తాడేపల్లి: పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు.. మరోసారి చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుని అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 27న వైయస్ఆర్ జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రచార భేరి మోగించనున్నారు. మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నివాళులు అర్పించి.. ఎన్నికల సంగ్రామానికి ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు దాదాపు 21 రోజులపాటు బస్సు యాత్ర కొనసాగనుంది. ఇక, పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి సిద్ధం సభలు నిర్వహించిన నాలుగు జిల్లాలు (విశాఖపట్నం, ఏలూరు, అనంతపురం, బాపట్ల) మినహా మిగతా జిల్లాల్లో బస్సు యాత్ర జరగనుంది. ప్రతి రోజూ ఒక పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బస్సు యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రలో ఉదయం పూట వివిధ వర్గాలు, రంగాల ప్రజలతో సీఎం వైయస్ జగన్ సమావేశమవుతారు. ప్రభుత్వ పనితీరును మరింతగా మెరుగు పర్చుకోవడానికి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. కొందరు పార్టీ కార్యకర్తలను, అభిమానులను కూడా కలుస్తారు. సాయంత్రం పార్లమెంట్ నియోజకవర్గంలో బహిరంగ సభ ఉంటుంది. మరో 48 గంటలే.. కాగా, వైయస్ఆర్‌సీపీ బస్సుయాత్ర మరో 48 గంటల్లో ప్రారంభం కానుంది. ఈనెల 27న ఇడుపులపాయలో కార్యక్రమం ప్రారంభించిన తర్వాత వీరపునాయునిపల్లె, ఎర్రగుంట్ల మీదుగా సీఎం జగన్ ప్రొద్దుటూరుకు చేరుకోనున్నారు. ఎర్రగుంట్ల రోడ్డులోని అయ్యప్పస్వామి ఆలయం వద్ద సీఎం జగన్ విడిది చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు శ్రీకన్యకాపరమేశ్వరి సర్కిల్, సినీ హబ్, ఆర్టీసీ బస్టాండ్, శివాలయం వీధి, రాజీవ్ సర్కిల్, కొర్రపాడు రోడ్డు మీదుగా బస్సు యాత్ర జరగనుంది. ఐదు గంటలకు పొట్టిపాడు రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగించనున్నారు. ఇందు కోసం సభ నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు కడప పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు హాజరుకానున్నారు. ఫుల్ జోష్‌లో పార్టీ శ్రేణులు బస్సు యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు సీఎం వైయస్ జగన్ పూర్తిగా ప్రజలతో మమేకం కానున్నారు. యాత్రలోనే ఎక్కడికక్కడ విడిది చేయనున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశామని చెబుతూ.. ప్రతి ఇంటికీ మేలు చేశామని వివరించనున్నారు. గత 58 నెలల్లో డీబీటీ రూపంలో 2.70 లక్షల కోట్లు, నాన్ డీబీటీ రూపంలో రూ.1.79 లక్షల కోట్లు వెరసి రూ.4.49 లక్షల కోట్ల ప్రయోజనాన్ని 87 శాతం కుటుంబాలకు చేకూర్చారు. విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణల ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపారు. గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ, జిల్లాల పునర్ వ్యవస్థీకరణ ద్వారా గుమ్మం వద్దకే ప్రజలకు ప్రభుత్వ సేవలను అందిస్తున్నారు. చేసిన మంచిని ప్రతి ఇంటా వివరించి.. ఆశీర్వాదం తీసుకోవడానికి చేపట్టిన ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గత 58 నెలల పాలనలో వచ్చిన విప్లవాత్మక మార్పులు ప్రతి నియోజవకర్గం, ప్రతి గ్రామం, ప్రతి ఇంటా కనిపిస్తున్నప్పుడు 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించడం సుసాధ్యమేనని సీఎం వైయస్ జగన్.. శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ భీమిలి, దెందులూరు, రాప్తాడు, మేదరమెట్లలో నిర్వహించిన సిద్ధం సభలకు సముద్రంతో పోటీ పడుతూ జనం హాజరయ్యారు. రాప్తాడు, మేదరమెట్ల సభలు రాష్ట్ర చరిత్రలో అతి పెద్ద ప్రజా సభలుగా నిలిచాయి. ఎన్నికలకు ముందే వైయస్ఆర్‌సీపీప్రభంజనం ‘సిద్ధం’ సభల్లో కళ్లకు కట్టినట్లు కన్పించడంతో పార్టీ శ్రేణులు కదనోత్సాహంతో కదం తొక్కుతున్నాయి. క్లీన్ స్వీపే లక్ష్యంగా అడుగులు టీడీపీ–జనసేన–బీజేపీ శ్రేణులు నైతిక స్థైర్యం కోల్పోయి కకావికలమైతే.. వైయస్ఆర్‌సీపీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. ఈ దశలో సీఎం జగన్ బస్సు యాత్ర వారిలో మరింత ఉత్సాహాన్ని నింపనుంది. క్లీన్ స్వీప్ లక్ష్యంగా ముఖ్యమంత్రి అడుగులు ముందుకు వేస్తున్నారు. వైయస్ఆర్‌సీపీ శ్రేణులను ‘మేం సిద్ధం.. మా బూత్ సిద్ధం.. ఎన్నికల సమరానికి మేమంతా సిద్ధం’ పేరుతో గ్రామ స్థాయి నుంచి మరింత పటిష్టంగా ఎన్నికలకు సన్నద్ధం చేసేలా సీఎం వైయస్ జగన్ దిశా నిర్దేశం చేస్తారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 18న విడుదల కానున్న నేపథ్యంలో, ఆలోగా తొలి దశ ప్రచారంగా బస్సు యాత్ర పూర్తి చేయాలని నిర్ణయించారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డాక మలి విడత ప్రచారాన్ని చేపట్టనున్నారు.