‘సమైక్య శంఖారావా'నికి వెల్లువెత్తుతున్న మద్దతు

సమైక్యాంధ్ర ఆకాంక్ష ఢిల్లీకి తాకేలా శ్రీ జగన్మోహన్‌రెడ్డి నిర్వహించనున్న సమైక్య శంఖారావం సభకు రాష్ట్రం నలు మూలల నుంచీ మద్దతు వెల్లువెత్తోంది. పార్టీ నాయకులు, శ్రేణులే కాకుండా వైయస్‌ అభిమానులు, సమైక్యాంధ్రను కోరుకుంటున్న ప్రతి ఒక్కరూ, ఉద్యోగ, కార్మిక, కర్షక, ప్రజా సంఘాల వారు ఈ సభకు తరలి వచ్చేందుకు, జయప్రదం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. అడ్డగోలు రాష్ట్ర విభజనపై జనాగ్రహం వ్యక్తంచేయడానికి సిద్ధమవుతున్నారు.

హైదరాబాద్ :

రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలనే డిమాండ్‌తో ఈ నెల 26న వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ నిర్వహించనున్న ‘సమైక్య శంఖారావం’ సభకు అన్ని వర్గాల నుంచీ మద్దతు ‌వెల్లువెత్తుతోంది. సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం మొదలు.. రాష్ట్ర వ్యాప్తంగా పలు ఉద్యోగ, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఉద్యోగులు, కార్మికులు, ఉపాధ్యాయులు, ప్రజలు భారీగా పాల్గొని సభను విజయవంతం చేయాలని ఆయా సంఘాలు పిలుపునిచ్చాయి.

‘సమైక్యాంధ్ర కోసం ఏ పార్టీ కార్యక్రమం నిర్వహించినా మద్దతిస్తామని మేం ముందే చెప్పాం. వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ సమైక్యాంధ్ర‌ కోసం ఈ నెల 26న హైదరాబాద్ ఎ‌ల్‌బీ స్టేడియంలో సమైక్య శంఖారావం సభ నిర్వహించాలని నిర్ణయించింది. ఉద్యోగులందరూ హాజరై సభను విజయవంతం చేయాలని నిర్ణయించాం’ అని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం చైర్మన్ మురళీకృష్ణ ప్రకటించారు. ‘ఉద్యోగులు ఓ స్థాయి వరకే ఉద్యమం చేయగలరు. చట్టసభల్లో పోరాడాల్సింది రాజకీయపక్షాలే. అందుకే మేం సమైక్యాంధ్ర‌ కోసం పాటుపడాలని అన్ని రాజకీయ పక్షాల నేతలను కలిసి విన్నవించాం..’ అని చెప్పారు.

‘ఢిల్లీలో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి ఫోరం అన్ని రాజకీయపక్షాల నేతలనూ ఆహ్వానించింది. దానిలో వైయస్ఆర్‌ కాంగ్రెస్ గౌరవ‌ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ స్వయంగా పాల్గొన్నారు. రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచేందుకు చట్టసభల్లో పోరాడాల్సింది రాజకీయ‌ పార్టీల నేతలే. అందుకే పార్టీలను ఉద్యమంలో కీలకపాత్ర పోషించాలని మొదట్నుంచీ కోరుతూ వస్తున్నాం. సమైక్య శంఖారావం సభకు సచివాలయ గెజిటెడ్ అధికారుల సంఘం తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. గెజిటె‌డ్ అధికారుల సంఘం ప్రతినిధులంతా ఈ సభలో పాల్గొంటారు’ అని సచివాలయ సీమాంధ్ర గెజిటె‌డ్ ఉద్యోగుల సంఘం చైర్మ‌న్ కృష్ణయ్య తెలిపారు. ‌సమైక్య శంఖారావం సభకు సంపూర్ణ మద్దతిస్తున్నామని సచివాలయ హౌసింగ్ సొసైటీ చైర్మ‌న్ వెంకట్రామిరెడ్డి చెప్పారు. సమైక్య శంఖారావానికి వివిధ జిల్లాల ఉద్యోగుల జేఏసీ, కార్మిక సంఘాలు కూడా పూర్తి మద్దతు ప్రకటించాయి.

సమైక్య శంఖారావానికి చురుగ్గా ఏర్పాట్లు :

‘సమైక్య శంఖారావం’ బహిరంగ సభకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు సభకు తరలివస్తున్నట్టు నాయకులు పార్టీ ప్రధాన కార్యాలయానికి సమాచారం పంపిస్తున్నారు. పలు మార్గాలలో ప్రత్యేక రైళ్లు కూడా ఏర్పాటు చేసుకున్నట్లు తెలుపుతున్నారు. సభకు భారీ స్థాయిలో ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున తగిన ఏర్పాట్లు చేయడంలో పార్టీ తలమునకలైంది. సమైక్య శంఖారావం ద్వారా ప్రజల మనోభావాలను మరోసారి ఢిల్లీకి వినిపించాలని నిర్ణయించిన పార్టీ అందుకు ఏర్పాట్లను పలుమార్లు సమీక్షిస్తోంది. సభ ఏర్పాట్లపై పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్‌రెడ్డి నాయకులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్‌కు చెందిన పార్టీ నేతలతో మంగళవారం శ్రీ జగన్ సమావేశమయ్యారు. సమైక్య శంఖారావం ఎవరికీ వ్యతిరేకంగా నిర్వహిస్తున్న సభ కాదని, రాష్ట్రాన్ని విభజించాలన్న కాంగ్రె‌స్ నిరంకుశ వైఖరిని ఎండగట్టడంతో‌ పాటు మెజారిటీ ప్రజల మనోభావాలకు విరుద్ధంగా తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్న డిమాండ్‌తో ఈ సభ నిర్వహిస్తున్న విషయాన్ని ప్రజలకు చెప్పాలని నాయకులకు ఆయన చెప్పారు. ఈ సభ పూర్తి శాంతియుత వాతావరణంలో జరగాలని, ప్రశాంతంగా సభను విజయవంతం చేయడంలో నాయకులు తమ వంతు కృషిచేయాలని కోరారు. మహబూబ్‌నగర్ జిల్లా ‌నాయకులతో శ్రీ జగన్‌ సోమవారం సమావేశం నిర్వహించగా, బుధవారం రంగారెడ్డి, మెదక్, నల్లగొండ జిల్లాల నాయకులతో జరుగుతుంది. మరోవైపు ఆయా జిల్లాల నాయకులు సమైక్య శంఖారావం ఏర్పాట్ల వివరాలను పార్టీ నాయకులను కలిసి వివరిస్తున్నారు.

ప్రజల ఆకాంక్ష ఢిల్లీని తాకాలనే... :
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న రాష్ట్ర ప్రజల ఆకాంక్ష ఢిల్లీకి తాకేలా చెప్పాలనే లక్ష్యంతోనే పార్టీ అధినేత శ్రీ జగన్మోహన్‌రెడ్డి సమైక్య శంఖారావం సభ నిర్వహిస్తున్నారని ఎమ్మెల్సీలు బొడ్డు భాస్కర రామారావు, ఆదిరెడ్డి అప్పారావు పేర్కొన్నారు. సమై క్య శంఖారావం విజయవంతానికి రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సభ పూర్తిగా రాష్ట్ర ప్రజల ఆకాంక్షకు అద్దం పడుతుందని ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు అన్నారు. సమైక్యతకు కట్టుబడిన పార్టీ ఒక్క వైయస్ఆర్‌సిపియే అని, దాని కోసం చిత్తశుద్ధితో కృషిచేస్తున్నది శ్రీ జగన్ మాత్రమే అని ప్రజలు నమ్ముతున్నారన్నారు.

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న దృఢ సంకల్పానికి ప్రతి రూపంగా సమైక్య శంఖారావం సభ నిలుస్తుందని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. ఢిల్లీ పెద్దలకు గుణపాఠం చెప్పేలా ఈ సభను విజయవంతం చేయాలని సమైక్యవాదులకు ఆయన పిలుపునిచ్చారు. ‘రాష్ట్రం విడిపోతే సీమాంధ్రకు వచ్చే ఆదాయం తగ్గిపోతుంది. ఆదాయ వనరులు మృగ్యం అవుతాయి. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే సీమాంధ్ర ఎడారి అవుతుందనే వాస్తవాన్ని ఈ సభ ద్వారా శ్రీ జగన్ ప్రజల్లో చైతన్యం తెస్తారు’ అన్నారు. రాజమండ్రి నుంచి వేలాదిగా సమైక్య వాదులు హైదరాబా‌ద్ తరలి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నామ‌ని రాజమండ్రి సిటీ కో-ఆర్డినేటర్ బొమ్మన రాజ్‌కుమార్ ‌అన్నారు.

సమైక్య శంఖారావం పోస్టర్ విడుదల:
రాష్ట్రం విడిపోవడం అసాధ్యమని, సమైక్య రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి అని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. సమైక్య శంఖారావం సభ వాల్‌పోస్టర్‌ను విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. బహిరంగ సభకు పార్టీ శ్రేణులతో పాటు ఉపాధ్యాయులు, ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు, మహిళలు, అన్నివర్గాల ప్రజలు భారీ సంఖ్యలో తరలిరావాలని కోరారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఒక్కరి వల్లే సాధ్యమన్నారు. సమైక్య శంఖారావం సభకు జిల్లా నుంచి భారీగా ప్రజలు తరలివెళ్లేందుకు అన్ని ఏర్పా ట్లు చేస్తున్నామని ఆయన చెప్పారు.

విశ్వరూప్‌ ఆహ్వానం :
రాష్ట్ర విభజనకు తెగబడుతున్న కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు సమైక్యవాదులు కృషిచేయాలని మాజీ మంత్రి, అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గం పార్టీ పరిశీలకుడు పినిపే విశ్వరూప్ విజ్ఞప్తి చేశారు. సమైక్యాంధ్ర కోసం స్పష్టమైన విధానంతో ముందడుగు వేస్తున్న వై‌యస్ఆర్‌ కాంగ్రెస్ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి నిర్వహిస్తున్న సమైక్య శంఖారావం సభ విజయవంతానికి ప్రతీ సమైక్యవాది కృషి చేయాలన్నారు. సమైక్య శంఖారావం సభకు తూర్పుగోదావరి జిల్లా నలుమూలల నుంచి భారీగా సమైక్యవాదులు తరలి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పార్టీలతో సంబంధం లేకుండా సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటున్న ప్రతీ ఒక్కరు ఈ సభకు స్వచ్ఛందంగా తరలి రావాలన్నారు. కోనసీమ నుంచి ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేస్తున్నామని, హైదరాబాద్‌లో వసతి సౌకర్యం కల్పిస్తున్నామని విశ్వరూప్ తెలియజేశారు.

సమైక్య శంఖారావానికి తరలిరండి:
సమైక్యాంధ్ర పరిరక్షణే లక్ష్యంగా వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఆధ్వర్యంలో ‌జరగనున్న సమైక్య శంఖారావం సభకు నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని పార్టీ అరకు పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకుడు ఆర్‌వీఎస్‌కేకే రంగారావు (బేబీనాయన) పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే వైయస్ఆర్ కాంగ్రె‌స్ లక్ష్యమన్నారు.‌ సమైక్య శంఖారావానికి అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సమైక్యవాదులు తరలిరావాలని పిలుపునిచ్చారు.

సభను జయప్రదం చేయండి :
సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ నిర్వహిస్తున్న సమైక్య శంఖారావం సభను పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని ప్రకాశం జిల్లా పార్టీ కన్వీనర్ డాక్ట‌ర్ నూకసాని బాలాజీ ‌పిలుపునిచ్చారు. రాష్ట్ర కమిటీ ముద్రించిన సమైక్య శంఖారావం వాల్‌పోస్టర్‌ను ఒంగోలు పార్టీ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అత్యంత దారుణమన్నారు.‌ సమైక్య శంఖారావం సభ ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణలోని అన్ని ప్రాంతాల ప్రజానీకానికి సంబంధించిందన్నారు. సభకు అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జనం హాజరై రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నినదించనున్నట్లు చెప్పారు.

Back to Top