సిబిఐ అసత్యాలకు వంతపాడుతున్న ఈడీ!

ఏదైనా ఒక భూమిని ఎవరికైనా లీజుకు ఇవ్వడానికి లేదా వేరే వ్యక్తులకు అమ్మేయడానికీ తేడా ఉంటుందా? ఉండదా? దానిని లీజుకు ఇవ్వడానికి, విక్రయించడానికి ఒకటే రేటు ఉంటుందా? అలాగే, అభివృద్ధి చేసిన భూమికీ చేయని భూమికీ తేడా ఉండదా? ఆ రెండు రకాల భూమి విలువా ఒక్కలాగే ఉంటుందా? పదహారు కోట్ల రూపాయలు లాభం వచ్చిందని దానికి ప్రతిఫలంగా ఎవరైనా రూ. 29.5 కోట్లు ముడుపులుగా చెల్లిస్తారా? ఇలాంటి విషయాలన్నీ సామాన్యులకు సైతం తేలిగ్గా తెలిసే అంశాలే కదా!

సామాన్యులకే ఇంత స్పష్టంగా అర్థమయ్యే ఈ విషయాలు జాతీయ స్థాయి దర్యాప్తు సంస్థలు సీబీఐకో, 
ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)కో తెలియవు అని అనుకోవాలా? తెలిసినా సరే పదేపదే ఇవే అంశాలను ఆ సంస్థలు ఎందుకు ప్రస్తావిస్తున్నాయన్నది ప్రశ్న? ఎఫ్ఐఆ‌ర్ నుంచి రిమాండ్ రిపోర్టు వరకూ‌ వీటినే ఎందుకు అవి వల్లెవేస్తున్నాయి? చివరికి ఆస్తుల అటాచ్‌మెంట్ ఉత్తర్వుల్లో ‌కూడా ఇవే అంశాలను ఎందుకు ప్రస్తావిస్తున్నట్టు? వాస్తవాలు బయటపెట్టకుండా ఆ సంస్థలు మోసం చేయాలనుకుంటున్నది ఎవరిని?

వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ‌ వ్యవస్థాపక అధ్యక్షుడు వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించిన కేసులో సీబీఐ ఈ సంవత్సరం మార్చి 31వ తేదీన మొట్టమొదటి చార్జిషీటును దాఖలు చేసింది. ఆరు నెలలు గడిచాక అక్టోబర్ 4న ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరే‌ట్ ఈ కేసు‌కు సంబంధించి కొన్ని ఆస్తు‌లను అటాచ్ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఆ చార్జిషీట్‌లోని అభియోగాలనే మక్కీకి మక్కీ ఈ ఉత్తర్వుల్లో కూడా వల్లించింది తప్ప ఈడీ కొత్తగా కనుగొన్న అంశాలేమీ లేవన్నది సుస్పష్టం.

అరబిందో, హెటెరో సంస్థలకు వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోని ప్రభుత్వం రూ. 16.3 కోట్ల మేర లబ్ధిని చేకూర్చిందని, అందుకు ప్రతిఫలంగా ఆ సంస్థలు వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడిలు పెట్టాయనేది సిబిఐ అభియోగాల సారాంశం. వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడులపై దర్యాప్తు చేస్తున్న సీబిఐ ఇప్పటికే ఈ కేసులో నాలుగు చార్జిషీట్లు దాఖలు చేసింది. మరి ఈ ఆరోపణల్లో వాస్తవం ఎంత? సిబిఐ కావాలని వదిలేసిన అంశాలేమిటి?

హెటెరో, అరబిందో సంస్థలకు రూ. 16.3 కోట్ల లాభం చేకూరిందని అందుకే అవి వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సంస్థల్లో రూ. 29.5 కోట్లు పెట్టుబడిగా పెట్టాయని సిబిఐ తన మొదటి చార్జిషీట్‌లో పేర్కొంది. నాలుగైదు రోజుల క్రితం అరబిందో, హెటెరో, జగతి, జనని సంస్థలకు చెందిన కొన్ని ఆస్తులను అటాచ్ చేస్తున్నట్లు ప్రకటించిన సందర్భంగా ఎ‌న్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరే‌ట్ కూడా ఇదే వాదన వినిపించింది. ‌సిబిఐ చార్జిషీటునే తన చార్జిషీటుగా మార్చుకున్న ఈడీ ఆ లెక్క ఎక్కడి నుంచి వచ్చిందన్నది మాత్రం చెప్పనేలేదు.

అసలు రూ. 16 కోట్లు లబ్ధి చేకూరితే దానికి ప్రతిఫలంగా రూ. 29.5 కోట్లు పెట్టుబడి పెట్టే వారెవరైనా ఉంటారా? అలా పెట్టారంటే దాని అర్థం వారు ఆ కంపెనీల్లో లాభాల కోసమే ఇన్వెస్ట్ చేశారని భావించనక్కర్లేదా? ఆరు వేల మందికి పైగా ఉపాధి పొందుతున్నారనటం అబద్ధమా? రూ. 1,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయన్న విషయం అసత్యమా? అసలు జడ్చర్ల సె‌జ్‌కు చంద్రబాబు హయాంలోనే భూములు సేకరించినా మూడేళ్ల పాటు అక్కడ పరిశ్రమ పెట్టడానికి ఎవరూ రాకపోవటాన్ని సిబిఐ ఎందుకు ప్రస్తావించలేదన్నది ఇక్కడ ప్రశ్నగా మిగులుతోంది? అన్నీ అప్పటి ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డికి అంటగడుతున్న సిబిఐ కనీసం ఈ ఫైళ్లు వైయస్ టేబు‌ల్ వద్దకు కూడా రాలేదన్న వాస్తవాన్ని ఎందుకు విస్మరించిం‌దన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఇదంతా చూస్తుంటే జగన్మోహన్‌రెడ్డిపై జరుగుతున్న కుట్ర అని స్పష్టం అవుతోంది కదా!

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top