పరారీలో ఎందుకున్నావ్‌ ప్రవక్తా?: విజయసాయి రెడ్డి 

నన్నెవరూ టచ్‌ చేయలేరని..పరారీలో ఎందుకు?

 

 హైదరాబాద్‌ : టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ అజ్ఞాతంలోకి వెళ్లడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీవీ9లో వాటాల వ్యవహారంలో సొంత లబ్ధి కోసం నకిలీ పత్రాలు సృష్టించడంతోపాటు కంపెనీ సెక్రటరీ సంతకం ఫోర్జరీ అభియోగాలతో రవిప్రకాశ్‌తో పాటు సినీనటుడు శివాజీపై కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. 

ఈ సందర్భంగా స్పందించిన విజయసాయి రెడ్డి... ‘మెరుగైన సమాజ  ఉద్యమకారుడు శుక్రవారం మధ్యహ్యం 3గంటల నుంచి ఫోన్ స్విచ్ఛ్ ఆఫ్ చేశాడట. సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు గాలిస్తున్నారు. అమరావతి వెళ్తే ఈ నెల 23వ తేదీ తర్వాత దొరికే ప్రమాదం ఉండటంతో కర్ణాటక మీదుగా ముంబాయి చేరినట్టు సమాచారం. నన్నెవరూ టచ్ చేయలేరని బీరాలు పలికి పరారీలో ఎందుకున్నావు ప్రవక్తా?’ అంటూ ట్వీట్‌ చేశారు.

కాగా రవిప్రకాశ్‌తో పాటు సినీనటుడు శివాజీ ఆదివారం తమ ఎదుట హాజరు కావాలంటూ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు రెండోసారి నోటీసులు జారీ చేశారు. అయితే వాళ్లిద్దరూ ఇప్పటివరకూ సైబర్‌ క్రైమ్‌ పోలీసుల విచారణకు హాజరు కాలేదు. రవిప్రకాశ్‌ ఫోన్‌ నిన్న మధ్యాహ్నం నుంచి స్విచ్ఛాఫ్‌ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయనతో పాటు శివాజీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Back to Top