ఉద్యమానికి ఉత్తేజాన్నిచ్చిన జగన్‌ ప్రసంగం

హైదరాబాద్, 27 అక్టోబర్ 2013:

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలో శనివారం హైదరాబాద్‌లో జరిగిన సమైక్య శంఖారావం సభ కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం కావడం సమైక్యవాదుల్లో ఉత్తేజాన్ని నింపింది. ఎల్బీ స్టేడియంలో ఈ సభ నిర్వహించిన తీరు, ప్రతికూల పరిస్థితుల్లోనూ తెలంగాణ జిల్లాలతో సహా రాష్ట్రం నలుమూలల నుంచీ లక్షలాది మంది సమైక్య వాదులు, అభిమానులు, పార్టీ శ్రేణులు హాజరు కావడం విశేషం. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో సభ ఎలా జరుగుతుందో అనే అనుమానాలు అంతటా వ్యక్తమయ్యాయి.

అయితే.. సభ ప్రారంభానికి మూడు నాలుగు గంటల ముందుగానే వరుణుడు కరుణించాడు. సూర్యుడు ఎండ రేఖలు విరజిమ్మాడు. దీనితో సభకు వచ్చిన వారు, నిర్వాహకులలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా అనేక చోట్ల రోడ్డు మార్గాలు మూసుకుపోయి, రవాణా సదుపాయాలు కూడా అంతంతమాత్రంగా ఉండటంతో వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ క్యాడ‌ర్‌, అభిమానులు, సమైక్యవాదులు ఆందోళన చెందారు. అయితే సమైక్య శంఖారావం సభకు వెళ్లాలన్న వారందరి దృఢ సంకల్పం ఆ అనుమానాలు, భయాలను పటాపంచలు చేసింది.

బుల్లెట్లను తలపించిన శ్రీ జగన్‌ మాటలు :
వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధినేత‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి ప్రసంగించిన తీరు పార్టీ శ్రేణులతో పాటు సమైక్యవాదులను ఎంతగానో ఆకట్టుకుంది. ‘ఢిల్లీ కోటను బద్దలు కొడదాం’, ‘ఢిల్లీ అహంకారానికి, తెలుగుజాతి ఆత్మగౌరవానికి జరుగుతున్న పోరాటం ఇది’, 'సోనియాను తిరిగి వెళ్ళిపొమ్మని పార్లమెంటులో చట్టం తెస్తే ఆమెకు నచ్చుతుందా?' లాంటి పదునైన మాటలతో శ్రీ జగన్‌ నిప్పులు చెరిగారు.‌ ఉద్యోగాల కోసం తాము ఎక్కడికి వెళ్ళాలంటూ చదువు అయిన ప్రతి యువకుడూ, యువతీ సోనియా, చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డిలను కాలర్‌ పట్టుకుని నిలదీయండి అన్నప్పుడు సభలో పెద్ద ఎత్తున మద్దతు లభించింది.

‌తెలంగాణ నాయకుడు రావి నారాయణరెడ్డి భావజాలాన్ని ఉటంకిస్తూ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి చేసిన ప్రసంగం అందరినీ ఆలోచింపజేసింది. విభజన వల్ల ఏర్పడే దుష్పరిణామాలను స్పష్టం చేయడంతో పాటు కవితాత్మక ధోరణిలో శ్రీ జగన్ చేసిన ప్రసంగం గతం కంటే భిన్నంగా సాగి అందరినీ ఆకట్టుకుంది. ఉద్యోగులు, వ్యాపారులతో పాటు అన్ని రంగాల వారు సమైక్య శంఖారావం సభ విశేషాలను, శ్రీ జగన్ ప్రసంగాన్ని టీవీల్లో ‌అమితాసక్తిగా తిలకించారు. మహిళలు కూడా ఆయన ఏం చెబుతారో వినాలని శ్రద్ధగా టీవీలకు అతుక్కుపోయి సమైక్య శంఖారావ సభను వీక్షించారు.

సమైక్య ఉద్యమంలో కొత్త కోణం :
సమైక్య శంఖారావం సభకు తెలంగాణలోని వారు సైతం హాజరు కావడం సమైక్య ఉద్యమంలో కొత్త కోణాన్ని ఆవిష్కరించిందని విశ్లేషకులు అంటున్నారు. సభ విజయంతో వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ‌శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఇప్పటికే కీలకపాత్ర పోషిస్తున్న శ్రేణులు సభ విజయవంతం తర్వాత మరింత ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. సమైక్య ఉద్యమ బాధ్యతను మరింతగా భుజానికెత్తుకునేందుకు నాయకులు ఉవ్విళ్లూరుతున్నారు.

అడ్డంకులను అధిగమించి..:
విజయవాడ - హైదరాబాద్ మధ్య తొమ్మిద‌వ
నంబర్ జాతీయ రహదారిపై వరదనీరు ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది
తలెత్తింది. అయితే.. ప్రత్యామ్నాయ మార్గంలో చాలా మంది సమైక్యవాదులు, పార్టీ
శ్రేణులు ‌సమైక్య శంఖారావం ప్రాంగణానికి చేరుకున్నారు. మార్గమధ్యలో
సమైక్యవాదులు ప్రయాణించిన బస్సులు, కార్లను నల్గొండ, వరంగల్ జిల్లాల్లో
తెలంగాణ‌ వాదులు అడ్డుకున్నారు. వర్థన్నపేట వద్ద దెందులూరు, ఉంగుటూరు నుంచి
వచ్చిన 30కి పైగా బస్సులను ఆపి వెనక్కి వెళ్లిపోవాలని బెదరించారు. అయినా
సమైక్యవాదులు లెక్కచేయలేదు. సమైక్య శంఖారావం సభకు హాజరయ్యే తీరతామంటూ
ఎదురుతిరిగారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్ శ్రేణులు, సమైక్యవాదుల‌తో విభజనవాదులు
గొడవపడ్డారు. అయినా.. స్థానిక పోలీసుల సాయం తీసుకుని వారంతా హైదరాబాద్
చేరుకున్నారు. తణుకు, ఆచంట నుంచి వెళ్లిన బస్సులపైనా తెలంగాణ‌ వాదులు రాళ్ల
వర్షం కురిపించారు. ‌ఈ రాళ్ళ దాడిలో నలుగురు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
కార్యకర్తలు గాయపడ్డారు. ఇలా అడుగడుగునా అడ్డంకులు ఎదురైనా వేలాది‌ మంది
పట్టువిడవకుండా సభకు హాజరై తమ వజ్ర సంకల్పాన్ని చాటి చెప్పారు.

Back to Top