యువతకు అండగా జననేత

విద్యార్థులు, నిరుద్యోగుల భవిష్యత్తు బాగుండాలని ప్రతిపక్ష నేత వైయస్ జగన్ పోరాడుతుంటే...చంద్రబాబు మాత్రం అసలు విద్యావ్యవస్థనే నిర్వీర్యం చేేసే పనిలో ఉన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకానికి తూట్లు పొడిచి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడడమే గాకుండా ఉన్న సర్కారీ స్కూళ్లను మూసివేసే దిశగా పయనిస్తున్నాడు. బాబు వస్తే జాబు వస్తుందని నమ్మబలికి నిరుద్యోగులను నిండా మోసం చేశాడు. చంద్రబాబు చేతిలో మోసపోయిన యువతకు భరోసా కల్పిస్తూ..వారి జీవితాల్లో వెలుగులు నింపే ప్రత్యేకహోదా సాధన కోసం వైయస్ జగన్ అలుపెరగకుండా పోరాడుతున్నారు. యువభేరి సదస్సుల ద్వారా వారిని చైతన్య పరుస్తున్నారు. అధికారంలోకి వచ్చాక నవరత్నాలు పథకాలతో వారికి బంగారు భవిష్యత్తు ఇవ్వబోతున్నారు. కానీ, ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా యువత జీవితాలను చంద్రబాబు నాశనం చేస్తున్నాడు. 

చదువులను సంతలో సరుకులను చేసిన ఘనుడు చంద్రబాబు. పేదవాడి నోటి కూడే కాదు, కాస్త జ్ఞానం కూడా అందకుండా పోతోందంటే అందుకు కారణం చంద్రబాబే. ప్రభుత్వ పాఠశాలలను రకరకాల కారణాలు చెబుతూ మూతబెడుతున్నాడు బాబు. విద్యాశాఖ సైతం చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతోంది. నిర్బంధప్రాధమిక విద్య, ఉన్నత చదువులకు అవకాశం కల్పించి విద్యార్థులను ప్రోత్సహించాల్సిన ప్రభుత్వమే వారి భవిష్యత్తును నిర్దాక్షిణ్యంగా కాలరాస్తోంది. ఒక పక్క ఉపాధ్యాయ నియామకాలు చేయకుండా, మరోపక్క కాంట్రాక్టు ఉద్యోగులను ఊడపీకుతూ ప్రభుత్వ విద్యారంగాన్ని భ్రష్టు పట్టిస్తోంది. వీలైనంతగా ప్రభుత్వ విద్యాసంస్థలను నాశనం చేయడమే చంద్రబాబు లక్ష్యంగా కనిపిస్తోంది. ఇది ముమ్మాటికీ తెలుగు విద్యార్థులకు చంద్రబాబు చేస్తున్న ద్రోహం. ఇంతకీ బాబు ఇంత బరితెగింపు పనులు ఎందుకు చేస్తున్నట్టు. రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళతానంటూ లెక్చర్లిచ్చే ఈ నియంత పిల్లలను చదువుల ఒడి నుంచి ఎందుకు దూరం చేస్తున్నట్టు….? సూక్ష్మంగా ఆలోచిస్తే విషయం బోధపడుతుంది. కొందరు బడాబాబుల కార్పొరేట్ విద్యాసంస్థలను పెంచి పోషించడానికి, ప్రభుత్వరంగాన్ని మట్టిలో కప్పెడుతున్నాడన్న సంగతి అర్థం అవుతుంది. రాష్ట్రంలో ఇంగ్లీషు విద్యను ప్రవేశపెట్టిందే నేనని, అందరికీ ఆంగ్లం నేనే నేర్పించానని సిగ్గులేకుండా చెప్పుకునే చంద్రబాబు విద్యార్థుల జీవితాలతో చెలగాటమే ఆడుతున్నాడు. 

నారాయణా విద్యాసంస్థల ఛైర్మన్, రాష్ట్ర మంత్రి వర్గంలో కీలక శాఖకు అధిపతి అయిన నారాయణకు సాధ్యమైనంత సాయం చేయడానికి చంద్రబాబు ఈ కుట్రలు పన్నుతున్నాడని విద్యా శాఖ నిపుణులు అంటున్నారు. హాజరీ తక్కువ ఉందని, ఉపాధ్యయుల కొరత ఉందని, విద్యార్థుల పర్సంటేజి లేదని రకరకాల సాకులతో ప్రభుత్వ పాఠశాలలను మూయిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. కాసుల కక్కుర్తిలో చిన్నారుల భవితనూ నాశనం చేస్తోంది. ప్రైవేటు స్కూళ్లు తప్ప ప్రభుత్వ పాఠశాలల్లో చదివే అవకాశం లేకుండా చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తోంది. అందుకు కారణం ప్రైవేటు విద్యాసంస్థలకు లబ్ది చేకూర్చడమే అని తేటతెల్లం అవుతోంది. రాష్ట్రంలో శ్రీచైతన్య-నారాయణ విద్యాసంస్థలు వటవృక్షాల్లే వేళ్లూనుకున్నాయి. ఈ రెండు సంస్థలూ లేని రెవెన్యూ డివిజనే ఉండదు. విద్యను వ్యాపారంగా మార్చి, విద్యార్థులను ఖైదీల్లా చూసే విష సంస్కృతిని పెంచి పోషిస్తోంది నారాయాణా విద్యాసంస్థ. ఇప్పటికే ఆ సంస్థల్లో చదువుకునే విద్యార్థులు ఒత్తిడిని భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు కోకొల్లలు. దీనిపై ప్రభుత్వం కాని, చంద్రబాబు కాని, చివరికి ఆ సంస్థల ఛైర్మన్, బాధ్యతగల పదవిలో ఉన్న మంత్రి నారాయణకానీ కనీసం స్పందించకపోవడం దారుణం. 

చదువును కార్పొరేట్ పరం చేసి విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తోంది చంద్రబాబు సర్కార్. రాష్ట్రంలో మొత్తం 2052మున్సిపల్ స్కూళ్లు ఉన్నాయి. అందులో 1366 ప్రైమరీ స్కూళ్లు, 393 అప్పర్ ప్రైమరీ, 293హైస్కూళ్లు ఉన్నాయి. దాదాపుగా నాలుగు లక్షలమంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. వీరిలో నిరుపేదలు, కూలినాలి చేసుకునే కుటుంబాల నుంచి వచ్చేవారే ఎక్కువ. ఇక కళాశాలల విషయానికొస్తే ప్రభుత్వ, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, ఒకేషనల్ ఇంకా గురుకుల, వికలాంగ, సంక్షేమ, రైల్వే, సహకార, ఒకేషనల్, కళాశాలలన్నీ కలిపి 4611 ఉన్నాయి. వీటిల్లోనూ లక్షలాదిమంది పేద విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ స్కూళ్లు, కాలేజీల శాతాన్ని పెంచి, సౌకర్యాలను అందిస్తే ప్రైవేటు విద్యా సంస్థలకు తీసిపోని విధంగా ప్రతిభాపాటవాలు వెలికివస్తాయి. నిజానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల్లో, విధానాల్లో విద్యకు అధిక ప్రాధాన్యం ఉండాలి. విద్యారంగాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను ప్రభుత్వం ఒక దీక్షలా చేపట్టాలి. విద్య, వైద్య రంగాలను ప్రభుత్వం ఎంతో బాధ్యతాయుతంగా నిర్వర్తించాలి. ప్రభుత్వ బోధనాశాలలు పెంచాలి. విద్యార్థుల శాతాన్ని పెంచడానికి కృషి చేయాలి. కాని ఉన్నవాటిని మూసేసి ప్రైవేటు సంస్థలకు గుత్తాధిపత్యాన్ని కట్టబెట్టడమే చంద్రబాబు విద్యా విధానం. వైయస్ రాజశేఖర్ రెడ్డి ఫీజు రీయంబర్స్ మెంట్ విధానంతో విద్యార్థుల ప్రగతికి బాటలు వేసారు. ఆర్థిక కారణాలతో ఏ విద్యార్థి చదువుకు దూరం కాకూడదని ఆశించారు. ఆయన వారసుడిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి తండ్రి బాటలోనే యువతకు, విద్యార్థులకు అండగా నిలుస్తున్నారు. విలువను ఊడ్చిపెట్టి, విద్యను వ్యాపారంగా మార్చడాన్ని వ్యతిరేకిస్తున్నారు. విద్యారంగం పట్ల, విద్యార్థుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఖండిస్తూ విద్యార్థులకు తన మద్దతు తెలుపుతున్నారు. యువభేరి వేదికగా విద్యార్థుల సమస్యలను, ఆకాంక్షలను తెలుసుకోవడానికి బయలు దేరారు ప్రతిపక్షనేత. నవరత్నాల్లో నవ్యాంధ్ర యువతకు మేలు చేసే వజ్రాల వంటి పథకాలున్నాయని మరోసారి తెలియజెప్పబోతున్నారు. జగనన్న తోడుగా, రాజన్న ఆశయాల సాధనకు విద్యార్థిలోకం అంతా కదిలి రానుంది. విద్యావ్యవస్థలో మార్పుల ప్రభంజనానినికి నాంది కానుంది.  

తాజా ఫోటోలు

Back to Top