ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం? 

ముందు ఒప్పుకొని.. ఆపై మాట మార్చడం తగదు

 భవిష్యత్తులో ఉద్యోగ, ఉపాధ్యాయులకు వీలైనంత మేలు చేసేందుకు ప్రయత్నిస్తానని సీఎం వైయ‌స్‌ జగన్‌ చెప్పినా కూడా నిరసనలా?

రాష్ట్ర ప్రజల గురించి కూడా ఆలోచించి మసలుకోవాలి

 అమరావతి : పీఆర్సీ విషయంలో మంత్రుల కమిటీతో అన్ని ఉద్యోగ సంఘాలతో పాటు పలు టీచర్ల సంఘాలు కూడా చర్చల్లో పాల్గొని, ఆయా అంశాల్లో ఆమోదం తెలిపాక.. బయటకొచ్చి మాటమార్చడం సరికాదని పలు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు హితవుపలికాయి. భవిష్యత్తులో ఉద్యోగ, ఉపాధ్యాయులకు వీలైనంత మేలు చేసేందుకు ప్రయత్నిస్తానని సీఎం వైయ‌స్‌ జగన్‌ చెప్పినా కూడా నిరసనల పేరుతో కొందరు ఉద్యోగ, ఉపాధ్యాయులను రెచ్చ గొట్టడం ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసమంటూ ప్రశ్నిస్తున్నాయి. ఈ మేరకు సోమవారం ప్రకటనలు విడుదల చేశాయి.  

కొందరు టీచర్ల తీరు చూసి సమాజం సిగ్గుతో తలదించుకుంటోంది.. 
పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో చర్చలు జరిగి డిమాండ్లకు ప్రభుత్వం ఒప్పుకొన్నాక కూడా మళ్లీ ధర్నాలు, నిరసనలకు దిగడం, జేఏసీ నాయకులను దుర్భాషలాడడం ఎంతవరకు సమంజసమని ఆంధ్రప్రదేశ్‌ యూనివర్సిటీస్‌ నాన్‌ టీచింగ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు వై.వెంకటప్పారెడ్డి ప్రశ్నించారు. పది మందికి చదువులు చెప్పే ఉపాధ్యాయుల తీరు చూసి సమాజం సిగ్గుతో తలదించుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు.

కరోనా కారణంగా నెలల తరబడి పాఠశాలలను తెరవకున్నా, రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ సకాలంలో వేతనాలు అందేలా సీఎం వైయ‌స్‌ జగన్‌ ప్రత్యేక చొరవ తీసుకున్నారని గుర్తుచేశారు. నాయకులమని చెప్పుకొనే వారు రాష్ట్ర ప్రజల గురించి కూడా ఆలోచించి మసలుకోవాలని హితవుపలికారు.

పీఆర్సీపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు పేర్కొన్న అభ్యంతరాలు, సమస్యల్లో చాలా వాటిని సీఎం పరిష్కరింపజేసి మేలు చేశారని,  యూనివర్సిటీల్లో ఉన్న బోధనేతర సిబ్బందికి హెచ్‌ఆర్‌ఏను 8 శాతం నుంచి 16 శాతం వరకూ పెంచారని గుర్తు చేశారు. గతంలో ఉద్యోగులు అడగకున్నా ఐఆర్‌ను 20 శాతం నుంచి 27 శాతానికి పెంచిన విషయాన్ని ప్రస్తావించారు. ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా అడిగినవన్నీ దాదాపుగా ఒప్పుకున్నందున సీఎం వైఎస్‌ జగన్‌కు వెంకటప్పారెడ్డి ధన్యవాదాలు తెలిపారు.   

మంత్రుల కమిటీతో సుదీర్ఘ చర్చల అనంతరం హెచ్‌ఆర్‌ఏ రేట్ల పెంపుతో పాటు, ఐఆర్‌ రికవరీ నిలుపుదల, ఐదేళ్ల కోసారి పీఆర్సీ, పెన్షనర్లకు అదనపు క్వాంటమ్‌ పెన్షన్‌ వంటి విషయాల్లో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుందని వైయ‌స్సార్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కె.జాలిరెడ్డి తెలిపారు. ఆర్థిక పరిస్థితి కారణంగా ఫిట్‌మెంట్‌ 23 శాతం కంటే ఎక్కువ ఇవ్వలేకపోయామని స్వయంగా సీఎం చెప్పారని, కానీ కొన్ని సంఘాలు చర్చల సమయంలో అన్నింటికీ ఒప్పుకుని, బయటకొచ్చి వ్వతిరేకిస్తున్నామనడం ఎంతవరకు సమంజసమో ఆలోచించాలన్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతకంటే చేయలేమని, అర్థం చేసుకోవాలని సీఎం కోరాక కూడా నిరసనలకు పిలుపునిచ్చారంటే ఎవరివో రాజకీయ ప్రయోజనాలు ఆశించే ఇలా చేస్తున్నారన్న అనుమానం కలుగుతోందన్నారు. భవిష్యత్తులో ఉద్యోగ, ఉపాధ్యాయులకు వీలైనంత మేలు చేసేందుకు ప్రయత్నిస్తానని సీఎం చెప్పినందున నిరసనల విషయంలో పునరాలోచించాలని జాలిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

అందరితో సమానంగా పీఆర్సీ వర్తింపు చరిత్రాత్మకం  
ఇదిలా ఉండగా ఏపీ మోడల్‌ స్కూల్స్‌ సొసైటీతో పాటు ఇతర గురుకులాల సొసైటీల్లో పనిచేస్తున్న టీచర్లకూ ఇతర ప్రభుత్వ యాజమాన్య స్కూళ్ల టీచర్లతో పాటు ఏకకాలంలో 11వ పీఆర్సీని వర్తింపజేయడం సంతోషకరమని మోడల్‌ స్కూల్స్‌ ప్రోగ్రెసివ్‌ టీచర్స్‌ అసోషియేషన్‌ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. దీనిపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అసోసియేషన్‌ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు కోమటిరెడ్డి శివశంకరరెడ్డి, ప్రధాన కార్యదర్శి గడపర్తి చంద్రశేఖర్‌లు కృతజ్ఞతలు తెలిపారు.

ఇంతకముందు అందరికీ వర్తింపజేసినా ఒకటి లేదా రెండేళ్లకు గానీ సొసైటీ టీచర్లకు పీఆర్సీ అమలుచేసేవారు కాదని, ఇప్పుడు నేరుగా వర్తింపజేయడం చరిత్రాత్మకమని వారు కొనియాడారు. మిగతా టీచర్లతో పాటు మోడల్‌ స్కూళ్ల టీచర్లకూ మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌కు అవకాశం కల్పిస్తూ ఈ పీఆర్సీ జీవోలోనే పొందుపరచాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Back to Top