలం రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పగించడానికి చేస్తున్న స్కాం ఇది. ఒక ఇండస్ట్రియల్ పార్కుకు 100 ఎకరాలు, 50 ఎకరాలు ఉదారంగా ఇస్తున్నారు. విశాఖపట్నంలో గోపాలపట్నం, ముదసరలోవ, అనకాపల్లి జిల్లాలో పరవాడ వంటి అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువ ఎకరం రూ.50 కోట్ల వరకూ ఉంది. అలాంటి చోట ప్రభుత్వ సంస్థ ప్రైవేటు వారికి, నచ్చిన పనులు చేసుకునేందుకు అప్పగించాలని నిర్ణయించడం దారుణం. ప్రభుత్వాన్నీ ప్రైవేటుకిచ్చేస్తారా బాబుగారూ?: విద్య, వైద్యం, పరిశ్రమలు, చివరికి రోడ్లు కూడా పీపీపీ అంటున్నారు. ప్రైవేటు వాళ్లు రోడ్లు వేసుకుని, డబ్బులు వసూలు చేసుకుంటారని చెప్తున్నారు. అలా అయితే ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎందుకు?. 24 మంది మంత్రులెందుకు?. ప్రజలు మీకు అధికారం ఇచ్చింది ఎందుకు?. ప్రజామోదంతో పరిపాలన చేస్తారని, ప్రజలకు అవకాశాలు కల్పిస్తారని, విద్య, వైద్యం గొప్ప లక్ష్యంతో ముందుకు తీసుకెళ్తారని, పారిశ్రామికాభివృద్ధి చేస్తారని ప్రజలు ఆశించారు. ఇవన్నీ ప్రైవేటు వాళ్ల చేతుల్లో పెడితే మీరు ఎందుకు?. రేపు పరిపాలన కూడా సింగపూర్‌లో మా ఈశ్వరన్ ఉన్నాడు. ఆయన చేతిలో పెడతాను అనేలా ఉన్నారు. ఏ ప్రభుత్వం నుంచి అయినా ప్రజలు కోరుకునేది, ఆశించేది మెరుగైన జీవనం. పిల్లలకు మెరుగైన విద్య. కష్టం వస్తే మెరుగైన వైద్యం. ఆపద వస్తే ప్రభుత్వం ఆదుకుంటుందని. కానీ వాటన్నింటినీ ఆడియాశలు చేసేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ లేకపోవడం వల్ల కాలేజీలకు నష్టం లేదు. పిల్లలు పరీక్షలు రాయలేక ఇబ్బంది పడుతున్నారు. దాదాపు ఐదు వేల కోట్ల పైచిలుకు ఫీజు రీయింబర్స్‌మెంట్, రూ.4500 కోట్లు ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టారు. కేవలం ప్రైవేటు వాళ్లు బాగుండాలనే వీటిని నీరు గారుస్తున్నారా?. అభివృద్ధి చేయడం విధ్వంసమా?: రాష్ట్రంలో 45 వేల స్కూళ్లు ఉంటే వాటిని బాగు చేసి పిల్లలకు నాణ్యమైన విద్య అందించడం, 3500 పైచిలుకు జబ్బుల్ని ఆరోగ్యశ్రీలో తీసుకొచ్చి, కుటుంబానికి రూ.25 లక్షల వ్యయం వరకు ఆరోగ్యశ్రీ కింద భరోసా కల్పించి పేద వాడికి ఆరోగ్య పరంగా కష్టం వస్తే భరోసా కల్పించడం విధ్వంసమా?. దేశవ్యాప్తంగా 11 ఇండస్ట్రియల్ కారిడార్లు ఉంటే అందులే 3 కారిడార్లు ఏపీలో ఉన్నాయంటే జగన్‌గారే కారణం. ఈ మూడు కారిడార్లలో అనేక పరిశ్రమల ఏర్పాటుకు దోహదపడి పారిశ్రామికంగా అభివృద్ధి చేసి ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ (ఈఓడీబీ)లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టడం జగన్ చేసిన తప్పా? మాకు ఇచ్చిన ఐదేళ్ల కాలంలో మచిలీపట్నం, మూలపేట, రామాయపట్నం పోర్టుల్ని, కాకినాడలో గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణం ప్రారంభించాం. బ్లూఎకానమీని సృష్టించి తద్వారా లక్షల మందికి ఉపాధి కల్పించాలని ఆలోచన చేసిన జగన్‌గారు విధ్వంసకారుడా?. పారిశ్రామికంగా, విద్య, వైద్యం, వ్యవసాయపరంగా ఎన్నో చేశారు. ప్రతీ గ్రామంలో రైతుభరోసా కేంద్రాలు తెచ్చారు. ఇవాళ యూరియా కోసం కొట్టుకు చచ్చే పరిస్ధితులు తెచ్చారు. వ్యవసాయాన్ని పండుగ వాతావరణంలోకి తెచ్చిన జగన్ విధ్వంసకారుడా? రుషికొండ జగన్ ఇల్లు అని, ఆయన సొంత భవనాలని, ప్రభుత్వ ని«ధులు దుబారా చేశారని తప్పుడు ప్రచారాలు చేశారు. కానీ ఇప్పుడు దేశంలో ఐకానిక్ సంస్థలు ఆ భవనాలు తీసుకునేందుకు ముందుకొస్తున్నాయి. 20 నెలలుగా రుషికొండ భవనాల్ని వాడుకోకుండా వదిలేశారు. ఇవాళ టాటా, లీలా గ్రూప్ వంటి సంస్థలు, దేశంలో గొప్ప హాస్పిటాలిటీ సంస్థలు ఈ భవనాల కోసం క్యూ కడుతున్నారు. రూ.200 కోట్లు పెట్టి కడితే అది విధ్వంసం! ఏడాదికి వచ్చే వరద నీరు తోడేందుకు రూ.450 కోట్లు ఖర్చు పెట్టి విజనరీ అని చెప్పుకుంటున్నారు. బ్రహ్మాండమైన టూరిజం భవనాలు కట్టిన జగన్ విధ్వంసకారుడా?. రాష్ట్రంలో ఏ సిటీ లేదు.. ఉన్నదల్లా చంద్రబాబు పబ్లిసిటీ: విశాఖ ఏఐ సిటీ, కర్నూలు డ్రోన్ సిటీ, అమరావతి క్వాంటం సిటీ, తిరుపతి ఫ్యూచర్ సిటీ, అనంతపురం డిఫెన్స్ సిటీ అన్నారు. 20 మాసాల్లో ఏదీ పూర్తి కాలేదు. చంద్రబాబు పబ్లిసిటీ మాత్రమే మిగిలింది. విశాఖ అభివృద్ధికి విజన్ డాక్యుమెంట్ ఇస్తే ఆ దారిలోనే ప్రభుత్వం ఇవాళ నడుస్తోంది. పేరుకు మాత్రం ఏవేవో సిటీలు అని చెప్పి ఏ ఊరుకెళ్తే ఆ సిటీలు అని పబ్లిసిటీ చేసుకుంటున్నారు. కొత్తగా విశాఖలో ఆవకాయ్ అమరావతి పేరుతో కొత్త పబ్లిసిటీ, మాగాయ మంగళగిరి, కాకరకాయ కుప్పం అని పబ్లిసిటీ చేసుకోవాల్సిందే. రోజుకు రూ.500 కోట్ల నుంచి రూ.600 కోట్ల అప్పు. 20 నెలల్లో దాదాపు రూ.2.80 లక్షల కోట్ల అప్పు. అటు ప్రజల దగ్గర డబ్బు లేదు. తెచ్చిన డబ్పుతో ఆస్తులు కల్పిస్తున్నారా? అంటే అదీ లేదు. తండ్రీ కొడుకుల మార్కెటింగ్, పబ్లిసిటీకే అంతా ఖర్చు చేస్తున్నారని గుడివాడ అమర్‌నాథ్ గుర్తు చేశారు. మీడియా ప్రశ్నలకు బదులిస్తూ.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ టెండర్లలో ఎవరూ బిడ్ వేయకపోవడం సంతోషకరం. అయినా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గక పోవడం, చంద్రబాబు నియంతృత్వ ధోరణి చూపుతోంది. అది రాష్ట్రానికి, ప్రజలకు మంచిది కాదు. సచివాలయాలకు స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు అనే పేరు మారుస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డదారులు, దొడ్డిదారులు తిరిగినా చివరికి ఏ పేరు పెట్టుకున్నా జగన్ బాటలోకే రావాల్సిన పరిస్ధితులు కనిపిస్తున్నాయి. ప్రజల మంచి కోసం మంచి విధానాలు తీసుకువచ్చిన పరిస్ధితి చంద్రబాబు ప్రభుత్వాల్లో ఎప్పుడూ లేదు. కార్పోరేట్ వ్యవస్థలకు ఎలా మేలు చేస్తాయో చూసుకుని పాలసీలు తయారు చేయడమే కనిపిస్తుంది. అందులో ప్రభుత్వ పెద్దల పాత్రతో పాటు ప్రైవేటు వ్యక్తుల పాత్ర కూడా ఉంటుంది. ప్రభుత్వ పెద్దల ఆర్దిక అవసరాలు, అవినీతి కోసమే ఈ పాలసీలు తీసుకురావడం కనిపిస్తుంటుంది. విశాఖలో కేటాయించిన భూముల విషయంలోనూ అదే పరిస్ధితి కనిపిస్తోంది. ప్రైవేటు వాళ్లను ముందుపెట్టి వెనుక ఉండేది వీళ్లే. విశాఖలో 56 ఎకరాలు కేటాయించిన ఉర్సా సంస్థకు నెల రోజులైన ఆఫీసు లేదు, ఉద్యోగులు లేరని గుడివాడ అమర్‌నాథ్ గుర్తు చేశారు.