‘థాంక్యూ సీఎం సార్‌’ 

కొత్త జిల్లాలపై హర్షాతిరేకాలు
 
రాష్ట్రవ్యాప్తంగా ప్రజల సంబరాలు 

నియోజకవర్గాల్లో బైక్‌ ర్యాలీలు, పాదయాత్రలు, ప్రజా చైతన్య యాత్రలు 

సీఎం వైయ‌స్ జగన్‌ చిత్రపటాలకు పూలాభిషేకాలు, క్షీరాభిషేకాలు 

‘థాంక్యూ సీఎం సార్‌’ అంటూ మిన్నంటిన నినాదాలు 

జిల్లాలకు ప్రముఖుల పేర్లు పెట్టడంపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు

అమ‌రావ‌తి: పరిపాలన సౌలభ్యం.. ప్రజలకు సత్వరమే సేవలు అందించడం.. అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలను పునర్వ్యవస్థీకరించి.. 26 జిల్లాలను ఏర్పాటు చేయడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. చారిత్రక నేపథ్యాన్ని.. ప్రజల మనోభావాలను.. స్థానిక పరిస్థితులను అధ్యయనం చేసి.. అన్ని వర్గాలు మెచ్చేలా కొత్త జిల్లాలను ప్రకటించారని ప్రజాసంఘాల నేతలు, మేధావులు, ప్రజలు ప్రశంసిస్తున్నారు. దశాబ్దాలుగా తాము కలలుగంటున్న జిల్లా సాకారమవడంతో అన్ని వర్గాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చిత్రపటాలకు పూలాభిషేకాలు, క్షీరాభిషేకాలు చేశారు. కోనసీమలో వినూత్నంగా కొబ్బరి నీళ్లతో అభిషేకం నిర్వహించారు.

రాష్ట్రవ్యాప్తంగా వైయ‌స్సార్‌సీపీ శ్రేణులు, ప్రజలు బైక్‌ ర్యాలీలు, పాదయాత్రలు, ప్రజా చైతన్యయాత్రలు చేపట్టి సంతోషంతో కేరింతలు కొట్టారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పేరుతో జిల్లాను ఏర్పాటు చేసినందుకు విశాఖ జిల్లాలో ప్రజా సంఘాల నేతలు, సామాజిక కార్యకర్తలు, గిరిజన ప్రాంతాల ప్రజలు సీఎం జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేశారు. పార్వతీపురం కేంద్రంగా మన్యం జిల్లాను ప్రకటించినందుకు సీఎం వైయ‌స్‌ జగన్‌కు ధన్యవాదాలు తెలుపుతూ విజయనగరం జిల్లా పార్వతీపురం, సాలూరు, కురుపాం నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు నిర్వహించారు. థాంక్యూ సీఎం సార్‌ అంటూ నినదించారు. ర్యాలీల్లో ఎమ్మెల్యేలు పీడిక రాజన్నదొర, అలజంగి జోగారావు పాల్గొన్నారు.  
 
గుంటూరు జిల్లాలో కొవ్వొత్తుల ర్యాలీ 
కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తూ గుంటూరు జిల్లాలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భారీ ర్యాలీలు నిర్వహించారు. గుంటూరు నగరంలో వైయ‌స్సార్‌సీపీ శ్రేణులు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టాయి. వివిధ నియోజకవర్గాల్లోనూ ర్యాలీలు జరిగాయి. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు మద్దాళి గిరిధర్, బొల్లా బ్రహ్మనాయుడు, అంబటి రాంబాబు, కిలారు వెంకట రోశయ్య, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అన్నాబత్తుని శివకుమార్, మేయర్‌ కావటి మనోహర నాయుడు, తదితరులు పాల్గొన్నారు. ఇక కర్నూలు జిల్లావ్యాప్తంగా ‘థాంక్యూ సీఎం’ నినాదాలు మిన్నంటాయి. వైయ‌స్సార్‌ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. కేక్‌ కట్‌ చేసి ప్రజలకు పంచిపెట్టారు.

ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కాటసాని రామిరెడ్డి, సుధాకర్, ఎమ్మెల్సీలు చల్లా భగీరథరెడ్డి, ఇసాక్‌ బాషా, మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ పీపీ నాగిరెడ్డి పాల్గొన్నారు. కృష్ణా జిల్లాలో కొత్తగా ఏర్పాటు కానున్న విజయవాడ జిల్లాకు దివంగత సీఎం ఎన్టీఆర్‌ పేరును ఖరారు చేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ బైక్‌ ర్యాలీలు చేపట్టారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు జోగి రమేష్, రక్షణనిధి, కొలుసు పార్థసారధి, కైలే అనిల్‌ కుమార్, కమ్మ కార్పొరేషన్‌ చైర్మన్‌ తుమ్మల చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళంలో ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో కృతజ్ఞతా ర్యాలీని నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలో పలు నియోజకవర్గాల్లో జరిగిన ర్యాలీల్లో ఎమ్మెల్యేలు గొర్లె కిరణ్‌కుమార్, రెడ్డి శాంతి, జెడ్పీ చైర్‌పర్సన్‌ పిరియా విజయ, తదితరులు పాల్గొన్నారు.  
 
ఉభయగోదావరి జిల్లాల్లో పాదయాత్రలు, ప్రజాచైతన్య యాత్రలు 
అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లాను ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం, కత్తిపూడిల్లో సీఎం చిత్రపటాలకు కొబ్బరి నీళ్లతో అభిషేకం చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, పర్వత పూర్ణచంద్ర ప్రసాద్‌ పాల్గొన్నారు. పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అయినవిల్లి విఘ్నేశ్వరుడి ఆలయం నుంచి ముక్తేశ్వరం వరకు పాదయాత్ర చేశారు. రంగంపేటలో ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి ప్రజా చైతన్యయాత్ర నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రంగా భీమవరాన్ని నిర్ణయించడంతో పట్టణంలో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు భారీ బైక్‌ ర్యాలీ చేపట్టారు. బాణసంచా కాల్చుతూ, రంగులు చల్లుకుంటూ, నృత్యాలు చేశారు. భీమవరం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అభినందన సదస్సు నిర్వహించారు. తణుకులో ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో భారీ పాదయాత్ర చేపట్టారు. ఆయా కార్యక్రమాల్లో క్షత్రియ కార్పొరేషన్‌ చైర్మన్‌ పాతపాటి సర్రాజు, తదితరులు పాల్గొన్నారు.  
 
ప్రకాశం జిల్లాలో మానవహారాలు 
కొత్త జిల్లాల ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేస్తూ ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. జిల్లా కేంద్రం ఒంగోలులో నగర మేయర్‌ గంగాడ సుజాత, తదితరుల ఆధ్వర్యంలో మానవహారం చేపట్టారు. కడపలో డిప్యూటీ మేయర్‌ నిత్యానందరెడ్డి, వేర్‌హౌస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కరీముల్లా ఆధ్వర్యంలో వైయ‌స్సార్‌ విగ్రహానికి, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పులివెందులలో మున్సిపల్‌ చైర్మన్‌ వరప్రసాద్‌ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. అనంతపురం జిల్లాలో ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తికి దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌కి రుణపడి ఉంటామని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి తెలిపారు. జిల్లావ్యాప్తంగా ప్రజలు కొత్త జిల్లాల ఏర్పాటు పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు కాపు రామచంద్రారెడ్డి, సిద్ధారెడ్డి, అనంతపురం మేయర్‌ మహమ్మద్‌ వసీం తదితరులు పాల్గొన్నారు.  
 
సీఎం వైయ‌స్‌ జగన్‌కు క్షత్రియ సేవా సంఘం కృతజ్ఞతలు  
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరును పాడేరు జిల్లాకు పెట్టిన సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సౌత్‌ ఇండియా ఫెడరేషన్‌ ఆఫ్‌ క్షత్రియ సేవా సంఘం కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు సంఘం చైర్మన్‌ చెరుకూరి వెంకటపతిరాజు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. క్షత్రియుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారని సీఎంను కొనియాడారు. అంతేకాకుండా క్షత్రియ మహిళలకు వైయ‌స్సార్‌ ఈబీసీ నేస్తం పథకాన్ని వర్తింపజేశారని ప్రశంసించారు. అల్లూరి సీతారామరాజు పేరుతో జిల్లాను ఏర్పాటు చేసి క్షత్రియుల చిరకాల కోరిక నెరవేర్చారని అభినందించారు. 

తాజా ఫోటోలు

Back to Top