మరో ప్రజాప్రస్థానంలో మహోజ్వల ఘట్టం!

నేల ఈనింది. కొవ్వూరు జన గోదారైంది. రోడ్డు కం రైలు బ్రిడ్జిపై మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ మహోజ్వల దృశ్యాన్ని వీక్షించేందుకు వరుణదేవుడు, వాయుదేవుడు జంటగా తరలివచ్చారు. మహానేత రాజన్న బిడ్డ.. జననేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల గోదావరి వారధిపైకి అడుగుపెట్టగానే మండుటెండ మటుమాయమైంది. మలయమారుతం పరుగెత్తి వచ్చి పరవశింపజేసింది. పశ్చిమగోదావరి జిల్లాలో 24 రోజుల పాటు జనాభిషేకంతో సాగిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు వరుణుడు జలాభిషేకం చేశాడు. ఆత్మీయ పలకరింపులు.. అనురాగపు జల్లులతో ప్రజలు తడిసి ముద్దవగా.. గోదారిగడ్డ పులకించింది.

ఆనాడు మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి‌ గోదారమ్మ వారధిపై నడిచినప్పుడు విశేష సంఖ్యలో ప్రజలు వచ్చారు. మంగళవారం శ్రీమతి షర్మిల వచ్చినప్పుడూ అదే అపురూప ఘట్టం పునరావిష్కృతమైంది. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన జనవాహిని జయజయ ధ్వానాలు పలకగా.. జగనన్న వదిలిన బాణం శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర మంగళవారం ‘పశ్చిమ’ నుంచి తూర్పుగోదావరి జిల్లాలోకి అడుగుపెట్టింది. జిల్లాలోని 13 నియోజకవర్గాలు, 25 మండలాలు, 7 పట్టణాలు, 166 గ్రామాల మీదుగా 278.4 కిలోమీటర్ల మేర నడిచిన శ్రీమతి షర్మిల లక్షలాది మందిని ఆత్మీయంగా పలకరించి ‘తూర్పు’ వైపు అడుగులు వేశారు.

ఏలూరు :

కిరణ్‌ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు.. దానికి వత్తాసుగా నిలుస్తూ ప్రధాన ప్రతిపక్షం టిడిపి సాగిస్తున్న కుమ్మక్కు రాజకీయాలకు నిరసనగా 169 రోజుల క్రితం రాజన్న బిడ్డ.. జననేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల ఇడుపులపాయ నుంచి ప్రారంభించిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ‘పశ్చిమ’లో జనభేరి మోగించింది. జిల్లాలో 24 రోజుల పాటు కొనసాగిన పాదయాత్ర మంగళవారం సాయంత్రం కొవ్వూరులోని రోడ్డు కం రైలు బ్రిడ్జి మీదుగా తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించింది.

ఈ సందర్భంగా వెల్లువలా తరలివచ్చిన ప్రజల సాక్షిగా.. పదేళ్ల క్రితం మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి ఈ వారధిపై నడిచినప్పుడు చోటుచేసుకున్న మహోజ్వల చారిత్రక ఘట్టాన్ని జ్ఞప్తికి తెచ్చింది. హోరుగాలి వీస్తున్నా.. జోరువాన కురుస్తున్నా లెక్కచేయకుండా‌ శ్రీమతి షర్మిల ముందుకు సాగిపోయారు. ప్రజలు సైతం రెట్టించిన ఉత్సాహంతో ఆమె వెంట అడుగులో అడుగు వేస్తూ నడిచారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో 278.4 కిలోమీటర్లు :
చింతలపూడి మండలం గురుభట్లగూడెం వద్ద ఖమ్మం జిల్లా నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో మే నెల 12న ప్రవేశించిన శ్రీమతి షర్మిల పాదయాత్ర ప్రవేశించింది. మొత్తం 24 రోజుల పాటు అప్రతిహతంగా కొనసాగింది. లక్షలాది మందిని పలకరిస్తూ.. వారి ప్రేమ.. ఆప్యాయత.. అనురాగాల నడుమ శ్రీమతి షర్మిల పాదయాత్ర జిల్లాలో విజయవంతంగా ముగిసింది. చిన్న చిన్న గ్రామాల్లో సైతం వేలాది మంది తరలివచ్చి రాజన్న తనయతో మాట్లాడేందుకు.. కరచాలనం చేసేందుకు పోటీలుపడ్డారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ.. ఆవేదన నిండిన గుండెలకు భరోసా ఇస్తూ.. జగనన్న నాయకత్వంలో త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందని.. ప్రజలందరి కష్టాలు తీరే రోజులు సమీపంలోనే ఉన్నాయని శ్రీమతి షర్మిల అభయమిచ్చారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో 13 నియోజకవర్గాలు.. 25 మండలాలు.. 7 పట్టణాలు.. 166 గ్రామాల మీదుగా 278.4 కిలోమీటర్ల మేర శ్రీమతి షర్మిల పాదయాత్ర చేశారు. చింతలపూడి నియోజకవర్గం నుంచి మొదలైన పాదయాత్ర గోపాలపురం, పోలవరం, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, ఉండి, భీమవరం, నరసాపురం, పాలకొల్లు, ఆచంట, తణుకు, నిడదవోలు, కొవ్వూరు నియోజకవర్గాల మీదుగా తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించింది.

అడుగడుగునా మహానేత వైయస్ ‌జ్ఞాపకాలే :
పశ్చిమ గోదావరి జిల్లాలో మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర అడుగడుగునా రాజన్న జ్ఞపకాలతోనే కొనసాగింది. నాయకుడంటే ఎలా ఉండాలి.. ప్రజా సమస్యలు ఎలా తెలుసుకోవాలి.. పాలకులు ప్రజలకు ఎలాంటి మేలు.. ఏ విధంగా చేయాలనే విషయాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి. ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు 2003లో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేసి.. అధికారంలోకి వచ్చిన వెంటనే అందరి కన్నీళ్లు తుడిచారాయన. ప్రజా‌ శ్రేయస్సే ధ్యేయంగా ఐదేళ్లలోనే ఎన్నో అద్భుతమైన పథకాలను అమలుచేసి ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. వైయస్‌ మన మధ్య నుంచి వెళ్లిపోయాక రాష్ట్రం అనాథ అయ్యింది. ఆయన లేడని తెలిసి ఎన్నో గుండెలు ఆగిపోయాయి.

అదే సందర్భంలో రాజన్న అభిమానులను ఓదార్చేందుకు ప్రజల మధ్యకు వచ్చారు ఆయన తనయుడు శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి. ప్రజల పక్షాన నిలిచే కుటుంబం నుంచి వచ్చిన ఆయనకు లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక కుట్రలు, కుతంత్రాలకు తెరలేపారు పాలకులు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు.. ప్రభుత్వంతో అంటకాగుతూ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్న ప్రధాన ప్రతిపక్షం టిడిపి వైఖరికి నిరసనగా అన్నకిచ్చిన మాటకోసం.. నాన్న బాటలో పాదయాత్ర చేపట్టిన శ్రీమతి షర్మిల 9 జిల్లాలు దాటి గత నెల 12న పశ్చిమ గోదావరి జిల్లాలో అడుగుపెట్టారు. జన హృదయనేత రాజన్న తమ మధ్యనే ఉన్నారనిపించేంతగా ప్రజల హృదయాలను ఆమె హత్తుకున్నారు. జిల్లా ప్రజలంతా ఆమెను కన్న కూతురిలా.. చెల్లిలా.. అక్కలా.. భావిస్తూ అడుగడుగునా ఆత్మీయత, అభిమానాలు కురిపించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా.. కుట్రలు పన్నినా.. శ్రీ వైయస్ జగ‌న్‌ను జైలులో బంధించినా ప్రజాభిమానం, ప్రేమల ముందు కాంగ్రెస్, ‌టిడిపిల కుట్రలు సాగవని నిరూపించారు. రాబోయే రోజుల్లో ఓటు ఆయుధంతో ఆ రెండు పార్టీలకు బుద్ధి చెబుతామంటూ ప్రతినబూనారు.

శ్రీ జగన్ అక్రమ నిర్బంధంపై నిరసన‌ :
మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర పొడవునా శ్రీమతి షర్మిలను కలిసిన ప్రజలు వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షు‌డు, జననేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డిని అక్రమంగా జైలులో నిర్బంధించిన కుట్రపూరిత రాజకీయాలపై ధ్వజమెత్తారు. శ్రీ జగన్‌ను జైలులో నిర్బంధించి ఏడాది పూర్తవుతున్న తరుణంలో మే 27న నరసాపురంలో వేలాది మంది కొవ్వొత్తులు వెలిగించి నిరసన ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి షర్మిల పాల్గొన్నారు. ఆ మరుసటి రోజున పాలకొల్లులో శ్రీమతి షర్మిల ఒకరోజు నిరశనదీక్ష చేశారు. ఈ దీక్షకు వేలాదిగా తరలివచ్చిన జనం కాంగ్రెస్ ‌ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షం టిడిపిలపై నిప్పులు చెరిగారు.

రావికంపాడులో మహోజ్వల ఘట్టం :
శ్రీమతి షర్మిల పాదయాత్ర కామవరపుకోట మండలం రావికంపాడులో గతనెల 16న 2వేల కిలోమీటర్ల మైలురాయిని అధిగమించింది. ప్రజా సమస్యలపై పోరాటం సాగిస్తూ.. ప్రపంచంలోనే సుదీర్ఘ పాదయాత్ర చేసిన ఏకైక మహిళగా శ్రీమతి షర్మిల చరిత్ర సృష్టించారు. దీనికి జ్ఞాపికగా రావికంపాడులో 24 అడుగుల వైయస్ విగ్రహాన్ని ‌ఆవిష్కరించారు. భారీ బహిరంగ సభ నిర్వహించారు. జిల్లాలో పాదయాత్ర సందర్భంగా 16చోట్ల ‌వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను శ్రీమతి షర్మిల ఆవిష్కరించారు. పన్నెండుచోట్ల బహిరంగ సభల్లో ప్రసంగించి కాంగ్రెస్ ‌ప్రభుత్వం, చంద్రబాబు తీరుపై నిప్పులు చెరిగారు. ఐదుచోట్ల రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించి మహిళలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇలా ప్రతిచోటా శ్రీమతి షర్మిల నిర్వహించిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో విజయవంతంగా పూర్తయింది.

Back to Top