నేటి సాయం.. సీఎంకు రైతులపై ఉన్న ప్రేమకు నిదర్శనం

కరోనా కష్టకాలంలో 'రైతు భరోసా' అమలు చరిత్రలో నిలిచిపోతుంది

కౌలు రైతు పెట్టుబడిసాయం అందుకునేందుకు నెలరోజుల గడువు

30వ తేదీన రైతు భరోసా కేంద్రాలను సీఎం ప్రారంభిస్తారు

వ్యవసాయ రంగ స్వరూపాన్నే మార్చే దిశగా ముందుకెళ్తున్నాం

త్వరలోనే మండల, జిల్లాస్థాయిల్లో వ్యవసాయ సలహా మండళ్లు

వాస్తవ విరుద్ధంగా చంద్రబాబు జూమ్‌ సభలు నిర్వహిస్తున్నాడు

రుణమాఫీ అమలు చేయలేనందుకు రైతులకు బాబు క్షమాపణ చెప్పాలి

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు

తాడేపల్లి: రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పనిచేస్తున్నారని, కష్టకాలంలో సాయం అందించడం రైతు పట్ల సీఎం వైయస్‌ జగన్‌కు ఉన్న ప్రేమకు, బాధ్యతకు నిదర్శనమని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. కరోనా వల్ల ఇబ్బందులు ఉన్నా.. సీజన్‌ వచ్చే సరికి రైతుకు పెట్టుబడి సాయం అందించాలనే ఉద్దేశంతో రూ.2,800 కోట్లను రైతుల అకౌంట్లలో వేయడం జరిగిందని, ఇదొక చరిత్రగా నిలిచిపోతుందన్నారు. ముఖ్యమంత్రిగా వైయస్‌ జగన్‌ ప్రమాణస్వీకారం చేసి మే 30 నాటికి సంవత్సరం అవుతుంది. ఈ రోజున రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించనున్నామన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆవరణలో మంత్రి కురసాల కన్నబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు.
మంత్రి కన్నబాబు ఏం మాట్లాడారంటే..
సీసీఆర్‌సీ కార్డులు 11 నెలల వ్యవధికి చట్టం చేసి కౌలు రైతుకు కార్డులు ఇచ్చాం. ఇప్పుడు మళ్లీ 11 నెలల గడువు పూర్తవుతుంది కాబట్టి కౌలు రైతులు ఈ పథకంలో లబ్ధిపొందకుండా ఇబ్బంది పడకుండా ఉండేందుకు వచ్చే నెల రోజుల పాటు అర్హత ఉన్న కౌలు రైతులను ఈ పథకం కింద తీసుకోనున్నాం.

ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ కింద ఎండోమెంట్‌ భూములను సాగుచేసే వారికి కూడా రైతు భరోసా పెట్టుబడి సాయం అందిస్తున్నాం. గత నెల ఏప్రిల్‌లో రూ.2 వేలు అందించాం. మళ్లీ ఈ రోజు రూ.5,500 ఇచ్చాం. కౌలు రైతులు పీఎం కిసాన్‌ యోజనలో లబ్ధిపొందరు కాబట్టి వారికి రూ. 7,500 అకౌంట్‌లో జమ చేశాం.

రైతు సంక్షేమం అంటే గుర్తుకు వచ్చే నాయకుడు సీఎం వైయస్‌ జగన్‌. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం పనిచేస్తున్నారు. పెట్టుబడి సాయం అందించే విషయంలో రైతులకు ఆలస్యం జరగకూడదు. కరోనా వల్ల ఇబ్బందులు ఉన్నా.. సీజన్‌ వచ్చే సరికి రైతుకు పెట్టుబడి సాయం అందించాలనే ఉద్దేశంతో రూ.2,800 కోట్లను రైతు అకౌంట్లలో వేశాం. ఇదొక చరిత్రగా నిలిచిపోతుంది.

ఏ పంట అయినా సరే ఇంటర్వీన్‌ కావాల్సిందేనని మార్కెటింగ్‌కు సంబంధించి సీఎం వైయస్‌ జగన్‌ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు కాకుండా మొక్కజొన్న ఇతర పంటకు సంబంధించి 1,052 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం.

లాక్‌డౌన్‌ ప్రారంభమైన నాటి నుంచి రూ.1000 కోట్లు విలువైన ఉత్పత్తులను మార్కెటింగ్‌ శాఖ ద్వారా ప్రొక్యూర్‌మెంట్‌ చేశాం. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.1500 కోట్ల వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేశాం. మొక్కజొన్న మొదలుకొని పసుపు వరకు.. టమాటాలు మొదలుకొని గుమ్మడికాయల వరకు విక్రయించాం.

2 లక్షల టన్నులపైగా రూ.355 కోట్ల విలువైన మొక్కజొన్న కొనుగోలు చేశాం. రూ.135 కోట్ల విలువైన 53 వేల టన్నుల జొన్న పంటను కొనుగోలు చేశాం. అదే విధంగా బెంగాల్‌ గ్రామ్‌ 1లక్షా 38 వేల టన్నులను రూ.678 కోట్లతో కొనుగోలు చేశాం. కందులు 50 వేల టన్నులు దాదాపు రూ.292 కోట్లు, పసుపు 4500 టన్నులు దాదాపు రూ.29 కోట్లు, అంతేకాకుండా ఉల్లి 773 టన్నులు, అరటి 12 వేల టన్నులు, టమటా వరకు అన్ని కొనుగోలు చేశాం.

రైతు భరోసా పథకం ప్రారంభం అనంతరం సీఎం వైయస్‌ జగన్‌ వ్యవసాయ శాఖపై సీఎం సమీక్ష జరిపారు. బత్తాయి కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఆదేశించారు. అనంతపురం, కడప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున బత్తాయి వస్తుంది.. ధర ఎట్టిపరిస్థితుల్లో పడిపోవడానికి వీల్లేదు కొనుగోలు చేయాలని, వేగవంతంగా ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. బత్తాయి నిన్న 180 టన్నులు కొంటే.. ఈ రోజు 280 టన్నులు కొనుగోలు చేశాం. రేపటి నుంచి రోజుకు 500 టన్నుల బత్తాయి మార్కెటింగ్‌ శాఖ ద్వారా కొనుగోలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం.

వైయస్‌ఆర్‌ రైతు భరోసా పథకాన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామో.. అదే విధంగా రైతు భరోసా కేంద్రాలను ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రారంభించబోతున్నారు. రాష్ట్రంలో వ్యవసాయరంగం స్వరూపాన్ని మార్చే గొప్ప విధానం రైతు భరోసా కేంద్రం కాబోతుంది.

దాదాపు 10,641 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు కాబోతున్నాయి. రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు విక్రయించడమే కాకుండా.. నాలెడ్జ్‌ సెంటర్లుగా పనిచేస్తాయి.. రైతుకు సంపూర్ణ విజ్ఞానాన్ని అందిస్తాయి.. కొనుగోలు సెంటర్లుగా పనిచేస్తాయి.. ఒక సమగ్రమైన వ్యవసాయ కేంద్రాలుగా రైతు భరోసా కేంద్రాలు అవతరించబోతున్నాయి.

ముఖ్యమంత్రిగా వైయస్‌ జగన్‌ ప్రమాణస్వీకారం చేసి మే 30 నాటికి సంవత్సరం అవుతుంది. ఈ రోజున రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించనున్నాం. రైతు సంక్షేమానికి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అర్థం చేసుకోవాలి.

వైయస్‌ఆర్‌ ఉచిత పంట బీమా పథకాన్ని అమలు చేస్తున్నాం. పూర్తిగా పంట ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తోంది. గత ప్రభుత్వం పెట్టిన ఇన్‌పుట్‌ సబ్సిడీ బకాయిలను కూడా ఈ ప్రభుత్వం చెల్లించింది. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే శనగ రైతులు నష్టపోకుండా క్వింటాల్‌కు రూ.1500 చొప్పున ధరల స్థిరీకరణ నిధి నుంచి రూ.330 కోట్లు రైతులకు అందించాం.

త్వరలోనే మండల, జిల్లా స్థాయిల్లో అగ్రికల్చర్‌ అడ్వయిజరీ బోర్డులను ఏర్పాటు చేయబోతున్నాం. ఏ పంట ఎంత విస్తీర్ణంలో వేయాలి.. ఏ పంటకు ఎంత డిమాండ్‌ ఉంది.. ఇతరత్ర సలహాలు, సూచనలు కూడా ఈ అడ్వయిజరీ బోర్డులు అందిస్తాయి. సమగ్రమైన బోర్డులుగా రూపుదిద్దుతాం. నిపుణులు, రైతులు, రైతు ప్రతినిధులు దీంట్లో భాగస్వామ్యం అయ్యేలా సిద్ధం చేస్తున్నాం.

రైతు భాగస్వామ్యంతో ఈ రాష్ట్రంలో వ్యవసాయ ప్రణాళికలు రూపుదిద్దుకోవాలని సీఎం చెప్పారు. అందుకు ఈ అడ్వయిజరీ బోర్డులు పనిచేస్తాయి.

9 గంటల పాటు పగటిపూట ఉచిత విద్యుత్‌ అందిస్తామని సీఎం వైయస్‌ జగన్‌ చెప్పిన విధంగా దాదాపు 82 శాతం ఫీడర్లు సిద్ధం అయ్యాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 1700 కోట్లు ఇందుకు కేటాయించారు. మరో 18 శాతం ఫీడర్లు త్వరలోనే సిద్ధం అవుతాయి. ఈ మాటను ఏడాది తిరిగేలోపే సీఎం నిలబెట్టుకున్నారు.

వాస్తవాలు ఈ రకంగా ఉంటే చంద్రబాబు జూమ్‌ సభలు పెట్టి రకరకాలుగా మాట్లాడుతున్నాడు. పార్టీపరంగా వారు ఏం మాట్లాడుకున్నా మాకు అభ్యంతరం లేదు.. కానీ, కట్టుకథలు ప్రచారం చేసే కార్యక్రమాలు చేయొద్దు. వ్యవసాయ కోసం ఎన్ని కోట్లు అయినా ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం.. ఎంత ప్రయాస అయినా భరిస్తామని సీఎం ముందుకెళ్తుంటే.. రైతులను గాలికి వదిలేసినట్లుగా చంద్రబాబు ప్రచారం చేయడం దుర్బుద్ధిని ప్రతిబింబిస్తుంది.

ఇచ్చిన రుణమాఫీ హామీని కూడా అమలు చేయకుండా.. బాండ్లు, పత్రాలు అని ఇచ్చి రుణమాఫీ చేసినట్లు చంద్రబాబు సెల్ఫ్‌ సర్టిఫికేట్‌ ఇచ్చుకున్నాడు. చంద్రబాబుకు ప్రజలు మంచి గుణపాఠాన్ని చెప్పారు. అయినా తప్పు చేశామనే పశ్చాతాపం లేకుండా.. రైతులకు క్షమాపణలు చెప్పకుండా.. ఇప్పుడేదో జరిగిపోతున్నట్లుగా ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.

రుణమాఫీ హామీని అమలు చేయలేకపోయినందుకు రైతులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశాన్ని అమలు చేయడానికి సీఎం వైయస్‌ జగన్‌ తపన పడుతున్నారు. కరోనా కష్టకాలంలో రైతులకు పెట్టుబడిసాయం అందించిన విధానాన్ని చూసి అయినా చంద్రబాబు నేర్చుకోవాలి. 

Back to Top