అభిమానం తోడుగా షర్మిలతో కలిసి నడక

ఇచ్ఛాపురం (శ్రీకాకుళం జిల్లా),

4 ఆగస్టు 2013: శ్రీకాకుళం జిల్లా ఒడి నేడు ఓ మహోజ్వల ఘట్టానికి వేదిక కానున్నది. పాదయాత్రల చరిత్ర పుటల్లో ఓ అరుదైన రికార్డు జిల్లాలోని ఇచ్ఛాపురంలో ఆదివారం పురుడు పోసుకోనున్నది. లక్షలాది మంది అభిమాల మధ్య ప్రజా సంక్షేమం కోసం మహానేత రాజన్న ముద్దుబిడ్డ శ్రీమతి షర్మిల చేస్తున్న పాదయాత్ర లక్ష్యానికి అల్లంత చేరువులో ఉన్నది. కేవలం మరికొన్ని గంటల్లో శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర లక్ష్యాన్ని చేరుకుని రికార్డుల్లోకి ఎక్కనుంది. మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి పదేళ్ళ క్రితం తన ప్రజాప్రస్థానం పాదయాత్ర ముగించిన చోటే ఇప్పుడు ఆయన తనయ రికార్డుస్థాయి పాదయాత్రకు ముగింపు పలకబోతున్నారు. జూలై 21న శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభమైన శ్రీమతి షర్మిల పాదయాత్ర ఆదివారానికి మొత్తం 15 రోజులు పూర్తిచేసుకున్నది. చివరిరోజు ఆదివారంనాడు ఆమె 6.3 కిలోమీటర్ల యాత్ర పూర్తిచేసి పాదయాత్రకు ముగింపు పలకనున్నారు.

వైయస్ఆర్‌ జిల్లా ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు 230 రోజుల పాటు చేసిన ఈ సుదీర్ఘ పాదయాత్రకు గుర్తుగా ఇచ్ఛాపురంలో నిర్మించిన భారీ 'విజయ ప్రస్థానం' స్తూపాన్ని శ్రీమతి షర్మిల నేడు ఆవిష్కరిస్తారు. మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి 'ప్రజాప్రస్థానం' విజయవాటికకు ఎదురుగా నిర్మించిన ఈ స్థూపాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. అనంతరం అశేష జనవాహిని హాజరయ్యే బహిరంగ సభలో శ్రీమతి షర్మిల ప్రసంగిస్తారు. ఈ సభలో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీ కార్యకర్తలు శనివారం సాయంత్రానికే శ్రీకాకుళం జిల్లాకు చేరుకున్నారు. విశాఖకు చేరుకున్న వారంతా ఉదయాన్నే ఇచ్ఛాపురం చేరుకుంటున్నారు.

వేలాది మందితో ముఖాముఖి :
ఈ సుదీర్ఘ మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర సందర్భంగా శ్రీమతి షర్మిల ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ వేలాది మందిని ముఖాముఖి కలిశారు. వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. త్వరలోనే మంచి రోజులు వస్తాయని, జగనన్నను ఆశీర్వదించాలంటూ పిలుపునిచ్చారు. జగనన్న.. రాజన్న రాజ్యం తెస్తారని భరోసానిస్తూ ముందుకు సాగారు. శ్రీమతి షర్మిల అడుగుపెట్టిన ప్రతిచోటా ప్రజలు నీరాజనాలు పట్టారు.

అడుగులు వేయించిన జనాభిమానం :
మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి తనయ‌ శ్రీమతి షర్మిల పాదయాత్రలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఆమెకు అండగా నిలిచారు. అయితే, పాదయాత్ర ప్రారంభించిన మొదటి రోజు నుంచి 230 రోజుల పాటు 3,112 కిలోమీటర్లు మేర సాగిన యాత్రలో రాజన్న బిడ్డతో కొందరు అడుగు కలిపారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు ఆమెతో పాటు పాదయాత్ర చేస్తూ అభిమానం చాటుకున్నారు.
ఆ బహుదూరపు బాటసారుల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.

అభిమానంతోనే అడుగులు కలిపాం : కంది అంజిరెడ్డి

మహానేత డాక్టర్ వైయస్ ‌రాజశేఖరరెడ్డి కుటుంబం అంటే చాలా ఇష్టం అని ప్రకాశం జిల్లా పర్చూరు మండలం చింతగుంటపాలెం గ్రామానికి చెందిన కంది అంజిరెడ్డి చెప్పారు. 2003లో వై‌యస్ఆర్‌తో పాదయాత్రలో పాల్గొన్నాను. శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఓదార్పు యాత్రలో ఆయన వెంటే ఉన్నా. అదే స్ఫూర్తితో ఆ ఇంటి ఆడబిడ్డ శ్రీమతి షర్మిలతో నడుస్తున్నాను. ఇడుపులపాయ నుంచి ఆమెతో కలిసి పాదయాత్రలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది.

ఫీజు రీయింబర్సుమెంట్‌తో డాక్టర్‌నయ్యా : గురుమూర్తి
వైయస్ఆర్ ‌ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్సుమెంట్ పథకంతో చదువు‌కుని డాక్టర్‌ అయ్యానని తిరుపతికి చెందిన ఎం. గురుమూర్తి తెలిపారు. వైయస్ఆర్ చేసిన మేలు జన్మజన్మల‌కూ మరచిపోలేను. ఏ సిఎం కూడా ఇలాంటి బృహత్తరమైన పథకాన్ని ప్రవేశపెట్టలేదు. వైయస్‌పై ఉన్న అభిమానంతోనే శ్రీమతి షర్మిల పాదయాత్రలో కూడా పాల్గొన్నానన్నారు. ఎంత దూరం నడిచినా తనకు కష్టం అనిపించలేదని గురుమూర్తి చెప్పారు.

వయోభారం మీదపడినా : గోపిరెడ్డి సుబ్బారెడ్డి

వృద్ధాప్యం మీద పడినా వైయస్ఆర్ కుటుంబంపై ఉన్న అభిమానం‌ తనను పాదయాత్రలో పాల్గొనేలా చేసిందని ప్రకాశం జిల్లా కనికెల్లమెట్ల గ్రామానికి చెందిన గోపిరెడ్డి సుబ్బారెడ్డి స్పష్టంచేశారు. ఇడుపులపాయలో బయలుదేరిన తాను ఇంతవరకు నడిచి వస్తానని మొదట్లో అనుకోలేదన్నారు. మహానేత కుటుంబంపై ఉన్న అభిమానం, నమ్మకమే ఇంతదూరం నడిపించాయన్నారు. వైయస్ కుటుంబానికి మంచి జరగాలని కోరుకుంటున్నా‌నన్నారు.

ప్రజా స్పందన అపూర్వం : నూనె దశరథ రామిరెడ్డి
ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు శ్రీమతి షర్మిల పాదయాత్రకు ప్రజల నుంచి వచ్చిన స్పందన అపూర్వం అని గుంగూరు జిల్లా పెద్దపలుకులూరు వాసి నూనె దశరథ రామిరెడ్డి అన్నారు. 2003లో వైయస్ రాజశేఖ‌రరెడ్డి పాదయాత్ర చేపట్టి 2014లో అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు శ్రీమతి షర్మిల పాదయాత్రతో 2014లో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశిస్తున్నానన్నారు. మరికొద్ది రోజుల్లో ప్రజలకు మంచిరోజులు రానున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.

చేదోడుగా ఉండాలని : సన్నపరెడ్డి రమణమ్మ
ఆడ బిడ్డకు చేదోడు వాదోడుగా ఉండాలని, రాజన్నపై అభిమానంతో ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు శ్రీమతి షర్మిలతో కలిసి నడిచి వచ్చినట్లు ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం నేలటూరుకు చెందిన సన్నపరెడ్డి రమణమ్మ చెప్పారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డిని అక్రమంగా జైల్లో పెట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న త్వరలోనే బయటకు వస్తారని, అధికారం చేపట్టి రాజన్నరాజ్యాన్ని తెస్తారని, తనలాంటి పేదలను ఆదుకుంటారన్న ధీమాను ఆమె వ్య్తక్తం చేశారు.

రాజన్న రాజ్యం కోసమే : హిమ ప్రమీలమ్మ
రాజన్నరాజ్యం రావాలనే ఆకాంక్షతో రాజన్న కూతురు వెంట ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు నడిచి వచ్చానని అనంతపురం జిల్లా గుద్దెళ్ళ గ్రామ నివాసి హిమ ప్రమీలమ్మ పేర్కొన్నారు. వైయస్ఆర్ కుటుంబానికి ప్రజల ఆదరణ అపూర్వం‌  అన్నారు. దీనిని చూసి కాంగ్రెస్, టిడిపి నాయకుల గుండెలు వణుకుతున్నాయన్నారు. శ్రీ జగన్‌ను అక్రమంగా జైల్లో బంధించినా త్వరలోనే మంచిరోజులు వస్తాయన్న నమ్మకం ఉందని ఆమె అన్నారు.

Back to Top