వర్షాకాలం.. రావు గారిల్లూ!!

రెండు రోజులయిపోయింది... ఇంతవరకూ ఒక్క పనవ్వలేదు... 
పిల్లలు కాళ్ళకు అడ్డం పడుతున్నారు..
ఎంతసేపని సముదాయించేది..
అడుగు తీసి అడుగేయాలంటే కష్టమైపోతోంది..
ఒకటే హైరానా..
చుట్టాలొచ్చేస్తారు.. ఇల్లిలా ఉంటే ఎలా..
ఎందుకొచ్చాంరా బాబూ అనుకుంటే ఎంత అప్రతిష్ఠ...
అనుకుంటూ తనలో తను మధనపడిపోతున్నాడు
సంప్రదాయాల్రావు...

రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాన్ని తిట్టుకుంటుండగానే 
ఏం బావా! ఏంటదోలా ఉన్నావ్ అంటూ వినపడిన స్వరంతో ఉలిక్కిపడ్డాడు.
ఆ.... ఆ.... అని సర్దుకుంటూ ఏంలేదోయ్... రా.. రా...
ఏంటి పొద్దున్నే ఊడిపడ్డావ్  అంటూ ప్రశ్నించాడు వచ్చిన అతగాడిని..
ఏం లేదోయ్! వర్షాకాలం కదూ ఓ ఐదు రోజులు ఉండి పనులు చక్కబెట్టుకుని వద్దామని.. బదులిచ్చాడతడు.
సర్లే..  బ్రీఫ్ కేసు ఎక్కడ పెట్టమంటావ్.. అని అడిగాడు.. అదిగో ఆ గదిలో పెట్టుకోమని చెప్పాడు.
సరేనని వెళ్ళిన అతగాడు ఒక్క అరుపు అరుస్తూ బయటకొచ్చేశాడు...
ఏమైందన్న రావు ప్రశ్నకు సమాధానంగా ఓ చెంబు దూసుకొచ్చింది..
విషయం అర్థమైంది.. వీడిక్కడున్నాడా.. పొద్దున్నించి వెతుకుతున్నా
మా చంటాడు.. స్నానం చేద్దువు రా అని పిలిచా.. అప్పటినుంచి కనిపించడంలేదు..
నీ ధర్మమా అని బయటపడ్డాడు.. 

సర్లే.. వీళ్ళతో నువ్వు పడలేవు కానీ.. ఆ ఆ పెట్టిలా ఇవ్వు.. నేనే లోపల పెడతా.. 
గదిలోకెళ్ళిన రావుకు నేల తడిగా... జిగురుజిగురుగా తగిలింది.. జార బోయి తమాయించుకున్నాడు..
తేరిపార చూసేసరికి కింద తెల్లగా కనిపించింది.. ఆ పక్కనే పెద్దాడు బ్రష్ పుచ్చుకుని ఫెవికాల్ డబ్బాలో బ్రష్ ముంచి నేలకు పెయింటేస్తున్నాడు. 
ఒరేయ్.. ఏమిట్రా అది. నీ మొహం మండా.. ఫెవికాల్ రాసేస్తున్నావ్..
బయటకెలా వస్తావురా అని నిలేశాడు..
ఎలాగా... అసెంబ్లీలోంచి ఎమ్మెల్యేలు వాకౌట్ చేసినట్లు ఠక్కున సమాధానమిచ్చాడు వాడు..
వాణ్ణక్కణ్ణ్నుంచి తరిమేసి అంతా తుడిచి బ్రీఫ్ కేస్ లోపలపెట్టి బయటకొచ్చాడు రావు...
కనిపించింన దృశ్యం చూసి.. స్టన్నయిపోయాడు..
పిల్లలంతా బావ చుట్టూ చేరి అతగాణ్ణి కదలనీయకుండా ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్టాడేస్తున్నారు..
చిన్నాడు స్టూలెక్కి.. కాలరు పుచ్చుకుని లాగుతున్నాడు...
మధ్యలో వాడు పంట్లాం కుడి వైపు సగం మడతపెట్టేశాడు..
ఇంకోడు బెల్టు పీకేశాడు..
వీళ్ళకి తోడుగా వచ్చిన పక్కింటి పిల్లాడు.. పూతిక చీపురు పుల్లలు తెచ్చి బావ చెవిలో తిప్పుతున్నాడు..
పిల్లల్ని ఏమనలేక.. అష్టవంకర్లు తిరుగుతూ మహా ఇబ్బంది పడిపోతున్నాడు..
ఆ అలికిడి వినేసరికి పిల్లలు పారిపోయారు. 
ఎలా వేగుతున్నావురా బాబూ! వీళ్ళతో... ఇంకొంచెం సేపై ఉంటే ప్యాంటు ఊడబీకేసి, చీపురు పిల్లలు పెట్టి అడవి మనిషిలా తయారుచేసుండేవాళ్ళు.. అని నిట్టూర్చాడు బావ..
ఏం చెయ్యమంటావు చెప్పు.. మా ఇంటికంటే అసెంబ్లీ నయం.. ఇష్టం లేకపోతే బయటకి పోతారు వాళ్ళు...
వీళ్ళలా వెళ్ళరే... అని దిగాలుగా చెప్పాడు రావు.
ఈ కురిసే వర్షం అసెంబ్లీ దగ్గర పడినా  కాస్తోకూస్తో చర్చలు పూర్తయి... సమస్యలైనా తీరేవి అనుకుంటూ బావని లోపలికి వెంటబెట్టుకెళ్ళాడు రావు..
Back to Top