తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ హయాంలో నాటి ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరుద్యోగులకు సచివాలయాల ద్వారా ఇచ్చిన వరం వారికి మరిన్ని ఫలాలను అందిస్తోంది. ఎనర్జీ అసిస్టెంట్ల సేవలను విద్యుత్ శాఖ పనులకే పరిమితం చేయాలని సంబంధిత శాఖలను ప్రభుత్వం మంగళవారం ఆదేశించింది. అలాగే.. జూనియర్ లైన్‌మెన్ (జేఎల్‌ఎం) గ్రేడ్–2 కేడర్‌లో ఉన్న ఎనర్జీ అసిస్టెంట్లను జూనియర్ లైన్‌మెన్ (జేఎల్‌ఎం)లుగా గుర్తిస్తున్నట్టు ఏపీ ట్రాన్స్‌కో మంగళవారం ప్రకటించింది. దీంతో వీరు నేరుగా జేఎల్‌ఎంలుగా మారుతున్నారు. ఫలితంగా ప్రస్తుతం నెలకు వస్తున్న రూ.22,460 జీతం త్వరలో రూ.30,800కు చేరుతోంది. దీనికి ఇతర ప్రోత్సాహకాలు కలిపి దాదాపు రూ.10 వేల వరకూ జీతం పెరుగుతోంది. ఎనర్జీ అసిస్టెంట్లను విద్యుత్ శాఖకు సంబంధం లేని పనులకు వినియోగించకూడదని అన్ని జిల్లాల కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు, ఉప కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు ఇతర అధికారులకు ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.