రాజకీయ బాహుబలి వైయస్ ఆర్ - 4


            గాంధీభవన్ లో మీటింగ్ జరుగుతున్నది.  తన సంస్కరణలతో ఆంధ్రప్రదేశ్ ను పీల్చి పిప్పిచేసి, రాష్ట్రాన్ని దివాళా తీయించిన చంద్రబాబు పరిపాలనను ఎలా తప్పించాలా అని సీనియర్ నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు.  ఒక పత్రికలు, మీడియా, చంద్రబాబు విదిల్చే ఎంగిలిమెతుకులకోసం కక్కుర్తిపడి ఆయనను ఆకాశానికి ఎత్తేస్తున్నాయి. కాంగ్రెస్ కు కనీస ప్రచారం ఇచ్చేవారు కూడా కరువు.  ప్రజల కస్టాలు ఏమాత్రం పత్రికల్లో రావడం లేదు.  ఇంకుడు గుంతలు, నీరు మీరు, జన్మభూమి వంటి దోపిడీ కార్యక్రమాలతో చంద్రబాబు ప్రభుత్వం మూడు షర్ట్ జేబులు ఆరు పాంటు జేబులు మాదిరిగా తమ సొంత ఖజానాలు నింపుకుంటున్నారు. 

 1994  లో సైకిల్ కు కూడా దిక్కూదివాణం లేని తెలుగుదేశం నాయకులు  2004  వచ్చేసరికి కోట్లాధిపతులై పోయారు.  ప్రభుత్వ రంగసంస్థలు దివాళా తీశాయి.  కొన్ని మూతపడ్డాయి.  వ్యవసాయం నాశనమై పోయింది.  అన్నదాతల హస్తాలకు శృంఖలాలు బిగించారు.  కరువు విలయతాండవం చేస్తున్నది.  సుమారు యాభైవేలమంది ఉద్యోగులు ఉపాధి పోగొట్టుకుని వీధిన పడ్డారు. సుమారు పదిహేను ప్రభుత్వ రంగ సంస్థలు దివాళా ప్రకటించాయి.  ఆర్టీసీ పీకలలోతు కష్టాల్లో, నష్టాల్లో కూరుకుని పోయి, ప్రయివేట్ రంగానికి అప్పగించాలన్న ప్రతిపాదనలు రూపుదిద్దుకుంటున్నాయి.  హెరిటేజ్ కంపెనీ వృద్ధికోసం రాష్ట్రంలోని పాడి పరిశ్రమ సంస్థలను కావాలనే నష్టాలకు గురిచేశారు.  చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రంలో నాశనం కాని సంస్థలే లేవు.  ఒక్క కొత్త పరిశ్రమ రాలేదు.  కరెంట్ కోతలతో సుమారు అయిదువేల చిన్న చిన్న పెట్టుబడుల పరిశ్రమలు మూతపడిపోయాయి.  రోజువారీ ఖర్చులకోసం ప్రతిరోజూ రిజర్వ్ బ్యాంకు కు అప్పులకు వెళ్లేవారు.  రాష్ట్రాన్ని గొప్పగా పాలించాను అని చెప్పుకునే చంద్రబాబు దిగిపోయేనాటికి రాష్ట్రం ఇరవై రెండువేల కోట్ల అప్పుల్లో మునిగింది.  

ఒక వంక పత్రికలు, టీవీ ఛానెల్స్ చూస్తుంటే చంద్రబాబు అపర చాణక్యుడని, పాలనా దక్షుడని, గొప్ప అడ్మినిస్ట్రేటర్ అని ఇరవైనాలుగు గంటలూ ప్రచారం జరుగుతున్నది.  సాక్షాత్తూ చంద్రబాబే ప్రతిరోజూ దూరదర్శన్ లో అరగంట సేపు తన ప్రభుత్వం గూర్చి ఆర్భాటంగా ప్రచారం చేసుకునే వారు.  ప్రజలను నమ్మించే మార్గం ఏదీ?  

"రాష్ట్రప్రజలు సమస్యలను తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తాను"  హఠాత్తుగా వైయస్ ఆర్  నోటినుంచి వచ్చిన మాటలకు అక్కడున్న నాయకులంతా విస్తుపోయారు.  

"రాజశేఖర్.. నీకేమైనా పిచ్చెక్కిందా?  ఇప్పుడు పాదయాత్రలేమిటి?  హాయిగా బస్సుల్లో యాత్ర చేద్దాం"  అన్నారు కొందరు నాయకులు.  

"మనం ఏసీ బస్సుల్లో తిరుగుతూ ప్రజలదగ్గరకి వెళ్తే మనం విలాసపురుషులము అనుకుంటారు.  అలా తిరిగితే ప్రజల సమస్యలు తెలియవు.  నడిచే వెళ్ళాలి జనం మధ్యకు" దృఢంగా అన్నారు వైయస్ ఆర్ 

"ఇప్పుడు ఎండలు మండిపోతున్నాయి.  ఈ ఎండల్లో తిరిగితే తిరిగి వచ్చేవి మన శవాలు మాత్రమే" భయకంపితులై అన్నారు నాయకులు.  

"రైతులు, కూలీలు ఎండల్లో కాక నీడపట్టున పనిచేస్తారా?  మనం తిరగలేమా?  మనం వారిలో కలిసిపోతేనే వారు మనతో మనస్ఫూర్తిగా వారి బాధలు చెప్పుకుంటారు.  కాబట్టి నేను పాదయాత్ర చేస్తాను" నిశ్చితమనస్కుడై చెప్పారు వైయస్ ఆర్ .

మామూలు ప్రజలకు తెలియదేమో కానీ, ఆ నాయకులకు తెలుసు... వైయస్ ఆర్  ఒక నిర్ణయం ప్రకటిస్తే హరిహరాదులు చక్రం వేసినా ఆగదు అని.  వైయస్ఆర్  వాక్కు రామబాణమని, అది గురితప్పదని వైయస్ ఆర్  గుణం తెలిసినవారికి తెలుసు.  బాషా సినిమాలో రజనీకాంత్ డైలాగ్ "నేను ఒకసారి చెబితే వందసార్లు చెప్పినట్లే" ... వైయస్ ఆర్   నిర్ణయం రెండూ ఒకటే!!  ఆయన మొండివాడు.  ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్న తరువాత మార్చుకోవడం అటు సూర్యుడు ఇటు పొడిస్తే తప్ప సాధ్యం కాదు. (బహుశా ఆ మొండితనమే ఆయన సుతుడు జగన్ మోహన్ కు కూడా వచ్చిందని నా అభిప్రాయం).

ఇక వైయస్ఆర్  కు చెప్పి చూడటం వృధాప్రయాస అని మిగిలిన నాయకులు భావించారు.  అప్పటివరకు యాత్రలో పాల్గొంటామన్న వారంతా నిష్క్రమించారు.  వైయస్ ఆర్  ఒక్కడే మిగిలాడు.  

ఆకాశంలో కోట్లాది నక్షత్రాలుంటాయి.
కానీ చంద్రుడు ఒక్కడే 
సూర్యుడు ఒక్కడే 
అయినా వారి కాంతులకు,  తేజస్సుకు వచ్చిన లోటు ఏమీ లేదు.  

ఆరంభించరు నీచమానవులు విఘ్నయాససంత్రస్తులై 
ఆరంభించి పరిత్యజింతురు విఘ్నయాత్తులై మధ్యముల్ 
ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ ధ్రుత్యున్నతొత్సాహులై 
ప్రారబ్ధద్ధములుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్ గావునన్

అంటాడు భర్త్రుహరి తన సుభాషితాల్లో 

సోనియా గాంధీ అనుమతి లభించింది.  

చేవెళ్లలో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు వైయస్ఆర్ .  ఇక అది అనవరతంగా సాగిపోయింది.  దారిపొడవునా వేలాదిమంది మూగారు.  ఎక్కడ, ఏ వర్గాన్ని కదిలించినా కన్నీరు, కష్టాల కడగండ్లు....చంద్రబాబు పాలనలో ఒక్క వర్గం వారు కూడా సుఖంగా లేరు.  తొమ్మిదేళ్లలో ఆరుసార్లు కరెంట్ చార్జీలు పెంచారు.  బస్సు చార్జీలు ఇష్టం వచ్చినట్లు పెంచేశారు.  బస్సు ప్రయాణం కూడా అందని ద్రాక్ష అయింది పేదవారికి.  స్వతంత్ర భారతంలో అత్యంత దుర్మార్గ పాలన చంద్రబాబుది.  

అప్పటివరకూ వైయస్ ఆర్ ప్రాయం నాలాంటి వారిలో ఉన్నది.  నేను 1978  నుండి వైఎస్సార్ గూర్చి వింటున్నాను.  కానీ నాకు ఆయన మీద ఎన్నడూ సదభిప్రాయం లేదు.  కానీ, మండే ఏప్రిల్ ఎండల్లో, కాళ్లకు బలపాలు కట్టుకుని, స్వేదధారలను చిందిస్తూ వైయస్ఆర్  చేసిన పాదయాత్ర నాలాంటి అనేకమంది కళ్ళు తెరిపించింది.  జన్మతహా కోటీశ్వరుడు, కోరుకుంటే ఎన్ని విలాసాలనైనా అనుభవించగలిగిన తాహతు ఉన్నవాడు, అలా పాదయాత్ర చెయ్యడం ఒక అద్భుతం అనిపించింది.  

నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వైయస్ఆర్  చేసిందే తోలి సుదీర్ఘ పాదయాత్ర కావచ్చు. అరవై ఎనిమిది రోజులు..1470  కిలోమీటర్లు!  

తెలుగుదేశం ఉండగా ఇక అధికారం దక్కడం కల్ల అని నిరాశలో కూరుకునిపోయిన కాంగ్రెస్ పార్టీకి ఆయన సంజీవని అయ్యారు.  నిజజీవితంలో వైద్యుడిగా రోగులకు ప్రాణాలు పోసిన వైయస్ఆర్ , రాజకీయ నాయకుడిగా చచ్చింది అనుకున్న కాంగ్రెస్ కు జీవం పోశారు!

(సశేషం)

Back to Top