తాడేపల్లి: రైతుల కష్టాలు, బాధలు కనిపించనీయకుండా, దీనిమీద చర్చజరగకుండా వాటికి ముసుగు వేసి చంద్రబాబు చేస్తున్న డైవర్షన్ పబ్లిసిటీ స్టంటే.. “రైతన్నా.. మీకోసం’’ అంటూ వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఈ 18 నెలల కాలంలో రైతులకోసం ఎప్పుడు నిలబడ్డారు?ఎక్కడ నిలబడ్డారని ఆయన సూటిగా ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ తీరును ఎండగడుతూ వైయస్ జగన్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ఎక్స్ వేదికగా వైయస్ జగన్.. చంద్రబాబు గారూ… రికార్డు స్థాయిలో పంటల ధరలు దారుణంగా పతనమైనా మీరు రైతులవైపు కన్నెత్తిచూడ్డంలేదు. మీ కారణంగా నెలకొన్న దారుణమైన పరిస్థితులను తట్టుకోలేక, ప్రభుత్వం నుంచి ఏమాత్రం ఆసరాలేక రైతులు తాము వేసిన పంటలను తామే ట్రాక్టర్లతో దున్నివేసే పరిస్థితులు తీసుకు వచ్చారు. చంద్రబాబుగారూ.. ఇలా మీ దుర్మార్గ పాలనతో రైతుల ఒంటిమీద ఉన్న చొక్కానుకూడా తీసివేసి వారిని రోడ్డుమీద నిలబెట్టి, ఇప్పుడు మళ్లీ వారి కాలర్ ఎగరేసుకునేలా చేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతూ వారికి ఎండమావులు చూపిస్తారా? రైతుల కష్టాలు, బాధలు కనిపించనీయకుండా, దీనిమీద చర్చజరగకుండా వాటికి ముసుగు వేసి మీరు చేస్తున్న డైవర్షన్ పబ్లిసిటీ స్టంటే.. “రైతన్నా.. మీకోసం’’. అసలు ఈ 18 నెలల కాలంలో రైతులకోసం మీరు ఎప్పుడు నిలబడ్డారు?ఎక్కడ నిలబడ్డారు? ఈ సంక్షోభానికి రైతులే కారణమన్నట్టుగా వారి మెదళ్లపై దాడిచేయడానికే మీరు ఎంచుకున్న ఎత్తుగడ కాదా ఇది. •మూడు విమానాలు, ఆరు హెలికాప్టర్లు, విదేశీ పర్యటనలు, వీకెండ్ హైదరాబాద్ యాత్రలతో మీ దుబారాలకు, రాజకీయ కక్షలతో తప్పుడు కేసులు నడపడానికి మీరు ఎంచుకున్న మీ లాయర్లకు, మీ పబ్లిసిటీ పిచ్చికి, మీకు డప్పుకొట్టే మీ ఎల్లోమీడియా మీ తొట్టి గ్యాంగ్‌కి, ఇలా వీరందరికీ కోట్లాదిరూపాయలు తగలేస్తున్నారు కాని, రైతులను ఆదుకోవడానికి మాత్రం మీకు మనసు రాదా? • వ్యవసాయరంగాన్ని ఉద్ధరిస్తున్నామన్నట్టుగా 10వేలమందితో టెలికాన్ఫరెన్స్ పెట్టామని గొప్పగా మీ మీడియాలో రాయించుకుంటున్నారు. కాని, అదే నోటితో 10 మంది కలెక్టర్లకు ఫోన్ చేసి వారికి నిధులు కేటాయించి రైతులకు మంచి రేట్లు వచ్చేలా చేయమని ఎందుకు చెప్పలేకపోయారు? •ధరలు పతనమై, దీన స్థితిలో ఉన్న రైతన్నను ఆదుకుంటూ ధరల స్థిరీకరణకు వెంటనే డబ్బులు మంజూరుచేసి, రైతుల్ని ఆదుకునే చర్యలను ఎందుకు చేపట్టడంలేదు? • ఇప్పుడు కూడా ధాన్యం, మొక్కజొన్న, అరటి, కొబ్బరి, పత్తి ధరలు దారుణంగా పడిపోయినా, మీరు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ధాన్యం, కందులు, మినుములు, పెసలు, సజ్జలు, మిర్చి, పొగాకు, ఉల్లి, టమోటా, కోకో, చీనీ, మామిడి ధరలు పడిపోయినా మీకు పట్టనట్టే వ్యవహరించారు. • ఈ 18 నెలల కాలంలో దాదాపు 16 సార్లు ప్రకృతి విపత్తుల వల్ల రైతులు నష్టపోతే కనీసం ఒక్కసారైనా ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకున్నారా? రైతులకు ఏ కష్టం వచ్చినా, ఒక ముఖ్యమంత్రిగా మీరు స్పందించి ఆదుకున్న సందర్భం ఏమీ లేదు. •రైతులు, వారి తరఫున మేం పోరాటాలు చేస్తే, దాన్ని డైవర్ట్ చేయడానికి ఎదురుదాడి చేస్తారు. రైతుల పరామర్శకు వెళ్తే అన్యాయంగా కేసులు పెడతారు. రైతులను ఆదుకోవడానికి హడావిడి ప్రకటనలు చేస్తారు. తీరా ఆచరణలో చూస్తే, ఏమీ చేయరు, ఏమీ ఉండదు. మిర్చి, పొగాకు, మామిడి, ఉల్లి పంటల విషయంలో మీరు చేసింది ఇదే. •మీ దుర్మార్గ పాలనతో, మా ప్రభుత్వ హయాంలో రైతులకు కల్పించిన భద్రత, భరోసా, గ్యారంటీలను పూర్తిగా తొలగించడమో నిర్వీర్యం చేయడమో చేశారు. •ఉచిత పంటల బీమాను రద్దుచేశారు, తుపాను సహా ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన, బీమా పరిధిలో లేని లక్షల మంది రైతులకు ఏంచేస్తారో చెప్పడంలేదు. పోనీ వారికి ఇన్సూరెన్స్ లేకపోయినా మీరే పంట నష్టరిహారం ఎప్పుడు చెల్లిస్తారో మాటమాత్రమైనా చెప్పలేకపోతున్నారు. •రైతులకు ఇవ్వాల్సిన రూ.600 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ బకాయిలు ఎప్పుడిస్తారు? పోనీ నిన్నటి తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పడంలేదు. •ఎన్నికల్లో రైతులకు అరచేతిలో వైకుంఠం చూపించారు. పీఎం కిసాన్‌కాకుండా ఏడాదికి రూ.2౦వేలు అన్నదాతా సుఖీభవ కింద ఇస్తామన్నారు. ఈ 2 ఏళ్లకు రూ.40వేలకు గాను ఇచ్చింది కేవలం రూ.10వేలు. •ఆర్బీకేలు, ఇ-క్రాప్, CMAPP, పొలంవద్దే పంట కొనుగోలు ఇలా అన్నీ నిర్వీర్యం. చివరకు ఎరువులకోసం కూడా రైతులు బ్లాక్‌లో కొనుగోలు చేసుకునే దుస్థితికి తీసుకువచ్చారు. రైతుల బ్బతుకులు దళారీల పాలు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మీ మోసాలను, మీ వంచనను ప్రశ్నిస్తూ, మీ నిర్లక్ష్యాన్ని కడిగేస్తూ మీ కాలర్, మీ పార్టీ వాళ్ల కాలర్ పట్టుకునేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని మరిచిపోవద్దు చంద్రబాబుగారూ.