కోడుమూరు: కోడుమూరు నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని తొలగించిన ఘటనపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోడుమూరు నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ ఇన్‌చార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన కోడుమూరు పోలీస్ స్టేషన్‌ను సందర్శించి ఎస్సైకి ఫిర్యాదు అందజేశారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత వైయస్ఆర్ విగ్రహాన్ని తొలగించడం బాధాకరమని, ఈ ఘటన వెనుక ఉన్న వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. డాక్టర్ ఆదిమూలపు సతీష్ మాట్లాడుతూ, ప్రజా నాయకుల విగ్రహాల పట్ల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఇలాంటి ఘటనలు ప్రజల మనోభావాలను దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. విగ్రహం తొలగింపుపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. మహానేత వైయస్ఆర్ సేవలను ప్రజలు ఎప్పటికీ మరవలేరని, ఆయన పేరును చెరిపివేయాలనే ప్రయత్నాలు ఎప్పటికీ ఫలించవని అన్నారు. కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఘటనపై తమ నిరసనను వ్యక్తం చేశారు.