షర్మిలతో పాటు కదం తొక్కిన జనసేన

మహానేత రాజన్న బిడ్డను చూడాలి.. జగనన్న బాణానికి బాసటగా నిలవాలి.. మేము సైతం అంటూ ఆమెతో అడుగు కలపాలి.. అండగా ఉన్నామని.. ఉంటామని చాటి చెప్పాలి.. ఇది మరో ప్రజాప్రస్థానంలో కదులుతున్న జన తరంగం అంతరంగం.. ఉప్పొంగే అభిమానం. ఊరూవాడా జన సైన్యమై కదం తొక్కుతుంటే.. శుక్రవారం శ్రీమతి షర్మిల పాదయూత్ర తణుకు నియోజకవర్గంలో కొనసాగింది. వృద్ధులు, వికలాంగులు ఎంతో అభిమానంతో మహానేత తనయను చూడడానికి వచ్చారు. శ్రీ జగన్ బయటకు రావాలి.. త్వరలోనే వస్తారని ఆకాంక్షించారు.

కౌలు రైతులు, కూలీలు, ‌ప్రభుత్వ సాయం అందని పేదలు, మహిళలు, యువత.. ఒకరేమిటి అందరూ పాదయాత్ర పొడవునా శ్రీమతి షర్మిలను కలిసి సమస్యలు చెప్పగా త్వరలోనే మంచి రోజులు వస్తాయని వారికి భరోసా ఇచ్చారు. తణుకు హైస్కూల్ సెంట‌ర్‌లో సాయంత్రం కిక్కిరిసిన ప్రజలను ఉద్దేశించి శ్రీమతి షర్మిల ప్రసంగించారు. రైతులు పంటను త్యాగం చేసినా డెల్టా ఆధునికీకరణ పనులు చేయలేకపోయిందీ ప్రభుత్వం. ఇంత నిర్లక్ష్యం వహిస్తున్న వాళ్లని పాలకులు అనాలా.. రాక్షసులు అనాలా అని ఆమె ధ్వజమెత్తారు.

తణుకు (ప.గో.జిల్లా) :

వ్యవ‘సాయం’ బాగాలేదు. పెట్టుబడులు కూడా రావడం లేదు. పండించిన దొండకాయలు కిలో రెండు రూపాయలకు అమ్ముకోవలసి వచ్చింది. అప్పులెలా తీర్చాలో తెలియడం లేదు... ఇది ఇరగవరం మండలం గోటేరుకు చెందిన రైతులు మంగిన సాంబమూర్తి, జుత్తిగ సుబ్బారావు, కౌరు అంజి కష్టం.

ఉపాధి హామీ పథకం అంటున్నారు కాని కూలీ సొమ్ము అంతంతమాత్రమే.. యంత్రాల వల్ల పనులు లేకుండా పోతున్నాయి.. పూట గడవడం కష్టంగా ఉంది.. ఇది అంతినగుంటకు చెందిన ఉపాధి కూలీలు బిక్కవోలు రాము, రావి లక్ష్మి, జుత్తిగ లక్ష్మి, తలుపుల మల్లమ్మ ఆవేదన. అమ్మా.. నాకు వినికిడి లోపం. చెవి మిషన్ కోసం నాలుగైదుసార్లు ఏలూరు వెళ్లాను. అధికారుల చుట్టూ తిరిగాను. అయినా ఎవరూ కనికరించలేదు.. ఇది‌ వృద్ధుడు కె.వీర్రాజు నిస్సహాయ స్థితి. ఇలా ఎంతోమంది కాంగ్రెస్ ‌ప్రభుత్వ బాధితులు శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల వద్ద తమ బాధలు చెప్పుకుంటూ.. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో ఆమెతో కలిసి అడుగులు వేశారు.

దివంగత మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి తనయ‌ శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఆమెతో మాట్లాడాలని, చేయి కలిపి ‘అండగా మేముంటాం’ అని చెప్పాలని ఊరూ వాడా కదిలి వస్తోంది. శ్రీమతి షర్మిల రాకకు ముందుగానే రోడ్లకు ఇరుపక్కలా పిల్లలూ పెద్దలు బారులు తీరి ఎదురు చూస్తున్నారు. వృద్ధులు, వికలాంగులు కష్టమైనా రాజన్న బిడ్డను చూడాలని, ఆశీర్వదించాలని, అండగా ఉంటామని చెప్పాలని వస్తున్నారు. ప్రతి ఒక్కరినీ శ్రీమతి షర్మిల ఆప్యాయంగా పలకరిస్తూ అధైర్యపడొద్దని, రాజన్న రాజ్యం వస్తుందని, జగనన్న ముఖ్యమంత్రి అవుతారని అందరి కష్టాలు తీరతాయని భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు.

మరో ప్రజాప్రస్థానం శుక్రవారం ఉదయం 9.15 గంటలకు ప్రారంభమై ఇరగవరం, గోటేరు అడ్డరోడ్డు, గోపాలపురం, తణుకు పురపాలక సంఘ కార్యాలయం రోడ్డు, రాష్ట్రపతి రోడ్డు, నరేంద్ర సెంటర్, జెడ్పీ హైస్కూ‌ల్ సెంట‌ర్, వెంకటేశ్వర థియేట‌ర్ రోడ్డు, సొసైటీ రోడ్డు మీదుగా కొనసాగింది. కొత్తపాడు సెంట‌ర్‌లో మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని‌ శ్రీమతి షర్మిల ఆవిష్కరించి, పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుక్కల సూర్యనారాయణ అనే వికలాంగుడు శ్రీమతి షర్మిలను కలిసి తన బాధలు చెప్పుకున్నాడు. అనుమాజిపాలెం వద్ద గణసాల అలేఖ్య అనే విద్యార్థిని శ్రీమతి షర్మిల వద్ద ఆటోగ్రాఫ్ తీసుకుని మురిసిపోయింది. గోటేరు అడ్డరోడ్డు సమీపంలో రైతు కూలీలు శ్రీ జగనన్న సోదరి శ్రీమతి షర్మిలను కలిసి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. ‘అమ్మా...షర్మిలమ్మా...కూలి పనులకు వెళితే రోజుకు 70 నుంచి వంద రూపాయలకు వరకు వస్తోంది. కుటుంబాన్ని పోషించుకునేందుకు ఇది సరిపోవడం లేదమ్మా’ అని తెలిపారు. రైతులు కేతా భాస్కరరావు, కేతా ఆంజనేయులు మాట్లాడుతూ ‘షర్మిలమ్మా.. వ్యవసాయం చేయటం కష్టంగా మారింది. పురుగు మందులు, ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయమ్మా..’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

వారి సమస్యలపై శ్రీమతి షర్మిల స్పందిస్తూ... ‘అధైర్యపడకండి. త్వరలో రాజన్న రాజ్యం వస్తుంది... శ్రీ జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ప్రతి రైతు తలెత్తుకుని తిరిగేలా చేస్తార’ని భరోసా ఇచ్చారు. ఒకచోట ముసలమ్మ అనే వృద్ధురాలు శ్రీమతి షర్మిలను కలిసి తనకు పింఛను రావటం లేదని చెప్పింది. గోటేరులో శతాధిక వృద్ధురాలు నడింపల్లి అక్కాయమ్మ శ్రీమతి షర్మిలను చూసేందుకు రావటంతో ఆమె వద్దకే శ్రీమతి షర్మిల వెళ్ళి ఎలా ఉన్నారమ్మా.. పింఛను అందుతోందా అని అడిగారు. ఆమె పింఛను సరిపోవడం లేదని చెప్పగా జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక రూ.700 పింఛను ఇస్తారని చెప్పారు. పెనుమంట్ర మండలం వెలగలవారిపాలెం శివారు జుత్తిగపాకలకు చెందిన వెలగల ప్రసాదురెడ్డి, సంధ్యారాణి దంపతులు తమ కుమారుడికి పేరు పెట్టాలని కొత్తపాడులో శ్రీమతి షర్మిలను కలిసి కోరగా జగన్మోహన్‌రెడ్డి అని ఆమె నామకరణం చేశారు.

ఇరగవరం సెంటర్‌లో మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి‌ శ్రీమతి షర్మిల పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గోపాలపురం వద్ద నాగమణి అనే మహిళ శ్రీమతి షర్మిలకు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. వైయస్‌ఆర్ టీ‌చర్సు ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నడింపల్లి అప్పలరాజు పాదయాత్రలో‌ శ్రీమతఇ షర్మిలను కలిసి వైయస్‌ఆర్‌ టిఎఫ్ డైరీని అందించారు.

Back to Top