మ‌న‌సున్న ముఖ్య‌మంత్రి

ఇంటర్‌ విద్యార్థికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆపన్నహస్తం
 

వైయ‌స్ఆర్ జిల్లా:   ఇడుపులపాయలోని ట్రిపుల్‌ఐటీలో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఎస్‌.కృష్ణప్రసాద్‌నాయక్‌కు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆపన్నహస్తం అందించారు. అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన రైతు విజయ్‌కుమార్‌నాయక్, సుభద్రాబాయి దంపతుల కుమారుడు ఎస్‌.కృష్ణప్రసాద్‌నాయక్‌ బోన్‌క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ఇటీవల ఇడుపులపాయకు వచ్చిన ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆ విద్యార్థి కలిసి తన పరిస్థితిని వివరించారు. మెరుగైన వైద్యం కోసం సాయం చేయాలని అర్థించారు.

స్పందించిన ముఖ్యమంత్రి వెంటనే తగిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ సి.హరికిరణ్‌ను ఆదేశించారు. విద్యార్థికి మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ముఖ్యమంత్రి రిలీఫ్‌ ఫండ్‌ నుంచి ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి (సీఎంఆర్‌ఎఫ్‌ అండ్‌ పబ్లిక్‌ గ్రీవెన్సెస్‌) డాక్టర్‌ హరికృష్ణకు జిల్లా కలెక్టర్‌ పంపిన నివేదికకు ఆమోదం దక్కింది. త్వరలో సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద నిధులు మంజూరుకానున్నాయి. ఈ సందర్భంగా బాధిత విద్యార్థి మాట్లాడుతూ.. తనకు మెరుగైన వైద్యం అందించేందుకు సహకరించిన సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

Back to Top