వైయ‌స్ఆర్‌సీపీలోకి సినీన‌టుడు ఆలీ

 హైదరాబాద్‌ : సినీనటుడు అలీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సోమవారం ఉదయం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో లోటస్‌ పాండ్‌లో అలీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ కండువా కప్పి అలీని పార్టీలోకి ఆహ్వానించారు. షెడ్యూల్‌ విడుదలై ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వైఎస్సార్‌ సీపీలోకి ప్రముఖుల చేరికలు ఊపందుకున్నాయి. ఈ నెల 7వ తేదీన ప్రముఖ సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ టీడీపీకి గుడ్‌బై చెప్పి వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అంతకముందు కొంతమంది సినీ నటులు కూడా పార్టీలో చేరారు.

 వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని సీఎం చేయడమే తన లక్ష్యమని సినీనటుడు అలీ తెలిపారు. సోమవారం వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘1999లో ఓ పార్టీ తరఫున ప్రచారం చేశాను. మళ్లీ 2019లో ప్రచారం చేసి జగన్‌ సీఎం చేయాలనుకుంటున్నాను. ఆయన ఇచ్చిన మాటను తప్పరు. ప్రచారం చేసి మేజార్టీతో గెలిపించు. తర్వాత నేను చూసుకుంటానని భరోసా ఇచ్చారు. దివంగత మహానేత వైఎస్సార్‌ పాదయాత్రకు ఎంతటి ఆదరణ వచ్చిందో.. ఇప్పుడు జగన్‌ పాదయాత్ర తర్వాత కూడా అంతే ఆదరణ లభిస్తోంది. జగన్‌ సీఎం కావాలిన చాలా మంది కోరుకుంటున్నారు. గతంలో నేను ఆయనను కలవడం జరిగింది. అప్పుడు ఆయన నన్ను పార్టీలోకి ఆహ్వానించారు.

నేను సమయం కావాలన్నాను. ఎప్పుడైనా రావచ్చన్నారు. ఈ రోజు ఆయన సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నాను. ప్రస్తుతం పోటీ చేయదల్చుకోలేదు.. ప్రచారం మాత్రం చేస్తాను. పాదయాత్ర సమయంలో వైఎస్‌ జగన్‌ అభ్యర్థులకు కమిట్‌ అయ్యారు. ప్రస్తుతం ప్రచారం మాత్రమే చేయమన్నారు.. తర్వాత ఏం చేయాలో చేస్తానని జగన్‌ హామీ ఇచ్చారు. రాజమండ్రి, విజయవాడల్లో అవకాశమిస్తే మాత్రం పోటీ చేస్తాను. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లను కేవలం నూతన సంవత్సర విషెస్‌ చెప్పడానికే కలిసాను. టీడీపీలో వైఎస్‌ జగన్‌ ఇచ్చిన భరోసా లభించలేదు. అందుకే వచ్చేశాను. పవన్‌ కల్యాణ్‌ నా స్నేహితుడు. స్నేహానికి రాజకీయాలకు సంబంధం లేదు. జగన్‌ కావాలి.. జగన్‌ రావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. కావున తాను వైఎస్సార్‌సీపీలోకి రావడం జరిగింది.’ అని అలీ స్పష్టం చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top