ఈవీఎంపై చంద్రబాబు పూటకో మాట

వైయస్‌ఆర్‌సీపీ నేత దాడి వీరభద్రరావు

చంద్రబాబు తన హోదా మరచిపోయి ప్రవర్తిస్తున్నారు

చంద్రబాబు తన ఓటమిని ఎవరి మీదా నెట్టాలా అని చూస్తున్నారు

 డేటా ఎవరికి అమ్మేయాలని దొంగిలించారు

చంద్రబాబు అధికార దుర్వినియోగం చేశారనేందుకు ఇదే నిదర్శనం

ఈసీని అప్రతిష్టపాలు చేయడం వల్ల చంద్రబాబుకు ఒరిగేదేమీ లేదు

విశాఖ: ఓటమి భయంతో చంద్రబాబు పూటకో మాట మాట్లాడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు విమర్శించారు. ఈసీని అప్రతిష్టపాలు చేయడం వల్ల చంద్రబాబుకు ఒరిగేదేమీ లేదని, ఈసీపై రోజుకో రకంగా విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ప్రజాస్వామ్య దేశంలో వ్యవస్థలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ ఇద్దరూ కలిసి ప్రజలకు సంబంధించి వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించారని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండు చేశారు. సోమవారం విశాఖలో పార్టీ నేతలు బాబురావు, మాధవి తదితరులతో కలిసి దాడి వీరభద్రరావు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు తన హోదాను మరిచి ప్రవర్తిస్తున్నారు. గెలుపు, ఓటమిలు సమానంగా తీసుకోవాలి. కానీ ఏదో రకంగా ..ఎవరిపైనో బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు తన ఓటమిని ఎవరిపైన నెట్టాలా అని చూస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు కూడా ఏదో  ఒక రకంగా మీడియాలో వస్తూ తానే ఈ నలభై రోజులు ముఖ్యమంత్రిని అని చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వైయస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారం చేసే రోజునే ..చంద్రబాబు కూడా అనధికారికంగా ఏదో  ఒక పదవికి ప్రమాణ స్వీకారం చేసి తానే ముఖ్యమంత్రి అంటూ సెల్ఫ్‌ డిక్లరేషన్‌ తీసుకుంటారని అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబు పూర్తిగా విలువలు వదిలేసి..రాజకీయాల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. 
ఐటీ గ్రీడ్స్‌ ద్వారా డేటాను దొంగించిన చంద్రబాబు తన పార్టీ యాప్‌కు సమాచారం  ఇచ్చారు. దీన్ని పోలీసులు విచారణ జరిపించి ..వాటన్నింటిని వెలుగులోకి తీసుకురావాలి. ఏపీ, తెలంగాణకు సంబంధించిన ఆధార్‌ డేటానే కాకుండా ఇతర రాష్ట్రాల ఆధార్‌ డేటాను అమెజాన్‌ కంపెనీకి ఇచ్చి స్టోర్‌ చేశారు. దేశ ప్రజలకు సంబంధించిన 18 రకాల వ్యక్తిగత సమాచారాన్ని అంతర్జాతీయ నేరగాళ్ల చేతుల్లో పెట్టడం దేశద్రోహ నేరం అవుతుంది. గ్రీడ్‌ హార్డ్‌ డిస్క్, డిజిటల్‌ ఎవిడెన్స్‌పై శాస్తీ్రయంగా నిర్ధారణ చేశారు. సుమారు 8 కోట్ల మంది సమాచారం దొంగతనమైంది. ఇది సాధారణమైన నేరం కాదు..ఇది దేశద్రోహమే. కేంద్ర పరిధిలోని అంశాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాడుకొని టీడీపీ నేతలు దొంగతనం చేశారు. ఈ ఘటనపై విచారణ జరపాలి. 
చంద్రబాబుకు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేశారు. తన కొడుకు ఐటీ మంత్రి నారా లోకేష్, చంద్రబాబు ఇద్దరూ కలిసి దేశద్రోహం నేరానికి పాల్పడ్డారు. ప్రజల వ్యక్తిగత సమాచారం ఎందుకు దొంగిలించారో సమాధానం చెప్పాలి. నన్ను అరెస్టు చేయకుండా ప్రజలంతా రక్షణగా నిలవాలని చంద్రబాబు అంటున్నారంటే ఆయన నేరం చేశారని ఒప్పుకున్నట్లే అన్నారు. 
మొదట రాష్ట్రంలో 4 వేల ఈవీఎంలు పాడైపోయాయని చంద్రబాబు  అన్నారు. ఆ తరువాత 30 శాతం ఈవీఎంలు అన్నారు.. మళ్లీ రెండు రోజులకు 618 ఈవీఎంలు అంటున్నారు. ఈ ఈవీఎంలను రీపోలింగ్‌ చేయాలంటున్నారు. ఆ తరువాత ఢిల్లీ వెళ్లి 50 శాతం వీవీ ప్యాడ్స్‌ లెక్కించాలని అన్నారు. దాని కోసం యుద్ధం చేస్తామని ప్రకటనలు చేశారు. ఈవీఎం, వీవీ ప్యాట్‌లో ఉన్న పేపర్లు థర్మల్‌ పేపర్‌ అని, కనిపించిన తరువాత మళ్లీ మాయం అవుతుందని చంద్రబాబు అంటున్నారు. అలాంటప్పుడు లెక్కపెట్టమని చంద్రబాబు ఎలా అడుగుతారు. తాను వేసిన ఓటు టీడీపీకి పడిందో లేదో అని చంద్రబాబు అనడం సిగ్గుచేటు. పోలింగ్‌ బూత్‌లో అప్పుడే ఎందుకు ధర్నా చేయలేదు. మళ్లీ ఓటు వేస్తానని ఎందుకు అడగలేదు. ఏవైతే అబద్ధాలు ఆడతారో అర్థం కావడం లేదు. ఇవాళ అంటున్నారు. రూ.5 వేల కోట్లు ఇస్తే అందులోని చిప్‌ మార్చి మిమ్మల్ని గెలిపిస్తామని చంద్రబాబు వద్దకు వచ్చారట. ఈవీఎం దొంగలు కూడా మీ వ ద్దే ఉన్నారు. ఎన్నైనా మర్చే సమర్ధులైన మీరు ఎందుకు ఆ పని చేయలేదు. ముఖ్యమంత్రి స్థాయి ఇలాంటి వ్యాఖ్యలు చేయవచ్చా?. 2014 కంటే ఓటింగ్‌ శాతం పెరిగింది. రాజ్యాంగ సంస్థలను చంద్రబాబు అప్రతిష్టపాలు చేయడం తగదు. 2014లో ఇదే ఈవీఎంలు వాడి చంద్రబాబు గెలవలేదా? 2018లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ రెండు రాష్ట్రాల్లో ఓడిపోయింది.  బీజేపీ అనుకుంటే ఆ రాష్ట్రాల్లో గెలిచేది కదా? చంద్రబాబు ఇలాంటి ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉంది. వ్యవస్థలను తప్పుపట్టడం చంద్రబాబుకు మంచి పద్ధతి కాదు.
 

Back to Top