షర్మిల పాదయాత్ర పైలాన్ విశేషాలివే..

ఇచ్ఛాపురం : బహుదూరపు బాటసారి.. చెక్కుచెదరని సంకల్పంతో వేలాది కిలోమీటర్ల దూరం నడుస్తూ జనం కష్టాలు తెలుసుకుంటున్నారు. ఎన్నో కష్టాలు, నష్టాలతో కుంగిపోయిన రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తుపై భరోసా కల్పిస్తున్నారు. మూడు వేల కిలోమీటర్లకు పైగా సాగనున్న ఆ పాదయాత్ర చేస్తున్నదెవరో అందరికీ తెలిసిందే! ఆమె.. దివంగత మహానేత డాక్టర్‌ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధ్యక్షుడు శ్రీ వైయయస్ జగ‌న్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల. ఆమె చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర మరికొద్ది రోజుల్లో ఇచ్ఛాపురంలో ముగియనున్నది. శ్రీమతి షర్మిల మహత్తర పాదయాత్ర స్ఫూర్తి చిహ్నంగా ఇచ్ఛాపురం పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. దీంతో పైలాన్ ఎలా ఉంటుందో‌ అనే ఆసక్తి అంతటా నెలకొన్నది.

సుమారు 13.5 అడుగుల వెడల్పు, 55 అడుగుల పొడవు ఉన్న స్థలంలో పైలాన్‌ను నిర్మిస్తున్నారు. తొలుత రూపొందించిన డిజైన్‌లో కొన్ని మార్పులు చేసి దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. తాజా డిజైన్ ప్రకారం.. స్థలం ముందు‌ భాగంలోని 15 అడుగుల్లో ‘పాత్ వే’ని చక్కని గ్రానైట్ రాళ్లతో నిర్మిస్తారు. అక్కడ నుంచి 5 అడుగుల ఎత్తు, 5 అడుగుల వెడల్పుతో పెడస్ట‌ల్ ‌ఏర్పాటు చేస్తారు. పెడస్టల్ దిగువన ‌మూడు అడుగుల మేర కాంక్రిట్ ప్లా‌ట్‌ఫాం ఏర్పాటు చేస్తారు. పెడస్టల్ చుట్టూ గ్రానై‌ట్ పలకలు అమర్చుతారు. గ్రానై‌ట్ పలకపై‌ శ్రీమతి షర్మిలమ్మ పాదయాత్ర చేస్తున్నట్టున్న చిత్రం ఉంటుంది.

దీని కోసం శ్రీమతి షర్మిల చిత్రం ఉన్న గ్రానైట్ పలకను ప్రత్యేకంగా తెప్పిస్తున్నారు.‌ శ్రీమతి షర్మిల పాదయాత్రకు స్ఫూర్తిగా నిలిచిన మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి 10 అడుగుల ఇత్తడి విగ్రహాన్ని పెడస్ట‌ల్‌పై ఏర్పాటు చేస్తారు. పైలాన్‌కు ఇరువైపులా ఏనుగు దంతాల్లా ఉండే రెండు ఆర్చిలు ఏర్పాటు చేస్తారు. నేలపై రెండు అడుగుల వ్యాసార్ధంతో ఉండే ఈ ఆర్చిలు వైయస్ విగ్రహంపైన ఒక అడుగు వ్యాసార్ధంతో ముగుస్తాయి. సుమారు 17.5 అడుగుల ఎత్తు ఉండే ఈ ఆ‌ర్చిల మధ్య వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ చిహ్నం ఉన్న ఇత్తడి వృత్త ఫలకాన్ని ఏర్పాటు చేస్తారు. ఇది 3.3 అడుగుల వ్యాసార్ధంతో ఉంటుంది. పైలా‌న్‌కు ముందు ‘మరో ప్రజాప్రస్థానం’ పేరిట స్వాగత ద్వారం ఉంటుంది.

పైలాన్‌ డిజైన్‌పై పార్టీ శ్రేణుల హర్షం :
పైలాన్ నిర్మాణ‌ం పనులు చురుకుగా జరుగుతున్నాయి. వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ కేంద్ర పాలకమండలి సభ్యు డు వై.వి.సుబ్బారెడ్డి ఇటీవల ఇచ్ఛాపురం వచ్చి‌ పైలాన్‌ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పైలాన్ డిజై‌న్‌ను పార్టీ నాయకులు, కార్యకర్తలకు చూపించారు. డిజైన్ అద్భుతంగా ఉండటంతో ప్రతి ఒక్కరూ సంబరపడ్డారు.‌ మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి ప్రజాప్రస్థానం పాదయాత్ర ముగిసినపుడు ఇచ్ఛాపురం పట్టణంలో విజయ స్థూపం నిర్మించారని, ఇప్పుడు శ్రీమతి షర్మిల పాదయాత్ర ముగింపు సందర్భంగా పైలాన్ ఏర్పాటు చేస్తున్నారని స్థాని‌కులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

శ్రీ జగనన్న సోదరి శ్రీమతి షర్మిల వేలాది కిలోమీటర్లు నడుస్తూ.. ప్రజల కష్టాలు తెలుసుకుంటూ మా ఊరు వస్తున్నారు. ఆమె సుదీర్ఘ పాదయాత్ర ప్రపంచ రికార్డు సృష్టిస్తోంది. అంతటి మహత్తర పాదయాత్రకు చిహ్నంగా ఈ అద్భుతమైన జ్ఞాపికను మా ఊరిలో ఏర్పాటు చేయటం మధురానుభూతి కలిగిస్తోందని ఇచ్ఛాపురానికి చెందిన గృహిణి టి ఉష ఆనందం వ్యక్తంచేశారు.

Back to Top